భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే!
భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది.
అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు.
సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్‌లో పేర్కొ న్నారు. పిటిషనర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్‌ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్‌లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.
సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం.
ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది.
ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్‌ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు.
ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?)
- మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment