థాయ్లాండ్ను కుదిపేసిన భూకంపం
బ్యాంకాక్: థాయ్లాండ్ను భూకంపం కుదిపేసింది. మంగళవారం సంభవించిన భూకంపంతో ఉత్తర థాయలాండ్ వణికింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయింది. చియాంగ్ రాయ్ నగరంలోని విమానాశ్రయాన్ని భూప్రకంపన కేంద్రంగా గుర్తించారు. భూమి కంపించడంతో విమానాశ్రయంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ఎయిర్పోర్టులోని సూచిక బోర్డులు, సీలింగ్ కుప్పకూలింది. అయితే రన్వేకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. విమాన సర్వీసులకు ఆటంకం కలగలేదు.
పాన్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లు నిలువునా చీలిపోయాయి. కిటికీలు బద్దలయ్యాయి. గోడలు కూలిపోయాయి. బౌద్ధలయాలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు ఒకరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం బాదిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.