దూకుళ్ల జాతర-విలువల పాతర
సభ్యులు పార్టీలు మారినపుడో, విప్ ఉల్లంఘించినపుడో ఫిర్యాదు చేస్తే స్పందించి, చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్/చైర్మన్లు. పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఈ విషయంలో సభాపతులదే తుది నిర్ణయం. కోర్టులకు కూడా జోక్యం చేసుకునే అధికారం, పరిధి లేవు. అందుకేనేమో, నిర్ణయం దాకా వెళ్లకుండా వ్యవహారాన్ని నాన్చి, తాత్సారం చేయడం రివాజయింది. ఇందుకు ప్రధాన కారణం స్పీకర్లు, చైర్మన్లు పాలకపక్షీయులుగా నడుచుకోవడమేనని చరిత్ర చెబుతోంది.
‘‘రాజకీయ పార్టీ ఫిరాయింపులు దేశానికి పట్టిన అరిష్టం. వీటిని సమర్థంగా అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య పునాదుల్ని, ఆ సౌధాన్ని నిలుపుతున్న మూలసూత్రాన్నే ఈ జాడ్యం విచ్ఛిన్నం చేస్తుంది. ఈ చెడు పోకడల్ని నియంత్రించే లక్ష్యంతోనే తన ప్రసంగంలో రాష్ట్రపతి నిర్దిష్టంగా హామీ ఇచ్చారు, ఆ మేరకు ప్రస్తుత సమావేశాల్లోనే పార్టీ మార్పిళ్ల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పార్టీ మార్పిళ్లను చట్టవ్యతిరేకంగా ఖరారు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ఈ బిల్లు.....’’
మూడు దశాబ్దాల కింద పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చే ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఉద్దేశాలు-లక్ష్యాల్లో పేర్కొన్న అంశమిది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్‌ను కొత్తగా రాజ్యాంగంలో భాగం చేశారు. ఫిరాయింపులను చట్ట వ్యతిరేకంగా పేర్కొనడమే కాకుండా అలా మారిన ప్రజాప్రతినిధుల్ని అనర్హుల్ని చేసే అంశాన్ని అందులో పొందుపరిచారు. ముప్పయ్యేళ్ల ప్రస్థానంలో.... జరిగిన పరిణామాల్ని పరిశీలిస్తే వేర్వేరు సందర్భాల్లో ఇది ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితి. ఏమిటి కారణం? ఎందుకిలా జరిగింది? ఎవర్ని నిందించాలి? అని సమీక్షించుకుంటే, తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఉంది. విలువలు పతనమై రాజకీయ వ్యవస్థ స్వరూప-స్వభావాలే మారిపోవడం ప్రధాన కారణం.
అందులో భాగంగానే... అధికారం కేంద్రీకృతం అవడం, డబ్బు-సంపద పెంచుకోవడానికి రాజకీయాలు ఆలం బన కావడం, ఏంచేసైనా అధికారం నిలబెట్టుకోవడం, ఎలాగైనా అధికార పక్షంతో అంటకాగడం... వంటి విపరీత ధోరణులు పెరిగాయి. విపక్షమే ఉండకూడదన్న నియంతృత్వ పోకడతో పాలకపక్షాలు పార్టీ మార్పిళ్లను పండుగల్లా, జాతర్లలా, మేళాలుగా జరిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుగునాట ఈ క్రీడ విశృంఖల స్థితికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ పెడ ధోరణులు శిఖర స్థాయికి చేరుతున్నాయి.
అన్ని స్థాయిల్లో అరాచకాలే......
పార్లమెంటులో ప్రశ్నలడగటానికి డబ్బు తీసుకున్నందుకు 11 మంది ఎంపీల్ని అనర్హుల్ని చేసిన సందర్భాలున్న దేశమిది! కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఓటుకోసం 5 కోట్ల రూపాయలకు బేరమాడి, యాభయ్ లక్షల నగదు ఇస్తూ పట్టుబడ్డా దర్జాగా తిరిగే పరిస్థితులూ ఉన్నాయి. దర్యాప్తు కొనసాగించడం, నిలిపివేయడంలోనూ సంకుచిత రాజకీయాలే! రాజకీయ వ్యవస్థ కనుసైగల ప్రకారం ఊడిగం చేయడం తప్ప దర్యాప్తు సంస్థల్లోనూ జవజీవాలు నశించాయి. గ్రామ సర్పంచ్ ఎన్నికల స్థాయి నుంచి పార్లమెంట్ సభ్యుల ఎన్నికల వరకు పార్టీ ఫిరాయింపులు మామూలయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్య చాలకుంటే, ఎన్నికల తర్వాత గెలుపొందిన వారిని తమవైపు లాక్కునే ‘హార్స్ ట్రేడింగ్‘ ఒకప్పటి మాట! ఇప్పుడు ఎన్నికల తర్వాతే కానక్కర్లేదు, ఎన్నికలకు ముందు కూడా పార్టీ నుంచి ఫిరాయించేటట్టు చేయవచ్చు. అవతలి పార్టీ అభ్యర్థినే కొనుగోలు చేయొచ్చు! సంచి దులిపినట్టు మొత్తం పార్టీనే ఖాళీ చేసెయ్యొచ్చు. ఇక అప్పుడు పోటీ నామమాత్రం, కొనుగోళ్లు చేసిన పాలకపక్షం గెలుపు ఖాయం! కొండొకచో... ఏకగ్రీవమైనా ఆశ్చర్యం లేదు.
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తదనంతరం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఆ బాగోతమూ కళ్లకు కట్టింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో విపక్షాలకు మెజారిటీ స్థానిక సంస్థల ప్రతినిధులుండి కూడా పాలకపక్ష అభ్యర్థులే ఎమ్మెల్సీలుగా గెలిచారు. ఎలా! అంటే....? అదంతే! క్యాంపుల నిర్వహణ, భారీ చెల్లింపులు, భవిష్యత్తుకు భరోసాలు, వినకుంటే కేసుల్లో ఇరికిస్తామనో, పాత కేసులు తిరగదోడుతామనో బెదిరింపులు. వ్యూహాత్మకంగా అవతలి పార్టీలో ఓ అభ్యర్థికి టిక్కెట్టు లభించేలా చూడ్డం, నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసేదాకా ఆగి, సదరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థినే తమ మందలో కలుపుకోవడం... ఇదీ రివాజు. సమకాలీన రాజకీయాల్లో పలువురు నాయకులకు పార్టీల కట్టుబాట్లు లేవు, సిద్ధాంతాల్లేవు, నైతిక విలువలు అంతకన్నా లేవు. రాత్రికి రాత్రి పార్టీ మారారు ఏమిటీ? అని అడిగితే ‘అభివృద్ధి కోసం పార్టీ మారాను, వారి నేతృత్వంలో అభివృద్ధి సాధ్యమని భావించాను, నమ్మాను కనుక పాత పార్టీని వదిలి పాలకపక్షం వైపు రావాల్సి వచ్చింది’ అని ఓ చిలుకపలుకు! ఎవరి అభివృద్ధి? నియోజకవర్గం అభివృద్ధా? తమ సొంత అభివృద్ధా? ఇది కోటి రూకల ప్రశ్న!
చట్టపరంగా చర్యలుండవా?
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని సామెత! ఒక చట్టం రాగానే దాన్నెలా నీరుగార్చాలో ఎత్తులు వేయడం, లొసుగులు, లోపాలు వెతికి వాడుకోవడం ఆధునిక మేధావిత్వం. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం వచ్చాక కూడా అదే జరిగింది. మూడో వంతుకు తగ్గని సభ్యులతో పార్టీ చీలితే, చీలిక వర్గాన్ని గుర్తించాలి. అప్పుడు వారికి చట్టం వర్తించదు. పార్టీ మారినా అనర్హులు కారు. దీన్ని అడ్డు పెట్టుకొని పార్టీల్ని చీల్చడం మొదల యింది. చట్ట నిబంధనే ఆయుధంగా విపక్షాల్ని చీలుస్తూ పాలకపక్షాలు తమకు లేని బలాన్ని సంతరించుకోవడం, బలమున్న పాలకపక్షాల ప్రభు త్వాల్ని కూడా ఇవే చీలికలతో విపక్షాలు పడగొట్టడం ఒక ప్రహసనంలా తయారయింది. దాంతో, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఈ చట్టాన్ని మార్చారు. మూడో వంతుకు తగ్గని సభ్యులతో చీలికను గుర్తించా లన్న నిబంధనను తొలగించారు. అయినా ఇంకో నిబంధన ఉండనే ఉంది. ఏ చట్టసభలోనైనా, పార్టీకి చెందిన మూడింట రెండొంతుల సభ్యులు మరో పార్టీలోకి మారితే దాన్ని ‘విలీనం’గా గుర్తిస్తారు. ఈ అంశానికి రెండు కోణా లున్నాయి.
ఇది పరోక్షంగా ఫిరాయింపులకు ఊతమిచ్చేదే! అనేది ఒక వాదన. ఇది లేకుంటే పాలకపక్షాల నియంతృత్వ ధోరణి పెచ్చుమీరుతుందని, ఎన్నికైన సభ్యులకు వాక్ స్వాతంత్య్రం, ప్రజావ్యతిరేక విధానాల్ని ఎదిరించే స్వేచ్ఛ పోతాయనే వాదనా ఉంది. అధికారపార్టీ ఏకపక్ష విధానాల్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నపుడు, ‘విప్’ను ధిక్కరించి, అనర్హత వేటు పడకుండా మిగలడానికి వారికో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి కదా! అనే వారు దీన్ని సమర్థిస్తారు. మరి మూడింట రెండొంతులకు తక్కువ సంఖ్యలో సభ్యులు పార్టీలు మారినపుడు? వేటు పడాల్సిందే! కానీ, అత్యధిక సందర్బాల్లో పడట్లేదు. చట్టం వచ్చిన పాతికేళ్లలో, అంటే 2010 నాటికి చట్ట వ్యతిరేకంగా పార్టీలు మారినట్టు 62 మంది లోక్‌సభ సభ్యులపై అభియోగాలు రాగా అందులో 26 మంది పైనే వేటు పడింది. 2004 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల చట్టసభల్లో కలిపి 268 మందిపై ఫిర్యాదులు రాగా అనర్హత వేటు పడింది 113 మంది పైనే. ఇందుకు ప్రధాన కారణం స్పీకర్లు, చైర్మన్లు పాలకపక్షియులుగా నడుచుకోవడమేనని చరిత్ర చెబుతోంది.
నిర్ణయాధికారం సభాపతులదే
సభ్యులు పార్టీలు మారినపుడో, విప్ ఉల్లంఘించినపుడో ఫిర్యాదు చేస్తే స్పందించి, చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్లు/మండలి చైర్మన్లు. పార్టీ ఫిరా యింపుగా పరిగణిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఈ విషయంలో సభాపతులదే తుది నిర్ణయం. కోర్టులు కూడా జోక్యం చేసుకునే అధికారం, పరిధి లేవు. ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేకపోయినా, ఒకసారి సభాపతి నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని ఎవరైనా సవాల్ చేస్తే సమీక్షించే పరిధి న్యాయస్థానాలకుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందు కేనేమో, నిర్ణయం దాకా వెళ్లకుండా వ్యవహారాన్ని నాన్చి, తాత్సారం చేయడం రివాజయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి పార్లమెంటు తొలి భేటీ కూడా జరక్కముందే నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, నిస్సిగ్గుగా తెలుగుదేశంలోకి మారారు. అదే దారిలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత నడిచారు. వీరిద్దరిపై పార్టీ నాయకత్వం చేసిన ఫిర్యాదు ఇప్పటికీ లోక్‌సభ స్పీకర్ పరిశీలనలో ఉంది తప్ప, నిర్ణయం జరగలేదు. ఏపీలో ప్రస్తుతం విపక్ష సభ్యులు నిబద్ధత నిలబడ్డా సానుకూల మీడియా ఊతకర్రగా పాలకపక్షం పిరాయింపుల మైండ్‌గేమ్ ఆడుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి దూకుళ్లపై ఏడాదిగా ఫిర్యాదులున్నా స్పీకర్ నుంచి ఉలుకూ-పలుకూ లేదు. పాలకపక్షం టీఆర్ఎస్లోకి తాజాగా దూకిన టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు త్వరలోనే ‘విలీనం’నోటీసి స్తారంటున్నారు. విలీన నిబంధన మాటున అనర్హత వేటు తప్పించుకోవ డానికి అవసరమైన పది మంది (10/15 మూడింట రెండొంతులు) సభ్యుల సంఖ్య గురువారం నాటి తాజా చేరికతో సమకూరింది కనుక ఇప్పుడు స్పీకర్ స్పందిస్తారేమో!
మరి ఎప్పుడో ఏడాది కింద పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగ తేంటి? ఒక్క టీడీపీయే కాకుండా, కాంగ్రెస్ నుంచి, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన వారినీ అనర్హులుగా ప్రకటించండి అని ఆయా పార్టీలు చేసిన ఫిర్యాదును స్పీకర్ ఎందుకు పట్టించుకోలేదు? ఇదే విషయమై తన ముం దుకు వచ్చిన కేసును విచారిస్తూ, ‘ఎప్పట్లోగా నిర్ణయిస్తారో చెప్పండి’ అని రాష్ట్ర హైకోర్టు రెండుమార్లు నిగ్గదీసినా సభాపతి స్పందించలేదు. టీడీపీ తరపున ఎన్నికై, ప్రత్యర్థి పక్షమైన టీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా కొనసాగడం, టీడీపీ ఫిర్యాదు ఇచ్చినా నిర్ణయాన్ని సభా పతి వెల్లడించకపోవడం పట్ల రాజ్యాంగ నిపుణులే విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి! అత్యధిక సందర్భాల్లో స్పీకర్ల వైఖరి ఇలాగే ఉంటోంది. మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఘండ్, గోవా, యూపీ తదితర చోట్ల జరిగిన పరిణామాలు స్పీకర్లు పాలకపక్షం తాబేదార్లుగా వ్యవహ రించారనడానికి మచ్చుతునకలు.
పచ్చిగా ప్రజల్ని వంచించడమే!
చట్టపరమైన అంశమే కాకుండా ఇందులో నైతిక కోణం కూడా ఉంది. ఒక పార్టీనుంచి ఎన్నికై ఇంకో పార్టీలోకి మారడమంటే, ఆయా పార్టీలకు వ్యతి రేకంగా ప్రజలిచ్చిన తీర్పును చులకన చేయడమే. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, ఒక రాజకీయ పార్టీలోకి మారితే కూడా అనర్హతవేటు వేయాల్సిందే నన్నది చట్ట స్ఫూర్తి! పార్టీ సిద్ధాంతాలు పలుచనవడం, ఓడితే ఐదేళ్లు నిరీక్షించే ఓపిక నశించడం, రాజకీయాల్లో డబ్బు ప్రమేయం పెరగడం, ఎన్నికల ప్రక్రియ బాగా ఖరీదు కావడం ఈ సిగ్గువీడిన ఫిరాయింపులకు కారణాలు. సంస్కర ణలకు అనేక కమిటీల సిఫారసులున్నా.... అంతిమంగా ఈ దుర్నీతికి టాటా చెప్పి, ఫిరాయింపురాయుళ్లకు గుణపాఠం నేర్పాల్సింది ప్రజలే!
- దిలీప్ రెడ్డి
సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com