
మయన్మార్, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం (Myanmar, Thailand Earthquake) రెండు దేశాలను అతలాకుతలం చేసింది. పలు నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఆ శిథిలాల కింద మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. భూకంపం సృష్టించిన విధ్వంసంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి తేరుకోలేకపోతున్నారు.
నా చేతులు ఇంకా వణుకుతున్నాయి
బ్యాంకాక్‌లో భూకంపం వచ్చినప్పుడు మలయాళ బుల్లితెర నటి, యాంకర్ పార్వతి కృష్ణ (Parvathy Krishna) అక్కడే ఉంది. తాజాగా ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి. ఇంకా నేను బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నా జీవితంలో అతి భయంకరమైన భూకంపం చూశాను. బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అందరూ షాకయ్యారు. నా కళ్లముందే భారీ భవనాలు నేలకొరిగాయి.

ఎక్కడ చూసినా హాహాకారాలే
జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఎక్కడచూసినా హాహాకారాలే! ఎక్కడికైనా వెళ్దామంటే రవాణా వ్యవస్థ కూడా స్థంభించిపోయింది. ఎవరి ముఖం చూసినా భయమే కనిపిస్తోంది. ఆ సమయంలో నేను ప్రేమించినవాళ్లను తల్చుకున్నాను. నా కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడాను. ఎట్టకేలకు ఫ్యామిలీతో అయినా మాట్లాడినందుకు సంతృప్తిగా అనిపించింది.
లైఫ్‌లో సెకండ్ ఛాన్స్
భూకంపం క్షణాల్లో అంతా మార్చేసింది. జీవితంలో నాకు సెకండ్ ఛాన్స్ దొరికినట్లుగా ఉంది. బతకడానికి మరో అవకాశం దొరికినందుకు, అందరినీ కలిసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది. భూకంపం వల్ల ప్రభావితులైనవారిని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ కష్టసమయాన్ని దాటేందుకు మీరు ధైర్యం కూడదీసుకోవాలని కోరుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అలాగే వీలైనంత త్వరగా తాను ఇండియాకు తిరిగిరావడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపింది. పార్వతి.. మాలిక్, ఏంజెల్స్, వర్షంగళ్కు శేషం, గ్‌ర్‌ర్.. సినిమాల్లో నటించింది.
చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్