Cargo Flights
-
వచ్చే ఏడాది 25.7 బిలియన్ డాలర్ల లాభాలు
న్యూఢిల్లీ: ప్రయాణికులు, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో 2024లో అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ నికర లాభాలు 25.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలవని ఎయిర్‌లైన్స్ సమాఖ్య ఐఏటీఏ తెలిపింది. 2023లో ఇది 23.3 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అంచనా వేసిన 9.8 బిలియన్ డాలర్ల కన్నా ఇది గణనీయంగా ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ‘2024లో రికార్డు స్థాయిలో 470 కోట్ల మంది ప్రయాణాలు చేయొచ్చని అంచనా. 2019లో కరోనాకు పూర్వం నమోదైన రికార్డు స్థాయి 450 కోట్ల మందికన్నా ఇది అధికం‘ అని ఐఏటీఏ తెలిపింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ తిరిగి 2019 స్థాయికి చేరుతుండటంతో ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా కోలుకునేందుకు తోడ్పాటు లభిస్తోందని 2023 సమీక్ష, 2024 అంచనాల నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐఏటీఏ డైరెక్టర్ (పాలసీ, ఎకనామిక్స్) ఆండ్రూ మ్యాటర్స్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఏడాది కార్గో పరిమాణం 58 మిలియన్ టన్నులుగా ఉండగా వచ్చే ఏడాది 61 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2.7 శాతం మార్జిన్.. ‘అవుట్‌లుక్ ప్రకారం 2024 నుంచి ప్యాసింజర్, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరి గి వచ్చే అవకాశం ఉంది. రికవరీ ఆకట్టుకునే విధంగానే ఉన్నా నికర లాభాల మార్జిన్ 2.7 శాతానికే పరిమితం కావచ్చు. ఇలాంటి మార్జిన్లు ఏ రంగంలోనూ ఇన్వెస్టర్లకు ఆమోదయోగ్యం కావు‘ అని ఐఏ టీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష చెప్పారు. విమానయాన సంస్థలు కస్టమర్ల కోసం ఒకదానితో మరొ కటి తీవ్రంగా పోటీపడటమనేది ఎప్పుడూ ఉంటుందని.. కాకపోతే నియంత్రణలు, మౌలిక సదుపాయాల వ్యయాలు, సరఫరా వ్యవస్థల్లో కొందరి గు త్తాధిపత్యం వంటివి పరిశ్రమకు భారంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తాను అత్యంత ఆశావహంగా ఉన్నానని వాల్‡్ష తెలిపారు. ఐఏటీఏలో 300 పైచిలుకు ఎయిర్‌లైన్స్‌కు సభ్యత్వం ఉంది. ఐఏటీఏ నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2023లో ఎయిర్‌లైన్స్ పరిశ్రమ నిర్వహణ లాభం 40.7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 49.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 2024లో పరిశ్రమ మొత్తం ఆదాయం 2023తో పోలిస్తే 7.6 శాతం వృద్ధి చెంది 964 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ►ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కరోనా ప్రభావాల నుంచి భారత్, చైనా, ఆ్రస్టేలియా దేశాల్లో అంతర్గత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అయితే, 2023 మధ్య నాటికి గానీ అంతర్జాతీయ ప్రయాణాలపై చైనాలో ఆంక్షలు పూర్తిగా సడలకపోవడంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ప్రయాణికుల రాకపోకలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2023లో 0.1 బిలియన్ డాలర్ల నికర నష్టం ప్రకటించవచ్చని, 2024లో మాత్రం 1.1 బిలియన్ డాలర్ల నికర లాభం నమోదు చేయొచ్చని అంచనా. ►అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు, యుద్ధం, సరఫరా వ్యవస్థలు, నియంత్రణలపరమైన రిసు్కలు మొదలైనవి ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభదాయకతపై సానుకూలంగా గానీ లేదా ప్రతికూలంగా గానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. -
భారత్‌కు వచ్చే కార్గో విమానాలపై చైనా ఆంక్షలు
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో చైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత్ కు అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించిందో లేదో అంతలోనే తూచ్ మేమేం చేయలేమంటూ చేతులెత్తేసింది. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో సాయం చేసే అవకాశం లేదంటూ మాటమార్చింది. భారత్‌లో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారత్ కు తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇక డబ్ల్యూహెచ్ఓ తో పాటూ అమెరికా, సింగపూర్, దుబాయ్, దాయాది దేశం పాకిస్తాన్ సైతం అండగా నిలుస్తామని ప్రకటించాయి. ఈక్రమంలోనే నాలుగు రోజుల క్రితం డ్రాగన్ కంట్రీ చైనా సైతం భారత్ ను ఆదుకుంటామని, ప్రపంచ మానవాళికి ఉమ్మడి శత్రువు కరోనా అని, దానిపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చింది. కానీ ఇప్పుడు భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయంటూ కొత్త రాగం అందుకుంది. భారత్ లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ కొరత కారణంగా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. మనదేశానికి చెందిన పలు ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే చైనా కంపెనీలతో సంప్రదింపులు జరిపాయి. డ్రాగన్ కంట్రీ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పాటూ ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ భారత్ రావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కార్గో విమానాలన్నింటిని 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిచువాన్ ఎయిర్ లైన్స్ లో భాగమైన సిచువాన్ చువాన్‌హాంగ్ లాజిస్టిక్స్ లేఖ రాసింది. సేల్స్ ఏంజెట్లకు రాసిన లేఖలో చైనా నుంచి ఢిల్లీకి వచ్చే ఆరు రవాణా మార్గాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. మరోవైపు భారత్ లో కరోనా పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భారత్ కు పంపే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ ధరల్ని 35 నుంచి 40 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. సరుకు రవాణా ఛార్జీలను 20 శాతానికి పెంచినట్లు షాంఘైకి చెందిన సినో గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న విమాన ఛార్జీలు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఎ.ఎస్.ఎఫ్) ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు రూ.160 నుంచి రూ.200కు, అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2021 నుంచి విమాన టిక్కెట్లపై వర్తిస్తాయి. గత రెండు నెలలుగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జారీ చేసిన ఉత్తర్వులలో.. వివిధ వర్గాలలో ఉన్న కొద్దిమంది ప్రయాణీకులకు ఈ రుసుము చెల్లింపు విషయంలో మినహాయింపు ఉంది. వీరిలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని మార్చి 31, 2021 నుంచి 2021 ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు పొడగించినట్లు గమనించాలి. అయితే, ఇది కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు. చదవండి: ఎలోన్ మస్క్ టెస్లా విషయంలో కీలక నిర్ణయం! వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
గన్నవరం నుంచి త్వరలో కార్గో విమాన సర్వీసులు
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం నుంచి త్వరలో కార్గో విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు విమానాశ్రయం డెరైక్టర్ రాజ్‌కిశోర్ చెప్పారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. గన్నవరం విమానాశ్రయం నుంచి త్వరలో ఎయిర్‌కోస్తా ద్వారా కార్గో సర్వీసులు నడిపేందుకు సోవిక గ్రూప్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్గో సర్వీసులను పెంచేందుకుగాను ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్పైస్‌జెట్ సంస్థ ఆక్టోబర్ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు మరో రెండు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.