పిటిషనర్లకు సుప్రీంకోర్టు ప్రశ్నలు
రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ పదాల చేరికపై సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్‌లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారించింది.
‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది.
మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు.
1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment