
మయన్మార్‌లో పెనువిషాదం
శిథిలాల కింద మృత్యుఘోష
బయటపడే అవకాశాలు లేనట్టే
నత్తనడకన సహాయక చర్యలు
వనరుల లేమి, రవాణా కష్టాలు
1,700 దాటిన మృతుల సంఖ్య
5.1 తీవ్రతతో మరో భూకంపం
మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నానాయి. ఇప్పటికే రెండు రోజులు దాటిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. దాంతో రాజధాని నేపిడా మొదలుకుని ఏ నగరంలో చూసినా మృత్యుఘోషే విన్పిస్తోంది.
ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మాండలేలో శిథిలాల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి! అంతర్జాతీయంగా అందుతున్న సాయం ఏ మూలకూ చాలడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నేపిడా సమీపంలో శనివారం రెండుసార్లు 4.7, 4.3 తీవ్రతతో భూమి కంపించడం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో జనం భయాందోళనలతో ఇళ్లను వీడి వీధుల్లోకి పరుగులు తీశారు. స్వల్ప స్థాయి ప్రకంపనలు రోజంతా కొనసాగాయి. రోడ్డు, రైలు మార్గాలు, బ్రిడ్జిల వంటివన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థలన్నీ పడకేశాయి. దాంతో సహాయక బృందాలను బాధిత ప్రాంతాలకు తరలించడమే సవాలుగా మారింది.
సమాచార వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. వీటికి తోడు 41 డిగ్రీల పై చిలుకు ఎండ ఠారెత్తిస్తోంది. చాలాచోట్ల శిథిలాలను పారలు, చేతులతోనే తొలగించేందుకు స్థానికులు ప్రయతి్నస్తున్నారు! ఇన్ని ప్రతికూలతల మధ్యే ఇప్పటిదాకా 1,700కు పైగా మృతదేహాలను వెలికితీశారు. అయితే సహాయక బృందాలు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకోనే లేదు. తిరుగుబాటుదారుల అ«దీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల ఊసే లేదు. దాంతో అక్కడి మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారమూ లేదు. ఈ నేపథ్యంలో మరణాలు 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు.
భారత్ ఆపద్బాంధవ పాత్ర
కల్లోల మయన్మార్‌ను ఆదుకోవడంతో భారత్ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఇప్పటికే ఐదు సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయక సామగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామగ్రి సముద్ర మార్గాన చేరుకుంటోంది. 80 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్ బృందం కూడా తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో వాయు మార్గాన తరలించిన తాత్కాలిక ఆస్పత్రి రెండుగా విడిపోయి మాండలే, నేపిడాల్లో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటోంది.
మాండలేలో ఆకలి కేకలు
15 లక్షల జనాభా ఉన్న మాండలేలో విధ్వంసం మాటలకందని రీతిలో ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ నిర్మణాలన్నీ కుప్పకూలడమో, భారీగా పగుళ్లివ్వడమో జరిగింది. దాంతో నగరవాసులు వీధుల్లోనే గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కిన తమవారిని ఎలాగోలా కాపాడుకోవాలని తపిస్తున్నారు. పారలు, పలుగులతో వాటిని తవ్వి తీసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే తిండికి, తాగునీటికి కూడా వాళ్లు అల్లాడిపోతున్న పరిస్థితి! శిథిలాల తొలగింపుకే నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కేథలిక్ రిలీఫ్ సరీ్వసెస్ మేనేజర్ కారా బ్రాగ్ అభిప్రాయపడ్డారు.
‘‘క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు చాలినన్ని సదుపాయాల్లేవు. ఔషధాలు తదితరాలకు తీవ్ర కొరత ఉంది. తిండికి, తాగునీటికి కొరత తీవ్రతరమవుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేపిడా, మాండలే విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ నగరాలకు వాయుమార్గాన సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపు అసాధ్యంగా మారింది. నేపిడాలో ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణకే సైనిక సర్కారు ప్రాధాన్యమిస్తోంది. దాంతో సాధారణ ప్రజల దైన్యాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.
థాయ్‌లాండ్‌లో 18కి మృతులు
శుక్రవారం నాటి భూకంపంతో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. బ్యాంకాక్‌లో కుప్పకూలిన 33 అంతçస్తులు నిర్మాణంలోని భవనం శిథిలాల్లో నుంచి ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికితీశారు.