
న్యూఢిల్లీ: భారత్ తన అంతరిక్ష యాత్రలో అరుదైన మైలురాయిని చేరుకోవడానికి మూహూర్తం ఖరారైంది. భారత్ కు చెందిన వ్యోమగామి శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్((ఐఎస్‌ఎస్) లోకి వెళ్లనున్నారు. వచ్చే నెలలో శుభాన్ష్ శుక్లా స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టే విషయాన్ని తాజాగా వెల్లడించారు శాస్త్ర సాంకేతికత మంత్రి డా. జితేందర్ సింగ్.
‘అంతర్జాతీయ స్పేష్ మిషన్ భారత వ్యోమగామిని తీసుకువెళ్లడానికి మూహూర్తం ఖరారు చేయబడింది . వచ్చే నెలలో ‘గగన్ యాత్రి’ గ్రూప్ కు కెప్టెన్ గా ఉన్న శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్నారు. ఇది భారత అంతరిక్ష యాత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడుతుంది. ఇస్రో సరికొత్త హద్దులను ఛేదించడానికి ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష యాత్రకు సిద్ధంగా ఉన్నాడు.మన అంతరిక్ష కలలు మరింత ఎత్తును తాకడానికి ఈ సన్నాహక యాత్ర కచ్చితంగా మైలురాయి కాబోతుంది’ అని జితేందర్ సింగ్ పేర్కొన్నారు.
యాక్సియోమ్ 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన స్పేస్ క్రాఫ్ కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విటన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి పైలట్ గా శుభాన్ష్ శుక్లా వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు ఉజ్ నాన్ స్కీ(పోలెండ్), టిబోర్ కపూ( హంగేరీ)లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు చేసిన అనంతరం భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భాగస్వామిగా ఉంది.
ఇస్రో వ్యోమగామి శుభాన్ష్ శుక్లా ఐఏఎన్ఎస్ లోకి అడుగుపెడితే అక్కడకు వెళ్లిన తొలి భారతీయుడిగా, రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇస్రో మావనసహిత అంతరిక్ష మిషన్‌లో భాగంగా గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్ష్ ఒకరుగా ఉన్నారు.