
‘సామ్యవాద, లౌకిక’ వివాదంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది.
42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు.
మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment