
అమెరికా రాజ్యాంగం అనుమతించేది రెండుసార్లే
అయినా తనకు బోలెడు దారులున్నాయన్న అధ్యక్షుడు
2028లో అధ్యక్ష బరిలో వాన్స్, రన్నింగ్‌మేట్‌గా ట్రంప్
నెగ్గాక వాన్స్ రాజీనామా, మూడోసారి పీఠంపై ట్రంప్
ఆ ఆలోచన ఉందని ఇంటర్వ్యూలో చెప్పిన ట్రంప్
సాధ్యాసాధ్యాలపై రాజ్యాంగ నిపుణుల అనుమానం
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్‌కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...
రాజ్యాంగాన్ని సవరించాలి
అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్‌లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.
‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు.
ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్‌లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.
9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారు
అమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు.
వయసు అనుమతించేనా?
మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్‌కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.
వద్దే వద్దు: డెమొక్రాట్లు
ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.
రూజ్‌వెల్ట్ నాలుగుసార్లు!
రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు.
అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్‌వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్‌వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.
– సాక్షి, నేషనల్ డెస్క్