భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్‌ అంటూ ప్రశంసలు | How Nurses Save Babies When Myanmar Quake Shook China | Sakshi
Sakshi News home page

భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్‌ అంటూ ప్రశంసలు

Published Sun, Mar 30 2025 11:39 AM | Last Updated on Sun, Mar 30 2025 2:12 PM

How Nurses Save Babies When Myanmar Quake Shook China

మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.

మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం​ మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్‌ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్‌ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..
ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్‌ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, వాటర్‌ ప్యూరిఫయర్లు, సోలార్‌ ల్యాంప్‌, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్‌ వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement