సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను సాదరంగా స్వాగతించారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ఎందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టారు ? సౌదీ యువరాజు అంత శక్తివంతుడా ? మనకు అంత ముఖ్యుడా? ఆయన్ని అంతలా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందా ? ఉంటే ఎందుకు ?
మన దేశ ఆర్థిక వ్యవహారాలను, రాజకీయాలను ప్రభావితం చేసే ప్రతిభావంతులైన విదేశీ నాయకులను స్వాగతించేందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెడితే తప్పులేదు. సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తర్వాత అంతటి శక్తిమంతుడు సౌదీ యువరాజ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనడంలో సందేహం లేదు. ఐక్యరాజ్య సమితిలో కుదుర్చుకున్న అంతర్జాతీయ అవగాహన ప్రకారం మానవ హక్కులను కాలరాస్తున్న దేశాధిపతులకు స్వాగతం చెప్పడంలో ఏ దేశమైనా ప్రత్యేక ఆదరాభిమానాలను ప్రదర్శించకూడదు. అంటే, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు.
వృత్తికి అంకితమైన ధీరోదాత్తమైన జర్నలిస్టుగా ప్రశంసలు అందుకున్న జమాల్ ఖషోగ్గిని హత్య చేసి, ఆయన శరీర భాగాల ఆనవాళ్లు కూడా దొరక్కుండా యాసిడ్‌లో కరగించి మురికి కాల్వలో పారబోసారని, సౌదీ యువరాజు కుట్ర వల్లనే ఇది జరిగిందని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం సౌదీని బహిష్కరించాలంటూ పలు దేశాలు పిలుపునిచ్చాయి. ఖషోగ్గి గతంలో ఆల్ వతన్ అనే సౌదీ పత్రికకు ఎడిటర్‌గా, ఆల్ అరబ్ న్యూస్ ఛానల్‌కు జనరల్ మేనేజర్‌గా, ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. సౌదీ యువరాజు అణచివేత చర్యలను భరించలేక అమెరికా వచ్చి స్థిరపడిన ఖషోగ్గి ‘ది వాషింఘ్టన్ పోస్ట్’లో కాలమిస్ట్‌గా స్థిర పడ్డారు.
ఆయన తన మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గత అక్టోబర్ రెండో తేదీన ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆయన్ని హత్య చేశారు. ‘ఇస్తాంబుల్‌లో కషోగ్గి హత్యకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారని సీఐఏ ధ్రువీకరణకు వచ్చింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా సీఐఏ సేకరించింది’ అంటూ వాషింగ్టన్ పోస్ట్ నవంబర్ 18వ తేదీన ఓ వార్తను ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాసిన సుదీర్ఘ లేఖను కూడా ఆ పత్రిక నవంబర్ 20వ తేదీన ప్రచురించింది. అందులో ‘ నేను గతేడాది సౌదీ పర్యటనకు వెళ్లి విస్తతంగా చర్చలు జరపడం వల్ల ఆ దేశం అమెరికాలో 45 000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దాని వల్ల మా దేశంలో ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. చమురు ఉత్పత్తులో కూడా ప్రపంచంలో మా రెండు దేశాలు ముందున్నాయి. మా సూచనల మేరకు ప్రపంచ దేశాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించింది కూడా. కానీ జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య గురించి మా ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారాన్ని రాబట్టాయి. అందులో పూర్తి నిజాలు మాకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. మేము విన్న వార్తలు కూడా అబద్ధం కావచ్చు. మాకు అంతర్జాతీయ సంబంధాలకన్నా అమెరికా అంతర్గత సంబంధాలు మాకు ముఖ్యం. మా దేశ ప్రయోజనాలు ముఖ్యం. దేశాధినేతగా దేశ ప్రయోజనాలను పరిరక్షించడం నా బాధ్యత. కషోగ్గి హత్య విషయంలో సౌదీని దూరం పెట్టక తప్పడం లేదు’ అన్నది ట్రంప్ సుదీర్ఘ లేఖలోని సారాంశం.
మరి అలాంటి సౌదీ యువరాజును మనం ఎందుకు దగ్గర తీసుకున్నట్లు ? పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్‌ను ఏకాకిని చేయడంలో సౌదీ రాజు పనికి వస్తారన్నది మోదీ వ్యూహమా? పుల్వామా సంఘటనపై ఐక్యరాజ్య సమితిలో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ పాక్ ప్రధానితో కలిసి సంయుక్త ప్రకటన చేసిన సౌదీ యువరాజు మనతో కలిసి వస్తారా ? అంత ఘనంగా స్వాగతించి పిలిచినప్పుడు పాక్‌లో చేసిన సంయుక్త ప్రకటనను ఉపసంహరించుకునేలా మోదీ ఒప్పించి ఉండాల్సింది. ఆర్థికంగా, రాజకీయంగా ప్రధాన భాగస్వామిగా పరిగణిస్తున్నా పాకిస్థాన్‌ను సౌదీ దూరంగా పెట్టడమనేది కలలోని మాట.
Comments
Please login to add a commentAdd a comment