
సౌదీ అరేబియాపై మోదీ ప్రశంసలు
జెడ్డా: ‘‘భారత్–సౌదీ అరేబియా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అందుకు నా పర్యటన దోహదపడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహా్వనం మేరకు ఆయన మంగళవారం సౌదీలో పర్యటించారు. మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆరు ఎఫ్–15 ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా నిలవడం విశేషం. సంబంధిత వీడియోను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది.
మోదీకి లభించిన అపూర్వ ఆహ్వనం భారత్–సౌదీ అరేబియా మధ్య బలపడుతున్న రక్షణ సహకారానికి ప్రతీక అని పేర్కొంది. ఎయిర్‌పోర్టు నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. సౌదీ గాయకుడు హషీం అబ్బాస్ ‘ఆయే వతన్ మేరే ఆబాద్ రాహే తూ’ హిందీ పాటను చక్కగా ఆలపించారు. మోదీ చప్పట్లతో ఆ గాయకుడిని అభినందించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులతో ఆప్యాయంగా మాట్లాడారు.
సౌదీ యువరాజు నా సహోదరుడు
భారత్‌కు సౌదీ అత్యంత విలువైన, విశ్వసనీయమైన మిత్రదేశమని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మంగళవారం ‘అరబ్ న్యూస్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని రెండు దేశాలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు.