సాక్షి, అమరావతి: ఏ నేరానికి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి.. ఒకే తరహా నేరాల్లో పాత నేరస్తుల ప్రమేయం ఏమైనా ఉందా.. ఏ నేరస్తుడు ఎక్కడున్నాడు.. నేరాల తీరు ఎలా ఉంది.. ఏ నేరంపై ఎన్నాళ్లు శిక్ష పడి.. జైళ్లలో ఎంతమంది ఉన్నారు.. ఏయే కేసులు కోర్టు విచారణలో పెండింగ్‌లో ఉన్నాయి.. పోలీసు కేసు దర్యాప్తు ఎలా సాగుతోందనే సమస్త వివరాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉండనుంది. మారుతున్న కాలంతో పాటు అంతే వేగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన సాంకేతిక విభాగం ముందంజలో ఉంది. దిశ, ఏపీ పోలీస్ సేవా యాప్‌ల తరహాలోనే రాష్ట్రంలోని పోలీస్ సిబ్బంది కోసం ‘ఏపీ కాప్ యాప్’ అందుబాటులోకి రానుంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ యాప్‌ను మరో రెండు నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తద్వారా రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్లలోని పోలీసుల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ వినియోగంలోకి వస్తే కేసుల దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది.
యాప్ ప్రత్యేకతలుఇవీ..
పోలీస్ రికార్డులకు ఎక్కిన వారు, పలు కేసుల్లో జైళ్లలో ఉన్న వారి వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించిన వారి వివరాలను ‘ఈ కోర్ట్స్ ఆన్‌లైన్’ అప్లికేషన్ ద్వారా సేకరించారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 21 వేల మంది రౌడీషీటర్లు, 28 వేల హిస్టరీ షీట్లు కలిపి మొత్తం 52 వేల మంది వివరాలను ఆన్‌లైన్ చేశారు. పోలీస్, జైల్స్, ఈ కోర్ట్స్, రౌడీ షీటర్స్, హిస్టరీ షీట్స్ ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. ఇందులో ఎమర్జెన్సీ రెస్పాన్స్, నేర పరిశోధన (క్రైమ్ డిటెక్షన్), ఈ హంట్ (కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం), నేర నిరోధానికి ముందస్తు చర్యలు, స్పందన, కేసుల వివరాలు (ఈ డీఎస్సార్), కోర్టులు, విచారణలు, పోలీస్ సంక్షేమం, వార్తల అప్‌డేట్ (న్యూస్ వాచ్), బాడీ వోర్న్ కెమెరాల డేటా, నేర పరిశోధనలో వివరాలు తెలుసుకోవడం (ఈ లెరి్నంగ్), వర్చువల్ పోలీసింగ్, సోషల్ మీడియా అప్‌డేట్, అవసరమైన సమాచారం, పోలీసుల ఆలోచనలు, నోటిఫికేషన్స్ వంటి కీలక ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
పోలీస్ చేతిలో ఇది బ్రహ్మాస్త్రమే
శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం తలమునకలయ్యే పోలీసులకు ‘ఏపీ కాప్ యాప్’ బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమవుతుంది. నేర స్వభావం కలిగిన వ్యక్తులు ఏ ప్రాంతంలో.. ఏ తరహా నేరాలు ఎవరు ఎక్కువగా చేస్తుంటారనే కీలక వివరాలు పోలీసులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతోనే ఈ యాప్‌ను రూపొందిస్తున్నాం. సాధ్యమైనన్ని వివరాలు పోలీసులకు అందుబాటులో ఉండేలా పోలీస్ రికార్డులు, ఈ ప్రిజన్స్, ఈ కోర్ట్స్ విభాగాల ద్వారా సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నాం. నేరస్తుల ఫొటోలు, వేలిముద్రలు, చిరునామా తదితర పూర్తి సమాచారం అందుబాటులో ఉంటాయి. దీన్ని నిరంతర ప్రక్రియగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తాం. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తాం.
– డి.గౌతమ్ సవాంగ్, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment