
విదేశీ దిగుమతులపై ప్రతీకార సుంకాల ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో వాణిజ్య ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో అక్కడ తయారీ నిర్వహిస్తున్న కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్రంప్ టారిఫ్‌ల నుంచి బయటపడేందుకు ఉపాయం ఆలోచించింది. భారత్ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో పాపులర్ ఐఫోన్ల తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రమైన చైనా నుంచి దిగుమతులపైనే యాపిల్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. చైనాపై విధించే టారిఫ్ రేటు ప్రస్తుతం 125 శాతంగా ఉంది. ఇక భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ సుంకం 26 శాతం. అయితే చైనా మినహా ఇతర అన్ని దేశాలపై ఈ సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
భారత్‌లోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన సమయాన్ని 30 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించేలా విమానాశ్రయ అధికారులతో కంపెనీ లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. "గ్రీన్ కారిడార్" పేరుతో చైనాలోని కొన్ని విమానాశ్రయాలలో చేస్తున్న ప్రత్యేక ఏర్పాటునే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ యాపిల్ చేయించినట్లు తమకు లభించిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్కటి 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో జెట్ విమానాలు అమెరికా వెళ్లాయని, వాటిలో ఒకటి ఈ వారంలోనే అంటే కొత్త టారిఫ్‌లు ప్రకటించాకే బయలుదేరిందని ఓ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఐఫోన్ 14, దాని ఛార్జింగ్ కేబుల్ ప్యాకేజ్డ్ బరువు సుమారు 350 గ్రాములు (12.35 ఔన్స్) ఉంటుందని, ఇలా మొత్తం 600 టన్నుల కార్గోలో సుమారు 15 లక్షల ఐఫోన్లు వెళ్లి ఉంటాయని రాయిటర్స్ అంచనా వేస్తూ రాసుకొచ్చింది. అయితే దీనిపై యాపిల్ సంస్థ గానీ, భారత విమానయాన మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు.