
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం.
ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్‌ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు.
Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85
— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025