
ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాణిజ్యం అంటే కుదరదని, ఉగ్రవాదానికి ఊతమిస్తూ నీళ్లు కావాలంటే చెల్లదని, ఉగ్రవాదానికి అండదండలందిస్తూ చర్చలంటే అంగీకరించబోమని, అణు బెదిరింపులు తమను భయపెట్టలేవని మోదీ పంపిన సందేశంతోనైనా పాకిస్తాన్ ఇకపై బుద్ధెరిగి ప్రవర్తించాలి.
జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతమూ కశ్మీర్ విషయంలో పాక్ తీరుతెన్నులపై భారత్ వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టింది. ఒక కొత్త క్రమం బయల్దేరిందన్న సంకేతాన్నిచ్చింది. ఇకపై ఉగ్రవాదులనూ, వారికి సాయం చేసే ప్రభుత్వాన్నీ వేర్వేరుగా పరిగణించబోమని ఆయన ప్రకటించటం ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు...ప్రపంచ దేశాలన్నీ గమనించాల్సిన అత్యంత కీలక అంశం.
కాల్పుల విరమణ తాత్కాలిక దశేనని, ఉగ్రవాదం శిరసెత్తినప్పుడల్లా ‘ఆపరే షన్ సిందూర్’ కొనసాగుతూనే వుంటుందని మోదీ చెప్పటం గమనార్హం. ఉగ్రవాదం విషయంలో అమెరికా నిర్లిప్తంగా ఉంటున్నది. 2001లో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ‘ఉగ్ర వాదంపై యుద్ధం’ పేరిట ప్రపంచంలో ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రక టించిన అమెరికా... కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు వెనకేసు కొస్తోంది.
మొన్నటికి మొన్న పాక్‌కు ఐఎంఎఫ్ అప్పు పుట్టడంలో యథోచితంగా సహకరించింది. దాని చీకటి వ్యవహారాలు తెలియనట్టే ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు నిధులూ, ఆయుధాలూ ఉదారంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని మోదీ ప్రకటించాల్సి వచ్చింది. దారుణ ఉదంతాలు జరిగినప్పుడల్లా ఏదో కారణం చూపి పాకిస్తాన్‌ను గట్టెక్కి స్తున్న దేశాలు ఇకముందు దీన్ని గమనించుకోక తప్పదు.
ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా పట్టువిడుపులు ప్రదర్శించటంలోనే పరిణతి వ్యక్తమవుతుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ, అక్కడి సైన్యం ప్రతిఘటనను తిప్పికొట్టడంలోనూ తెగువనూ, సాహసాన్నీ చూపిన భారత్... లక్ష్యసాధన పూర్తికాగానే కాల్పుల విరమణకు కూడా సిద్ధపడి తన పరిణతిని తెలియజెప్పింది.
కానీ విఫల రాజ్యం అనే పేరును సార్థకం చేసుకుంటూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ వెంటనే ఉల్లంఘించి పాక్ తన నైజాన్ని చాటుకుంది. ఆ దేశంలో రాజకీయ నాయకత్వానికీ, సైన్యానికీ ఎప్పుడూ సరైన సంబంధాలు ఉండవన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సైనిక దళాలు సైతం ముఠాలుగా చీలివున్నాయని, వాటిపై ఎవరికీ అదుపులేదని తాజా పరిణామాలు నిరూపించాయి.
ఈ నిజాన్ని గ్రహించకుండా, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు యుద్ధాన్ని నివారించామని స్వోత్కర్షకు పోవటం... భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం ఆశ్చర్య కరం. పాకిస్తాన్ చర్యల పర్యవసానం తమ వరకూ రానేరాదన్న భ్రమేదో ఆయనకున్నట్టుంది. కానీ ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయకపోతే అది ఏ దేశాన్నీ విడవకుండా మింగేస్తుందని ట్రంప్ గ్రహించటం అవసరం.
ఉగ్రముఠాలను ప్రోత్సహించి ఊచకోతలను సాగిస్తున్న దేశాన్ని ఎవరైనా ఎలా ఉపేక్షించగలరు? దాని దగ్గర అణ్వాయుధాలున్నాయనీ, అది ముప్పు కలిగిస్తుందనీ... కనుక నోర్మూసుకు పడివుండాలనీ ట్రంప్ చెప్పదల్చుకున్నారా? వాణిజ్యాన్ని ఆపేస్తానని బెదిరించటంవల్ల రెండు దేశాలూ దారికొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన అనటం కూడా అత్యంత అభ్యంతరకరమైంది. ఇలాంటి తర్కంతో ప్రోత్సహిస్తున్నదెవరినో గమనించుకుంటున్నారా?
తాను ప్రపంచ దేశాలతో అధిక సుంకాల పేరిట యుద్ధం సాగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ను నియంత్రించటం లేదు. అక్కడి మారణకాండను ఆపటం లేదు. మరి భారత్–పాక్ విషయంలో ఇంత ఆత్రుత దేనికో? ఎవరూ కోరకుండానే కశ్మీర్ సమస్యలో వేలెడతానని ఆయన తనకు తానుగా ఎలా చెప్పుకుంటారు? 2019లో సైతం ట్రంప్ ఇవే తరహా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానో దయమై ఆ సమస్యను రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకుంటాయని స్వరం మార్చారు.
మళ్లీ ఇప్పుడేమైంది? తాజా ఘర్షణలకు మూలం ఎక్కడున్నదో ఆయన గ్రహించలేకపోయారని ట్రంప్ మాటలు గమనిస్తే తెలుస్తుంది. పహల్గామ్‌లో 26మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ని ప్రారంభించింది. పాక్‌లోని 24చోట్ల ఉగ్రముఠాల స్థావ రాలను ధ్వంసం చేసింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికిది ప్రతీకారమే తప్ప కశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఉద్దేశించి మొదలెట్టిన దాడులు కాదు.
అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందించినంతకాలమూ తమ వైపుగా ఎలాంటి సాయమూ అందబోదని పాకిస్తాన్‌కు చెప్పాలి. ఆ దేశంతో సంబంధ బాంధవ్యాలు కొన సాగించే దేశాలపై కూడా ఆంక్షలుంటాయని ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశం కారణంగా నష్టపోతున్న భారత్‌నూ, దాన్నీ ఒకే గాటన కట్టడం ఎలాంటి సందేశం పంపుతుంది? ఇరు దేశాల మధ్యా చర్చలంటూ ఉంటే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనా, ఉగ్రవాదుల అప్పగింతపైనా మాత్రమే ఉంటాయని తన సందేశంలో మోదీ చెప్పటం ప్రశంసించదగ్గది. అమెరికా పోకడలు గమనిస్తే వర్తమాన ప్రపంచంలో ఎలాంటి న్యాయం అమలవుతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. దశాబ్దాలుగా చీకాకు పెడుతున్న ఉగ్రవాద సమస్యపై మోదీ దృఢ నిశ్చయాన్ని ప్రకటించటం ఈ తరహా న్యాయాన్ని ప్రశ్నించటమే!