అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ గౌతం సవాంగ్
సాక్షి, అమరావతి: అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ పోలీస్ శాఖ తాజాగా టెక్నాలజీ విభాగంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. దేశంలో అనేక విభాగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ‘డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్’ ప్రకటించిన అవార్డుల్లో తన సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 12 అవార్డులను ప్రకటించగా అందులో ఏకంగా నాలుగింటిని ఎగరేసుకుపోయింది. ఏపీ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న దిశ మొబైల్ అప్లికేషన్, దిశ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్, 4ఎస్4యు యూట్యూబ్ చానెల్‌కు ఈ నాలుగు అవార్డులు దక్కాయి. వెబినార్ ద్వారా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డులను అందుకున్నారు.
‘దిశ’కు అవార్డుల పంట
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దిశ బిల్లును ఆమోదించి దిశ స్కీమ్ పేరుతో చేపడుతున్న అనేక కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిశ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. దిశ మొబైల్ అప్లికేషన్‌కు తాజాగా డిజిటల్ టెక్నాలజీ సభ గ్రూప్ ఇచ్చినదానితో కలిపి ఇప్పటివరకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. దిశ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు కూడా తాజా అవార్డుతో కలిపి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల దిశ క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన సంగతి తెలిసిందే.
సెంట్రల్ లాకప్ మానిటరింగ్‌లో ఏపీ ఫస్ట్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ‘సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్’ అమలులో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం, మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెంట్రల్ లాకప్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. ప్రతి పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఆడియో, వీడియో, నైట్ విజన్లతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటుకుగాను ఏపీ పోలీస్ శాఖ రెండోసారి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన 4ఎస్4యు యూట్యూబ్ చానెల్‌కు మరోసారి జాతీయ స్థాయి అవార్డు దక్కడం విశేషం.
ఏపీ పోలీస్ శాఖకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖ గత 13 నెలల కాలంలో ఏకంగా 112 జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుని చరిత్ర సృష్టించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అభినందనలు తెలిపారని డీజీపీ సవాంగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న పోలీస్ సిబ్బందిని ప్రశంసించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment