
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.
తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు..
ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.