
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్, థాయిలాండ్(Myanmar, Thailand)లను తాకిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటివరకు సుమారు 1,700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం నిర్థారించింది. సుమారు 3,400 మంది గాయపడ్డారని, 300 మంది గల్లంతయ్యారని తెలిపింది.
బ్యాంకాక్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే..
బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి పెరిగిందని నగర అధికారులు తెలిపారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అథారిటీ(Bangkok Metropolitan Authority) తెలిపిన వివరాల ప్రకారం 32 మంది గాయపడ్డారు. 82 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వీరు నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల టవర్‌లో గల్లంతయ్యారని సమాచారం. ఈ భూకంపం మధ్య మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా సంభవించింది. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.
సాయం కోసం రెడ్ క్రాస్ విజ్ఞప్తి
భూకంప బాధితులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ(International Red Cross and Red Crescent Society)ల సమాఖ్య (ఐఎఫ్‌ఆర్‌సీ)100 మిలియన్ డాలర్ల పైగా మొత్తం అత్యవసరమని విజ్ఞప్తి చేసింది. అలాగే భూకంపం సంభవించిన ప్రాంతంలో అవసరాలు అంతకంతకూ పెగుతున్నాయని పేర్కొంది. రాబోయే 24 నెలల్లో లక్ష కుటుంబాలకు సహాయం అందించేందుకు మరింతగా నిధులు అవసరం కానున్నాయని పేర్కొంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మరో సంక్షోభం తలెత్తకముందే అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది. ఇది విపత్తు మాత్రమే కాదని, సంక్లిష్టమైన మానవతా సంక్షోభమని ఐఎఫ్‌ఆర్‌సీ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ పేర్కొన్నారు.

‘ఈ సమయంలో వైమానిక దాడులా?’
1,700 మందిని బలిగొన్న భూకంపంతో దేశం అతలాకుతలం అవుతున్నసమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సాయుధ ప్రతిఘటన ఉద్యమం గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించడంపై మయన్మార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెన్ నేషనల్ యూనియన్ జంటా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తూనే ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ పరిస్థితులలో సైన్యం సహాయ చర్యలకు ముందుకు వస్తుందని, అయితే ఇప్పుడు దీనికి బదులుగా దేశ ప్రజలపై దాడి చేయడానికి బలగాలను మోహరించడం దురదృష్టకరమని పేర్కొంది.
#OperationBrahma continues. @indiannavy ships INS Karmuk and LCU 52 are headed for Yangon with 30 tonnes of disaster relief and medical supplies.
🇮🇳 🇲🇲 pic.twitter.com/mLTXPrwn5h— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 30, 2025
భారత్ నుంచి 30 టన్నుల సహాయక సామగ్రి
భారత నావికాదళ నౌకలు మయన్మార్‌కు 30 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు తెలిపారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కార్ముక్, ఎల్‌సీయూలు 52 భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకువెళ్లాయని అయన పేర్కొన్నారు. ఈ సహాయ చర్యలు ఆపరేషన్ బ్రహ్మలో భాగమని తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ‘ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోంది. భారత నావికాదళ నౌకలు 30 టన్నుల సహాయక, వైద్య సామాగ్రితో యాంగోన్‌కు వెళ్లాయని తెలిపారు."

మయన్మార్‌కు భారత రెస్క్యూ బృందం
భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం 10 మంది సిబ్బందితో కూడిన మొదటి సహాయక బృందం మయన్మార్‌లోని మండలే అంతర్జాతీయ విమానాశ్రయానికి(Mandalay International Airport) చేరుకుంది. ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. భారీ పరికరాలు, సహాయక సామగ్రిని తరలించేందుకు ఈ బృందం సోమవారం రోడ్డు మార్గంలో ప్రయాణించనుంది. కాగా భారత నేవీ నౌకలు సహాయ సామగ్రిని మయన్మార్‌కు తీసుకువెళుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

‘సహాయం అందినా ప్రాణం పోయింది’
మయన్మార్‌లోని మండలేలో కూలిపోయిన అపార్ట్‌మెంట్ శిథిల్లాల్లో ఒక గర్భిణి 55 గంటల పాటు చిక్కకుపోయింది. రెస్క్యూ సిబ్బంది బాధితురాలు, 35 ఏళ్ల మాథు తుల్విన్ ప్రాణాలను కాపాడారు. అయితే స్కై విల్లా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ శిథిలాల నుండి ఆమెను బయటకు తీసిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది.
‘హూ’నుంచి మూడు టన్నుల వైద్య సామగ్రి
మయన్మార్‌ను కుదిపేసిన భూకంపాలలో గాయపడిన వేలాది మందికి సాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(హూ)దాదాపు మూడు టన్నుల వైద్య సామగ్రిని పంపింది. ట్రామా కిట్లు,టెంట్లతో సహా వైద్య సామగ్రి ఇప్పటికే వెయ్యి పడకల ఆసుపత్రికి చేరుకున్నాయని ‘హూ’ ఒక ప్రకటనలో తెలిపింది. భూకంప సంభవించిన 24 గంటల వ్యవధిలోపునే యాంగోన్‌లోని అత్యవసర వైద్య సామగ్రి నిల్వ నుంచి ఈ సామగ్రిని తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ధ్వంసమైన 50 మసీదులు
మయన్మార్‌లో శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు ముస్లింలు చేరుకుంటున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఈ ప్రమాదం బారినపడి వందలాది మంది ముస్లింలు మృతిచెంది ఉంటారనే అంచనాలున్నాయి. భూకంపం సంభవించినప్పుడు, మండలేలో ఉంటున్న ఒక ముస్లిం తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మసీదు పక్కనే ఉన్న తన ఇల్లు కూలిపోయిందని, తన అమ్మమ్మ, ఇద్దరు మామలు శిథిలాల కింద చిక్కకున్నారని తెలిపారు. నగరంలో శిథిలాల భవనాలు అలానే ఉన్నాయని, రెస్క్యూ బృందాలు అందించే సాయం సరిపోవడం లేదని ఆయన కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. షాడో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 50కి పైగా మసీదులు ధ్వంసమయ్యాయి.
ఇది కూడా చదవండి: Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం