వ్యూహాత్మక స్నేహబంధం | Sakshi Editorial On PM Modi And Mohammed bin Salman Meet | Sakshi
Sakshi News home page

వ్యూహాత్మక స్నేహబంధం

Published Wed, Sep 13 2023 12:18 AM | Last Updated on Wed, Sep 13 2023 4:48 AM

Sakshi Editorial On PM Modi And Mohammed bin Salman Meet

కొన్నిసార్లు అంతే... కీలక పరిణామాలన్నీ కొద్ది వ్యవధిలో జరిగిపోతుంటాయి. ఢిల్లీలో జీ20 సదస్సు ముగియగానే మరో ముఖ్యపరిణామం సంభవించింది. సోమవారం భారత ప్రధాని మోదీ, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సాద్‌ల సహ అధ్యక్షతన భారత – సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) తొలి శిఖరాగ్రస్థాయి సమావేశం జరిగింది. విస్తృత చర్చల అనంతరం రెండు దేశాలూ తమ వాణిజ్య, రక్షణ బంధాలను విస్తరించుకోవాలని నిర్ణయించాయి.

భారత్‌లో ఒక రోజు పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజుతో జరిగిన ఈ కీలక నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావం చూపగలిగేది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండు పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య పెరుగుతున్న సహకారం మధ్యప్రాచ్య – హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు కీలకం. అందుకే, ఈ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

జీ20లో కీలక ‘ఇండియా– మధ్యప్రాచ్యం– యూరప్‌ ఆర్థిక నడవా’ (ఐఎంఈసీ) ప్రకటించిన వెనువెంటనే... ఆ నడవాలో భాగమయ్యే సౌదీతో భారత బంధాల విస్తరణ శుభపరిణామం. రెండు దేశాల మధ్య ఎస్పీసీ 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని, రియాద్‌ పర్యటనలోనే ఏర్పాటైంది. బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత సౌదీ అలాంటి భాగస్వామ్యం కుదుర్చుకున్న నాలుగో దేశం ఇండియానే!  సరిగ్గా ఏడాది క్రితం 2022 సెప్టెంబర్‌లో మన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సౌదీ వెళ్ళి, ఎస్పీసీ మంత్రిత్వ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అప్పట్లోనే సౌదీలో మన రూపే కార్డ్‌ వినియోగం సహా అనేక అంశాలు ప్రధాన సహకార అంశాలుగా చర్చకు వచ్చాయి. సోమవారం రెండు దేశాల నేతల మధ్య చర్చలు అందుకు కొనసాగింపు.  

నిజానికి, కొన్నేళ్ళుగా భారత, సౌదీల బంధం బలపడుతోంది. విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలున్న రెండు దేశాలూ వాణిజ్యం నుంచి సాంస్కృతికం దాకా బాంధవ్యాలు పెట్టుకుంటున్నాయి. ద్వైపాక్షిక బంధాలు పటిష్ఠం కావాలంటే సాంస్కృతిక సంబంధాలు కీలకం. అందు లోనూ రెండు దేశాలూ అడుగులు వేశాయి. సౌదీలో పవిత్ర మక్కా నగరానికి మనదేశం నుంచే ఏటా వేల మంది హజ్‌ యాత్ర సాగిస్తుంటారు. భారత్‌ నుంచి ఏటా 1.75 లక్షల మందికి పైగా హజ్‌ యాత్రికులకు అవకాశం కల్పిస్తూ, ఈ ఏడాది మొదట్లోనే సౌదీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఒక దేశం నుంచి చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఇంత భారీ సంఖ్యలో యాత్రికుల్ని అనుమతిస్తామంటూ సౌదీ కోటా ఇవ్వడం విశేషం. అలాగే, ఆ రాజ్యంలో అత్యధిక ప్రవాసుల సంఖ్య కూడా మనదే! 22 లక్షల మందికి పైగా భారతీయ ప్రవాసులు సౌదీలో ఉన్నారు. ఇవన్నీ భారత్, సౌదీలను మరింత సన్నిహితం చేస్తున్నాయి. ప్రవాసులంతా తమ దేశంలో భాగమేననీ, వారిని సొంత పౌరులలా కడుపులో పెట్టుకుంటామనీ సౌదీ యువరాజు తాజా పర్యటనలోనూ స్పష్టం చేయడం విశేషం.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన రెండు దేశాలూ ప్రధానమైనవి. భారత్‌కు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీయే! ఇక, సౌదీకి రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి భారత్‌ అని 2022 లెక్క. మన ముడిచమురు దిగుమతుల్లో 18 శాతం పైగా అందిస్తున్నది ఈ అరబ్బు రాజ్యమే. కలసి ప్రగతి బాటలో సాగాలనే లక్ష్యంతో ఇరు దేశాలూ డిజిటల్‌ పేమెంట్స్, రక్షణ ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం లాంటి రంగాల్లోనూ వాణిజ్య అవకాశాలను అన్వేషిస్తూ వచ్చాయి. సౌదీ యువరాజు, భారత ప్రధాని సహా ఉన్నతస్థాయి వ్యక్తులు కొద్దికాలంగా జరుపు తున్న పర్యటనలు ఈ బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. దానికి తగ్గట్టే ఇరుదేశాలూ తమకు ఉమ్మడి అంశాలైన తీవ్రవాదంపై పోరు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంపై దృష్టి సారిస్తున్నాయి. 

సోమవారం నాటి చర్చల్లో మహారాష్ట్ర తీరంలో నిర్మించనున్న 5 వేల కోట్ల డాలర్ల విలువైన వెస్ట్‌ కోస్ట్‌ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా అమలు చేయాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. అందుకు ఓ సంయుక్త సత్వర కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించాయి. ఇంధనం, రక్షణ, సెమీకండక్టర్, అంతరిక్ష రంగాల్లో ముమ్మర సహకారానికి వీలున్నట్టు గుర్తించాయి.

డిజిటలీకరణ, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకొనేందుకు 8 ఒప్పందాలపై సంతకాలూ చేశాయి. వాస్తవానికి, భారత్, సౌదీల మధ్య సత్సంబంధాల విస్తరణ కేవలం రెండు దేశాలకే కాక, మధ్యప్రాచ్యం – హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటికీ కీలకం. ఈ ప్రాంతంలో సుస్థిరత, ఆర్థికాభివృద్ధి, భద్రతకు తోడ్పడుతుంది. అందుకే భారత్‌ సైతం ఒకపక్క వ్యూహాత్మకంగా ఇజ్రాయి ల్‌తో బంధాన్ని పదిలంగా చూసుకుంటూనే, ఇతర అరబ్‌ దేశాలతో మాటామంతీ సాగిస్తోంది. 

సౌదీతో మన వ్యూహాత్మక ప్రయోజనాలూ అనేకం. చైనాను మినహాయిస్తే, పాకిస్తాన్‌పై ఒత్తిడి చేయగల ఏకైక దేశం సౌదీనే. అందువల్లే, పాక్‌తో దానికున్న సంబంధాలకు అతీతంగా మన దేశమూ అరబ్బు రాజ్యంతో బలమైన బంధం పెట్టుకుంటోంది. ఇటీవలే ఇరాన్‌తో శత్రుత్వానికి స్వస్తి పలికిన సౌదీ జొహాన్స్‌బర్గ్‌ సదస్సులో ‘బ్రిక్స్‌’లో సైతం సభ్యత్వం తీసుకుంది.

ఆ పరిణామాల తర్వాత ప్రిన్స్‌ పర్యటనగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఫిబ్రవరిలో భారత్‌ సందర్శించిన సౌదీ ప్రిన్స్‌ ఇప్పుడు మళ్ళీ రావడం, ఈసారి భారత– జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పైనా దృష్టి పెట్టడానికి ఇరుపక్షాలూ అంగీకరించడం గమనించదగ్గవి. మొత్తానికి, ఈ బంధం వేగంగా పరిణతి చెందుతోంది. తగ్గట్టే మధ్యప్రాచ్యంపై భారత విధానమూ వివిధ రూపాలు తీసుకుంటోంది. సరికొత్త వ్యూహాత్మక కూటమికి పురుడుపోస్తోంది. సౌదీతో స్నేహంలో తాజా భేటీ మరో ముందడుగు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement