ముందుకు కదలని ముచ్చట | Sakshi Editorial On G20 Summit in Brasil | Sakshi
Sakshi News home page

ముందుకు కదలని ముచ్చట

Published Thu, Nov 21 2024 3:59 AM | Last Updated on Thu, Nov 21 2024 3:59 AM

Sakshi Editorial On G20 Summit in Brasil

మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్‌లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. 

కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. 

మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. 

ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్‌–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 

2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్‌లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్‌ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. 

కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. 

సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్‌29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్‌ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. 

ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. 

ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్‌ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. 

జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement