
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా భయంకరమైన విషాదం జరిగితే అమెరికా కమాండర్–ఇన్–చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే.. ట్రంప్ తన నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసేంత ఆరోగ్యంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. జనవరిలో మొదటిసారి ఓవల్ ఆఫీసులో అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఆ గొప్పతనం, అద్భుతమైన చరిత్ర చూసి ముగ్ధుడినయ్యాను. అది నిజంగా అద్భుతమైన అనుభవం. అది శీతాకాలం. కర్టెన్లు మూసి ఉండటంతో చాలా చీకటిగా కనిపించింది. ప్రపంచ నాయకుడు పనిచేసే ప్రదేశం ఇలాగే ఉండకూడదు. అది కొంచెం వెలుగుతో, ఉత్సాహంగా ఉండాలనుకున్నా. ఆ తరువాత అధ్యక్షుడు చేసిన మార్పులు నాకు చాలా నచ్చాయి.
JUST IN—VP JD Vance said he is prepared to step in if “a terrible tragedy” were to befall Trump, while emphasizing that Trump is “in incredibly good health” and brimming with “incredible energy.”
Trump is sicker than we thought. pic.twitter.com/fX9uiauvtp— ADAM (@AdameMedia) August 28, 2025
వైట్‌హౌస్‌ను పునరుద్ధరించడంలో ట్రంప్ విలక్షణమైన శైలి నాకు బాగా నచ్చింది’ అని ప్రశంసించారు. అనంతరం 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళనలను ప్రస్తావించగా.. ‘ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు అద్భుతమైన శక్తి ఉంది. ఆయనతో పనిచేస్తున్నవారు చాలామంది ఆయనకంటే చిన్న వయసువాళ్లే. అయినా వారందరికంటే చివరిగా నిద్రపోయేది, మొదటగా నిద్ర లేచేది ట్రంపే. ఆయన మిగిలిన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం నాకుంది.
అమెరికన్ ప్రజలకోసం ఆయన ఇంకా ఎన్నో గొప్ప పనులు చేస్తారు’ అని వాన్స్ వ్యాఖ్యానించారు. పెద్ద విషాదం ఏదైనా జరిగి, అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతికి పెద్ద గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తాయి.
78 సంవత్సరాల ఏడు నెలల వయసులో ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ట్రంప్ అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడాయన. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాల రెండు నెలలు. ఇక, ఈ నెల ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతూ వాన్స్‌ను తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వారసుడిగా చెప్పుకొచ్చారు. కానీ వాన్స్ మాత్రం 2028 అధ్యక్ష ఎన్నికల ప్రణాళికల గురించి ఊహాగానాలను తోసిపుచ్చుతూనే ఉన్నారు.