
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.
రెండు మార్గాలు..
ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.