
పాకిస్తాన్‌తో తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు
అది కచ్చితంగా యుద్ధ ప్రకటనే.. సింధు జలాల నిలిపివేతపై పాక్ వ్యాఖ్య
సరిహద్దుల్లో భారీగా మోహరింపులు
భారత్‌కు గగనతలం మూసివేత
రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ
అతి త్వరలో ‘నిర్ణాయక చర్యలు’?
ప్రధాని హెచ్చరికల సారాంశమూ అదే!
ముష్కరుల్ని వెంటాడి మట్టిలో కలిపేస్తాం
ఊహకందని రీతిలో ప్రతీకారం: మోదీ
పాక్ నుంచి తక్షణం వచ్చేయండి భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
వైమానిక విన్యాసాలు.. యుద్ధనౌకల కదలికలు
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై పాక్ గంగవెర్రులెత్తిపోయింది. ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది. ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుంది.
భారత్‌కు తన గగనతలాన్ని మూసేయడమే గాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పలికింది. ఎడాపెడా క్షిపణి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దుల వెంబడి సైనిక మోహరింపులను కూడా యుద్ధ ప్రాతిపదికన భారీగా పెంచేస్తోంది.
మరోవైపు దాయాది ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో ‘నిర్ణాయక చర్య’లకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గురువారం చోటుచేసుకున్న పలు కీలక పరిణా మా లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు.
గురువారం శ్రీనగర్‌లోని మార్కెట్ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ
తాజా పరిస్థితిని వివరించడంతో పాటు పలు ‘ఇతర’ అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా పహల్గాం ముష్కరులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారికి దన్నుగా నిలిచిన దుష్టశక్తినీ కటినంగా శిక్షిస్తాం.
కలలోనైనా ఊహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకు ని తీరతాం’’ అంటూ ప్రతినబూనారు. తర్వాత కా సేపటికే ‘ఆక్రమణ్’ పేరిట సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తో పాటు సుఖోయ్ తదితర యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు తక్షణం తిరిగి రావాలంటూ కేంద్రం అడ్వై జరీ జారీ చేసింది.
పొరుగు దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేయడమే గాక దానిపై తీసుకోబోయే ‘కఠిన’ చర్యలకు జీ20 తదితర దేశాల మద్దతు కూడగడుతోంది. పహల్గాం ఆటవిక దాడి, అందులో పాక్ ముష్కరులు పాల్గొన్న వైనం తదితరాలను జీ20 సభ్య దేశాల రాయబారులకు విదేశాంగ శాఖ పూసగుచ్చినట్టు వివరించింది. భేటీకి హాజరైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ్రస్టేలియా, యూఏఈ తదితర దేశాల రాయబారులు దాడిని తీవ్రంగా ఖండించాయి.
పాక్‌కు కరుడుగట్టిన మద్దతుదారైన చైనా కూడా భేటీలో పాల్గొనడమే గాక భారత్‌కు మద్దతు పలకడం విశేషం. మరోవైపు పహల్గాం దాడి, తదనంతర పరిస్థితులను కాంగ్రెస్ తదితర పార్టీలన్నింటితో కేంద్రం పంచుకుంది. ఉగ్ర తండాలను శాశ్వతంగా నిర్మూలించి తీరాల్సిందేనని పార్టీలన్నీ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డాయి. అందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలో ప్రకటించాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం.