secularism
-
మన పునాది లౌకికం
భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే, మార్చుకునే హక్కు ఉంది. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్యమాలు శూద్రులను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించేవారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని అర్థం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదని మన నాయకులు గ్రహించాలి.భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవి. మెసçపటోమియా నాగరి కతతో, గ్రీకు ఫిలాసఫీతో పోల్చదగిన స్థాయిలో భారతదేశ చరిత్ర, నాగరికతలు ఉన్నాయి. అందుకనే ప్రపంచ దేశాల చరిత్ర కారులు, పురాతత్వవేత్తలు, భాషాతత్వవేత్తలు ఇంకా ఈ మూలాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భారతీయ గతంలోకి దర్యాప్తు తూర్పు భాషలు నేర్చిన ఇండా లజిస్టులతో ప్రారంభమైంది. ముఖ్యంగా భారతీయ చరిత్ర, మరీ ముఖ్యంగా భారతీయ భాషలను తమ అధ్యయనంగా ఎంచుకున్న ఐరోపా పండితులతో ఇది మొదలైంది. వివిధ పాలనాపరమైన హోదా లలో ఈస్టిండియా కంపెనీ నియమించిన విలియం జోన్స్, కోల్ బ్రూక్, హెచ్.హెచ్.విల్సన్ వంటివాళ్లు ఇండాలజిస్టులలో కనిపిస్తారు. వారంతా ఐరోపా ప్రాచీన సంప్రదాయంలో శిక్షణ పొందినవారు. ప్రాచీన భాషల పట్ల ఆసక్తి పెంచుకుని, కొత్త రంగంలో నైపుణ్యం సాధించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పాలనా వేత్తలుగా వారికి సంప్రదాయ భారతీయ చట్టం, రాజకీ యాలు, సమాజం, మతం పట్ల ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి. ఇదే వారిని సంస్కృతం, పర్షియన్ సాహిత్యం వైపు నడిపించింది. ఈ విషయా లను ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన ‘ఐడియాలజీ అండ్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ’ అనే గ్రంథంలో చెప్పారు. భారతదేశంలోని మానవజాతుల పరిణామాలను పరిశీలించి నట్లయితే, మానవజాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్లు మానవజాతి పరిణామంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహæనిర్మాణం, సంపద కీలక పాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ ఇప్పటికీ దళితుల జీవన విధానంలో కనిపించడం వలన, భారతదేశంలో మానవజాతి పరిణామ లక్షణాలన్నీ దళిత జాతుల్లో ఉండటం వలన బి.ఆర్. అంబేడ్కర్ నిర్వచించినట్లు వీరు ఆది భారతీయులనేది నిర్ధారణ అవుతుంది. డేనిష్ పురాతన శాస్త్రవేత్తలు నిర్వచించినట్లు శిల, కాంస్య, ఇనుప యుగలక్షణాలు కూడా భారత సమాజంలోని ఆదిమ జాతుల్లో ఉన్నాయి. నిజానికి భారతదేశంలో సింధునది వారసులు దళితులు. ఆ తర్వాత వచ్చిన ఆర్యులు వీరిని ప్రాచీనులు అని వాడారు. వారికి ఆ తర్వాత వచ్చినవారు అర్వాచీనులు అవుతారు. ఏది సనాతనం? ఏది అధునాతనం? అనే దగ్గర ఋగ్వేద ఆర్యులే ఋగ్వేదాన్ని సనాతనం అయిందనీ, అధర్వణ వేదాన్ని అధునాతనమైనదనీ ప్రస్తావించారు. పూర్వం కంటే ఉత్తర బలీయమైనదనేది శాస్త్రం. అందుకే ఋగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం... ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ముందుదాని కంటే తర్వాత దానిలో ఇంకా విస్తృతి ఉంది అని చెప్పబడింది. మొట్టమొదటి ఇటుకల చైత్యగృహం, అశోకుని కాలం నాటిది, రాజస్థాన్‌లో బైరాuŠ‡ దగ్గర బయల్పడింది. ఇటుకల చైత్యగృహాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల బయల్పడినాయి. కానీ వాస్తు వైశిష్ట్యం ఉన్న కళాఖండాలుగా ప్రసిద్ధి చెందినవి గుహాలయాలే. వీనిలో చాలా భాగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. బుద్ధగయ చెంత బరాబర్ కొండల్లో అశోకుడు తొలిపించిన సుదామ– లోమశ ఋషి గుహలే మన దేశంలో మొదటి గుహలు. అదే కాలానికి చెందినవి గుంటుపల్లి గుహాల యాలు. క్రమంగా గుహాలయ వాస్తు భాజా, బేడ్సే, జున్నార్, విఠల్కేరా, కన్హేరీ, కార్లాలలో వికసించి అజంతా – ఎల్లోరాలలో పరిణతి పొందింది. గుహాలయాలన్నింటిలో తలమానికం వంటిది కార్లా చైత్యాలయం.ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచించిన బి.ఎస్.ఎల్. హనుమంత రావు గారు ఆంధ్రులు బౌద్ధ సంస్కృతి వికాసితులు అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనంగా బౌద్ధం విస్తరిల్లిందని విశ్లేషించారు. బౌద్ధ దర్శన ప్రభావం సుమారు ఆరు శతాబ్దాల కాలం దేశ ప్రజలపై, ప్రభుత్వాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఇంచుమించు భారతదేశాన్ని సమైక్యం చేసి తన ప్రభుత్వానికి ధర్మాన్ని గీటురాయిగా చేసిన అశోక మౌర్యుడు దండ సమత, వ్యవహార సమత నెలకొల్పాడు. దీన్ని బట్టి చూస్తే శిక్షాస్మృతి విషయంలో అందరూ సమానులేననే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అతని శాసనాలు చాటుతున్నాయి.ఆర్య ఋషులు ఈ దేశంలోకి పశుపాలకులుగా ప్రవేశించారు. గోపాలకులు (గోవులను పాలించే వారు), గవేషణ (గోవులను వెదకడం), గోపతి (గోవుల కధిపతి), గోమేధం (గోవులతో చేయు యజ్ఞం), గోఘ్నుడు (అతి«థిగా వచ్చి గోవులను చంపించువాడు), గోత్రం (గోశాల) అని వారిని వెన్నాడుతూ వచ్చిన ఈ విశేషణాలే వారి వృత్తిని ప్రకటిస్తున్నాయి అని రాహుల్ సాంకృత్యాయన్ చెప్పారు. ఆర్యులు గోపాలకులనీ, బౌద్ధం ప్రభావానికి గురయ్యేవరకూ వారు గోవును యజ్ఞయాగాల్లో బలి ఇచ్చారనీ చెప్పబడింది. తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పిన కామేష్టి యజ్ఞాలలో గోవృష భాలను బలి ఇవ్వటమే కాకుండా, ఎలాంటి వాటిని బలి యివ్వాలో కూడా ఉంది. విష్ణువుకి పొట్టి వృషభాన్ని, ఇంద్రుడికి వాలిన కొమ్ములు, ఎర్రని రంగు నుదురుగల వాటినీ, శని దేవుడికి నల్ల ఆవును, రుద్రుడికి ఎర్రగోవుని – ఆ రకంగా బలి ఇవ్వాలని నిర్దేశింపబడింది. అందులోనే ‘పంచశరదీయ’ సేవ అనే మరో రకమైన బలిని గూర్చి కూడా ప్రస్తావించబడింది. అందులో ముఖ్యాంశం ఏమంటే – ఐదేళ్ల వయసున్న 17 పొట్టి గిత్తల్నీ, అదే సంఖ్యలో మూడేళ్ళు నిండని పొట్టి లేగల్నీ బలి ఇవ్వాలని చెప్పబడింది.నిజానికి అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం.అందుండి బౌద్ధం గురించి మాట్లాడటం ఆంధ్రుల చారిత్రక కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అమరావతిని ఆంధ్రుల రాజధానిగా శ్రీకృష్ణ కమిటీకి ప్రతిపాదించిన దానిలో అర్థం అదే. ఆంధ్రులు వైదికేతర మతాలను, ధర్మాలను అన్నింటినీ ఆహ్వానించారు.ముఖ్యంగా బౌద్ధాన్ని, జైనాన్ని, ఇస్లాంను, క్రైస్తవాన్ని, ఇంకా అనేక మతాలను, ధర్మాలను ఆహ్వానించారు. ఆంధ్రదేశంలో శిల్పరూపం క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందు లేదు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి ముందు నిరాకార తత్వాలే ఉన్నాయి. ఆ తర్వాత శిల్పరూపాలు వచ్చినాక కూడా ఒకరి నొకరు గౌరవించుకోవడమే ఎక్కువ కాలం ఉంది.అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మతం మార్చుకునే హక్కు పొందు పరిచాడు. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్య మాలు శూద్రు లను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించే వారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని మనకు అర్థం అవుతుంది. అందుకే భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదు అని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలోని 25, 26, 27, 28వ అధికరణా లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ ‘విముక్తి అంటే ఏమిటి?’ అని చెప్తూ, 1835 అక్టోబర్ 13న చేసిన ప్రకటనలో మతం మారే హక్కు అందరికీ ఉందన్నారు. నిజానికి ఆంధ్ర దేశం భౌతికవాద తత్వాలతో ప్రభావితమైన దేశం. నార్ల వేంకటేశ్వరరావు, గుర్రం జాషువా, మహాకవి వేమన హేతు వాదాన్ని బోధించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తూ మాన వతా వాదాన్ని ప్రజ్వలింపజేసే కర్తవ్యంలో భాగస్వాములం అవుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
సెక్యులరిజంపై గవర్నర్ రవి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సెక్యులరిజంఅనే భావన యూరప్‌లో ఉందని, అది భారత దేశానికి సంబంధంలేనిదన్నారు. సోమవారం(సెప్టెంబర్23) ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్.ఎన్ రవి ఈ మేరకు వ్యాఖ్యానించారు.చర్చికి,రాజుకు మధ్య గొడవ జరిగి వారిద్దరూ దానిని ఆపేయాలనుకోవడం నుంచి యూరప్‌లో సెక్యులరిజం పుట్టిందన్నారు.ఇక భారత్‌లోకి సెక్యులరిజాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బుజ్జగింపు రాజకీయాల కోసం తీసుకువచ్చారని ఆరోపించారు.తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి తీవ్రస్థాయిలో విభేదాలున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలకు రాముడంటే తెలియదని రవి ఇటీవలే వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. ఇదీ చదవండి: కోల్కతాఘటన సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే -
మతం చూడం.. కులం చూడం..: ప్రధాని మోదీ
గాంధీనగర్: అసలైన లౌకికవాదం అంటే.. తన దృష్టిలో వివక్ష లేకపోవడమేనని గుజరాత్ పర్యటనలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వారికి నేను చెప్పదల్చుకుంది ఒక్కటే. ప్రజల సంతోషం, వాళ్ల సౌలభ్యం.. పూర్తిస్థాయి హక్కుల కోసం పని చేయడం కన్నా గొప్ప సామాజిక న్యాయం మరొకటి లేదని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం కూడా అదే తోవలో పయనిస్తోందని అన్నారాయన శనివారం గాంధీనగర్(గుజరాత్) మహాత్మా మందిర్‌లో సుమారు 4 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. సంక్షేమం అందించడంలో తన ప్రభుత్వం పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుదందని చెప్పారు. నా దృష్టిలో సెక్యులరిజం అంటే.. వివక్ష లేకపోవడమే. అందుకే కులం, మతం అనే పట్టింపు లేకుండా వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను మా ప్రభుత్వం అందిస్తోంది. ఇలా అందరి సంతోషం, సౌలభ్యం కోసం పని చేసినప్పుడు.. అంతకు మించిన సామాజిక న్యాయం మరొకటి ఉండబోదని చెప్పారాయన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. గుజరాత్లో నిర్మిస్తున్న నివాస సముదాయాలకు శంకుస్థాపన చేశారాయన. ఈ పథకం కింద.. పేదల కోసం నాలుగు కోట్ల నివాసాలు నిర్మించామని, అందులో 70 శాతం నివాసాలను మహిళలకు అందజేయడం ద్వారా మహిళా సాధికారికతను చాటామని తెలిపారాయన. -
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్‌ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్‌లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్‌ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
పదును తగ్గని యుద్ధం చేసినోళ్లం
దాడి ఒకలాగుండదు... ఒక రూపంలో ఉండదు... దాడికి పలు రూపాలు, పలు అవతారాలు! ఏ విశ్వాసాలను నమ్మకాలనైనా అడ్డుపెట్టుకుని అమాంతం దాడి చేయవచ్చు. దాడి చేయటమన్నది పథకం ప్రకారం ఆట మధ్యలో అవాంతరాలు సృష్టించి అడ్డంగా గెలవటం లాంటిది కదా! అధికారం కోసం కల్లోలాలు సృష్టించటం, అంతర్యుద్ధాలు సృష్టించటం, సమాజాన్నే రెండు ముక్కలు చేయటం, రెండు మతాల మధ్య మంట రాజేయటం, కులాల మద్య రాజకీయ కుంపట్లు పెట్టటం, పార్టీలను చీల్చటం... ఎన్ని పన్నాగాలో! ఇలాంటి వారికి కొనుగోలు శక్తి తక్కువేం కాదు... దేశాన్ని ఎన్ని రకాలుగా ప్రైవేటైజేషన్ చేయాలో అన్నీ రకాలుగా చేసేశారు. నానా అగచాట్లు పెడతారు. అరగోసలు, అర్వతిప్పలు! ఇపుడు నా దేశ ప్రజాస్వామ్యమనే సౌధం రకరకాల అధికార దాహాలతో చేసే విచ్చలవిడి దాడులతో నెర్రలు బాస్తోంది... లౌకికత్వం తనను తాను రక్షించుకోలేక... భిన్న సంస్కృతుల, భిన్న జాతుల ఐక్యతను కాపాడలేక దురాక్రమణల దాడులకు నిలువలేక తల్లడిల్లుతుంది. జాతి సంస్కృతే చిన్నాభిన్నమౌతూ ఛిద్రమైపోతుంది. ఏమి దౌష్ట్యం? ఏమి దుర్నీతి? ఏమైపోతున్నాం... ఎటుపోతున్నాం. మన దేశ దశ దిశల లక్ష్యం ఏ వైపునకు పయనిస్తుందో కదా! రాష్ట్రాలపై కేంద్రం దాడులు మాములైపోయాయి. రాష్ట్రాలను అస్థిరపరచటం మామూలు క్రీడైపోయింది. ఒక ప్రభుత్వం ఒక్క పూటలో కూలిపోయి ఎప్పుడది వన్డే క్రికెట్ మ్యాచ్ అవుతుందో తెలియదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం, వాళ్ల చేతులతో వాళ్లే కూల్చుకునేలా చేయటం షరా మామూలైన స్థితికి ప్రజలస్వామ్యం రావటం చెప్పలేని బాధ. ప్రశ్నలను జోకొట్టవచ్చనే భ్రమలు బాగా పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రశ్న నోటిని మూసేసి ప్రశ్నలను కిడ్నాప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రశ్నలనే బెదిరిస్తూ ప్రశ్నను ప్రశ్నించకుండా ప్రశ్నల గొంతులపై సీబీఐలను పెడ్తుండ్రు. ప్రశ్నల తలలు లేవకుండా పార్టీల అంతర్గత కలహాలు రాజేస్తుండ్రు. ప్రశ్నలు పురి విప్పకుండా ప్రశ్నల గాలులను ఆపాలని చూస్తుండ్రు. ప్రశ్నించకుండా అధికార ముద్రలతో దాడులన్నీ చేస్తుండ్రు. దుర్నీతి రాజకీయాలు చేస్తున్నవాళ్లే చీకటి రోజుల గురించి మాట్లాడుతుండటమే విచిత్ర చిత్రం. ఎందుకో ఈ తెలంగాణ మట్టి ఆధిపత్యాలను ససేమిరా ఒప్పుకోలేదు. మత ఆధిపత్యాన్ని అస్సలు సహించదు. తెలంగాణ పరమత సహన లౌకికతత్వం కోరుకునే మానవీయ మహాతల్లి. తెలంగాణ అందరికోసం తపన పడే బోళాతనమున్న మహాతల్లి. ఇది సృజనాత్మకమైన నేల. సబ్బండ వర్ణాల మహా సంస్కృతిని తనువంతా నిండిన తెలంగాణ నేల ఇది. ఇదొక మానవీయ మహా సమాజం. మానవీయత మత సామరస్యం తెలంగాణ తల్లివేరు. దీన్ని పెకలించటం ఎవరితరం కాదు. మనం ఉరుముల్లా ఉరిమినోళ్లం. జన జాతర్ల మెరుపులుగా మెరిసిన వాళ్లం. పిడుగుల్లా కురిసినోళ్లం. జన జలప్రళయాలుగా పొంగి పొరలినోళ్లం. ఆవేశ ఆగ్రహాలకు ఆది అంతాలుగా నిలిచిన సింహగర్జనలం. (క్లిక్: లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!) ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకున్న విజయ చిహ్నాలం కదా... ఇపుడు కమ్ముకొస్తున్న కుల, మత కారు మేఘాలను చెల్లాచెదురు చేయగల శక్తులం మనమే. ఎంతపోరు చేసి ఎన్నెన్ని త్యాగాలు చేసి తెలంగాణను నిలబెట్టుకున్నమో... గెలిచిన తెలంగాణను మత గత్తరల నుంచి, కుల కలరాల నుంచి కాపాడుకోలేమా. మనకు కొత్తగా చెప్పాల్సిన పన్లేదు. చేసిన యుద్ధం పదును ఏ మాత్రం తగ్గనోళ్లం... మనమే గెలుస్తాం. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - జూలూరు గౌరీశంకర్ చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి -
అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్
డెహ్రాడూన్/చండీగఢ్: బీజేపీకి చెందిన అమిత్‌షా తదితర నేతలతో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంతనాలు జరుపుతుండటంపై పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జి హరీశ్ రావత్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు అమరీందర్ లౌకికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని నాయకులతో అంటకాగవద్దనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ నాయకత్వానికే మద్దతు ఇవ్వాలని కెప్టెన్‌ను రావత్ కోరారు. బీజేపీ వలలో పడవద్దని హితవు పలికారు. పంజాబ్ కాంగ్రెస్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి పార్టీ అవమానించిందని భావించడం సరికాదని చెప్పారు. ఆయనకు ఎటువంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. సీఎంగా విద్యుత్, డ్రగ్స్ వంటి కీలకమైన అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెప్టెన్ విఫలమయ్యారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సహా తనకు ఎవరి సలహా అక్కర్లేదన్న అహంభావంతో వ్యవహరించారని ఆరోపించారు. స్పందించిన కెప్టెన్ తన నిబద్ధతపై హరీశ్‌రావత్ సందేహాలు వ్యక్తం చేయడంపై కెప్టెన్ అమరీందర్ తీవ్రంగా స్పందించారు. తన బద్ధశత్రువులు, తీవ్రంగా విమర్శించే వారు సైతం లౌకికత విషయంలో తనను అనుమానించలేరన్నారు. ఇన్నేళ్లుగా విశ్వాసంగా పనిచేసిన తనకు ఆ పార్టీలో గౌరవం లేదని ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సిద్దూ నేతృత్వంలోని తిరుగుబాటుదారులకు మద్దతు పలకడంతోపాటు తనను విమర్శించే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ‘సీఎల్పీ సమావేశంలో నన్ను దాదాపుగా తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ అవమానం పొందడం ఇష్టంలేక ముందుగానే వైదొలిగాను. ఇది అందరికీ తెలిసిన విషయమే’అని ఆయన తెలిపారు. వాస్తవాలిలా ఉంటే, హరీశ్‌రావత్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
లౌకికవాదం దిశగా ఇరాన్ అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌ను షియా ముస్లిం దేశంగా అక్కడి పాలకులు ఎప్పుడూ చెప్పుకోవడం మనకు తెలిసిందే. అయితే అక్కడ ముస్లింల ప్రాబల్యం తగ్గుతూ లౌకికవాదం వేళ్లూనుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘గ్రూప్ ఫర్ అనలైజింగ్ అండ్ మెజరింగ్ ఆటిట్యూడ్స్ ఇన్ ఇరాన్, లాడన్ బోరౌమాండ్’ సహకారంతో ఇటీవల నిర్వహించిన ఓ ఆన్లైన్ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్లో 32 శాతం షియా ముస్లింలు, ఐదు శాతం మంది సున్నీలు, మూడు శాతం సూఫీ ముస్లింలు ఉన్నట్లు తేలింది. అంటే ముస్లింల సంఖ్య 40 శాతం అన్నమాట. 9 శాతం మంది తాము నాస్తికులమని చెప్పగా, ఏడు శాతం మంది ఆధ్యాత్మిక వాదులమని చెప్పారు. 8 శాతం మంది జొరాస్ట్రియన్లమని చెప్పుకోగా, 1.5 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. మొత్తం ఇరాన్ జనాభాలో 78 శాతం మంది దేవుడిని విశ్వసిస్తుండగా, వారిలో 37 శాతం మంది పునర్జన్మ ఉంటుందని నమ్ముతుండగా, స్వర్గ నరకాలు ఉంటాయని 30 శాతం మంది విశ్వసిస్తున్నారు. మొత్తం జనాభాలో పాతిక శాతం మంది దేవుడు కాకపోయినా మానవాతీత శక్తులున్నాయని నమ్ముతున్నారు. 20 శాతం మంది మాత్రం తాము ఏ శక్తులను నమ్మమని, నాస్తికులమని చెప్పారు. మతాన్ని విశ్వసిస్తున్న వారిలో తాము మత సంప్రదాయాలను ఆచరిస్తున్నామని 90 శాతం మంది తెలిపారు. (చదవండి: వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్) జీవన క్రమంలో తమ భావాలను కోల్పోయామని 47 శాతం మంది తెలుపగా, తాము మతాన్ని మార్చుకున్నట్లు ఆరు శాతం మంది తెలిపారు. మతాన్ని వదులుకుంటున్న వారిలో ఇతర మతాల నుంచి క్రైస్తవ మతంలోకి మారుతున్న వారిలో ఎక్కువ మంది యువతీ యువకులే ఉంటున్నారు. ఈ లెక్కన ఇరాన్ ఆధునికతను సంతరించుకుంటూ లౌకికవాదం దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇరాన్ ప్రభుత్వం 2016లో విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం ఆ దేశంలో 99.5 శాతం మంది ముస్లింలని పేర్కొంది. అదే నిజమైతే 1979లో అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్ తిరుగుబాటు ప్రభావం శూన్యమనే అనుకోవాలి. ఇస్లామిక్ తిరుగుబాటు వల్ల విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, దేశం అభివద్ధిని, ఆధునికతను సముపార్జించుకుందని విశ్లేషకులు ఎప్పుడో తేల్చి చెప్పారు. ఇరాన్లో మత మౌఢ్యం తగ్గుతోంది. పెరుగుతున్న అక్షరాస్యతతోపాటు తగ్గుతున్న జనాభా వద్ధి రేటు దీనికి నిదర్శనం. 2020లో ఇరాన్ జనాభా వద్ధిరేటు మునుపెన్నడూ లేనంతగా ఒక శాతానికి పడిపోయింది. గత యాభై ఏళ్లలో ఇరాన్ ప్రవాసీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. (చదవంండి: ఇరాన్‌తో చర్చలు ఫలవంతం) -
‘మతం ఆధారంగా దేశాన్ని విభజిస్తున్నారు’
న్యూఢిలీ: కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా దేశాన్ని విభజిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి విమర్శించారు. ఉమాభారతి గురువారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1984లో జరిగిన సిక్కుల మారణకాండలో కాంగ్రెస్ పాత్ర ఉందని ఆరోపించింది. అయితే కాంగ్రెస్ చెబుతున్నట్లు సెక్యూలరిజమ్ వల్ల దేశంలో ఎలాంటి ఉపాధి కల్పన జరగలేదని తెలిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అయోద్య పర్యటనను రాజకీయం చేయడం తగదని, ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, అయితే కాంగ్రెస్ పార్టీకి దేశం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల శివసేన అధినేత శరద్ పవార్ మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. దేవాలయాలు కట్టినంత మాత్రాన కరోనా నియంత్రణ కాదని మోదీని ఉద్దేశించి పవార్ విమర్శించిన విషయం తెలిసిందే. (చదవండి: యువ నేతలను రాహుల్ ఎదగనీయడం లేదు: ఉమా భారతి) -
రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య..
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరానికి గాను సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ స్పందించారు. ఈ విషయాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంచలనం సృష్టించేందుకు అజ్ఞానంతో చేస్తున్న వ్యాఖ్యలని గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘సమాఖ్యవాదం, జాతీయవాదం, స్థానిక ప్రభుత్వాలు వంటి పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ నుంచి తొలగించడం వాస్తవమే. నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకే ఈ చర్య చేపట్టాం. అయితే, ఇది ఈ ఒక్క సబ్జెక్టుకే పరిమితం కాదు. బయాలజీలో న్యూట్రిషన్, డైజెషన్ వంటి వాటిని, ఫిజిక్స్‌లో రేడియేషన్, రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజిన్ వంటి అంశాలను, ఆర్థిక శాస్త్రంలో చెల్లింపుల లోటు వంటి అంశాలను ఈ ఏడాదికి మాత్రమే తొలగించాం. వీటిపైనా ప్రతిపక్షాలు స్పందించాలి’అని ఆయన కోరారు. ‘విద్యారంగ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని రాజకీయం చేయొద్దు’ అని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్–19తో తలెత్తిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 30 శాతం వరకు పాఠ్యాంశాలను సీబీఎస్ఈ సిలబస్ నుంచి తగ్గించనున్నట్లు ప్రకటించడం, ఈ అంశంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రత్యేక సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికే ప్రజాస్వామ్యం, బహుళత్వం వంటి అంశాలను కేంద్రప్రభుత్వం విద్యార్థుల సిలబస్ నుంచి తొలగించిందని పేర్కొన్నాయి. (సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్) -
'కేసీఆర్ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సామ్రాజ్య వాద శక్తుల కంటే దారుణంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్ఎస్ పతనం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న కొన్ని చట్టాలపై అభ్యంతరం తెలుపుతూ గాంధీభవన్ నుంచి శాంతియుత ర్యాలీ తీయాలనుకున్నామని తెలిపారు. కాగా లౌకిక వాదాన్ని పెంచే ర్యాలీకి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. దీంతో మౌనంగా శాంతి యాత్ర చేద్దామనుకున్నా ఇప్పుడు పోలీసులు అనుమతించలేదని, గాంధీభవన్ చుట్టు వేలాది మంది పోలీసులను మోహరించి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రంలో గాంధీని చంపిన వారి పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. 6 దశాబ్దాల తమ పాలనలో లౌకిక వాదంలో బతికిన ప్రజలు ప్రస్తుతం బీజేపీ పాలనలో మాత్రం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీకి పరోక్షంగా కేసీఆర్ సహాయసహకారాలు అందించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గుండెను తట్టి లేపుదామని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు. -
రెండో స్వాతంత్య్ర పోరాటమా?
‘‘దేశంలో నిజమైన సెక్యులర్ (లౌకిక సమ భావన) వ్యవస్థను నెలకొల్పగల అవకాశాలను కాంగ్రెస్ పోగొట్టుకుంది. సురక్షితమైన, ఆధునిక, సమష్టి భారతాన్ని నెలకొల్పాలన్న కల సాకారం కావడానికి ప్రజలు తోడ్పడాలి.’’ – ప్రధాని నరేంద్రమోదీ నూతన లోక్‌సభలో చేసిన ప్రకటన ‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారత్‌లో ఒక ప్రజా ఉద్యమ సంస్థ. భారత బహుముఖీన చిత్ర పటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కేంద్రకార్యాలయాన్ని దర్శించుకుని నాయకులతో చర్చలు జరిపాను. 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ చరిత్ర నిరంతరం వివాదాలతో కూడుకున్నదైనప్పటికీ, అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వచ్చంద సంస్థగానే పేర్కొనాలి. జర్మనీ దేశస్తునిగా నాకు 1930– 40లలో ఆరెస్సెస్ చరిత్ర గురించి అవగాహన ఉంది. ఆరెస్సెస్ నాయకుల్లో కొందరు జర్మనీ నాజీ (హిట్లర్) ఉద్యమం నుంచి ఉత్తేజం పొందారని నాకు తెలుసు. కొందరికి ఇష్టమున్నా లేకున్నా ఇది వాస్తవం.’’ – జర్మనీ రాయబారి లిందర్న్. ది హిందూ : 21–07–2019 దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 72 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘‘సురక్షితమైన, ఆధునిక, సమష్టి భారతాన్ని నెలకొల్పాలన్న కల సాకారం కావడానికి ప్రజలు తోడ్పడాలని’’ ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రకటన చేయడంలో అర్థం ఏమై ఉంటుంది? ఆయన చెప్పే కల ఇంత వరకు సాకారం కాకపోవడానికి ఎవరు కారకులు? దీనికి సమాధానం.. స్వాతంత్య్రానంతరం తొలి 20 ఏళ్లు మినహాయిస్తే మిగతా దశాబ్దాలన్నింటా, స్వాతంత్య్రోద్యమంలో అశేష త్యాగాలతో భారతీయులు సాధించుకున్న స్వేచ్ఛను, విమోచనను ఒక వైపు నుంచి కాంగ్రెస్ అనంతర నాయకత్వం, ఆ పిమ్మట కాంగ్రెస్ స్థానంలో అదే స్వార్థ ప్రయోజనాలతో అధికార స్థానాలు ఆక్రమించిన ఆర్ఎస్ఎస్–బీజేపీ– ఎన్డీయే కూటమి నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ స్వతంత్ర ఆర్థిక విధాన నిర్ణయాల గురించిన తొలి ప్రకటనలకు, ప్రజలకు చేసిన వాగ్దానాలకు, స్వతంత్ర విదేశాంగ విధానానికి, అలీన విధానంతోనే దేశాన్ని అభ్యుదయమార్గం పట్టించడానికి చేసిన తొలి ప్రయత్నాలన్నీ నేడు బుగ్గిపాలు కావడానికి ఈ రెండు శక్తులే కారణం. తొల్లింటి సమష్టి భారత లౌకిక రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాలకే ఎసరు పెట్టి, కుల, మత, వర్గ, వర్ణ సంఘర్షణలకు తావులేని సర్వమత సమభావన లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వచ్చిన దాని ఫలితమే– కేవల ‘హిందూ రిపబ్లిక్’ రాజ్యాంగానికి ప్రాణ ప్రతిష్ట చేసే ప్రయత్నానికి పాలకులు ఉద్యుక్తులవుతున్నట్లు ఉంది. బహుశా అందుకనే క్రాంతదర్శి అయిన భారత సెక్యులర్ రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1946లోనే, దేశ పరిస్థితులపై అవగాహనతో, దూరాలోచనతో ఇలా ప్రకటించారు: ‘హిందూరాజ్’ పేరిట దేశాన్ని ప్రకటించడమంటే భారతదేశానికి అంత కన్నా పెద్ద విషాదకర సంఘటన మరొకటి ఉండదు. ఎట్టి పరిస్థితు ల్లోనూ ‘హిందూ రాజ్’ నిర్ణయాన్ని, ప్రకటనను అడ్డుకుని తీరాల్సిందే. (‘ఇండియా పార్టిషన్’ గ్రంథం : పే. 354–5) మోదీ నాయకత్వంలో ఆరెస్సెస్–బీజేపీ కాశ్మీరం నుంచి కన్యా కుమారి దాకా, అసోం, మణిపూర్ నుంచి ఉత్తర ప్రదేశ్, బీహార్, హరియాణా, పంజాబ్, త్రిపుర, కర్ణాటక, కేరళ, ఒరిస్సాల వరకు దళిత, మైనారిటీలు వందలాదిమందిపై జరిగిన అత్యాచారాలు, హత్యలూ, వేధింపులకూ లెక్కలేదు. ప్రజాసమస్యలను గొంతెత్తి చాటే సామాజిక కార్యకర్తలను ప్రజలపట్ల వకాల్తా వహించి ఉద్యమించిన పలువురు చరిత్రకారులను, పాత్రికేయులను, అధ్యాపకులను, ఆర్థిక వేత్తలను వేధించి, అరెస్టు చేయడమో, దొంగచాటుగా హతమార్చడమో, లేదా విచారణ తతంగం చాటున, హంతకులకు శిక్షలు లేకుండా కేసులు మూసివేయడమో జరుగుతూ ఉంది. ఈ రోజుకీ కల్బుర్గి, పన్సారీ, లంకేష్‌లను హత్య గావించిన హంతకుల ఆచూకీ (తెలిసికూడా) ప్రకటించి, శిక్షించడం జరగలేదు. గతంలో దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, ప్రాణాలు, పుస్తెలు సహా త్యాగం చేసిన కోట్లాదిమంది స్త్రీ, పురుష యోధుల జ్ఞాపకాలు వెన్నంటుతుండగా, నేడు స్వతంత్ర భారతంలో గాడితప్పిన పాలనా వ్యవస్థలు ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పైన, పత్రికా ప్రసార మాధ్యమాలపైన ఉక్కుపాదం మోపి, కొన్ని సంస్థలను బెదిరించి తమకు అనుకూల బాకాలుగా మార్చుకున్న వైనం కాదనలేని ఒక నగ్న సత్యం. అందుకే దేశం రాజ్యాంగ వ్యవస్థల్ని మరింతగా ప్రజానుకూల వ్యవస్థలుగా తీర్చి దిద్దుకోవాల్సిన తరుణంలో రాజ్యాంగం హామీపడగా ‘మేముగా రచించుకుని మాకు మేముగా అంకితం చేసుకుంటున్నామని’ రాజ్యాంగంపరంగా ప్రజలు ప్రకటించుకున్న సంగతిని రాజకీయ నాయకులు మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. దేశానికి, ప్రజలకూ అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, హేతువాదాన్ని పెంచి, పోషించడాన్ని పౌర బాధ్యతల అధ్యాయంలో రాజ్యాంగం ఆదేశిస్తున్నా– దాన్ని తోసిరాజని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థాయి నుంచి విశ్వవిద్యా లయ, కేంద్రీయ విద్యాలయాల స్థాయి వరకూ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు, శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన మానవ ప్రపంచ పరిణామ చరిత్రకు వక్రభాష్యాలు పాలకులు నూరి పోసేందుకు వెరవటం లేదు, వైదిక విజ్ఞానం మీద నమ్మకాలు, పూజలు పునస్కారాలమీద వ్యక్తిగత విశ్వాసాలు వేరు, విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిరూపణను కాదనడం అజ్ఞానం. డార్విన్ పరిణామవాదాన్ని నిరూపణలతో విశ్వసించిన ప్రపంచ వైజ్ఞానిక శాస్త్రాన్ని కాదని మొండి వాదనలతో మానవ పరిణామవాద నిరూపణలను కాలదన్నే వారిని అన్నీ ‘కోతి చేష్టలే’నంటే బాధపడిపోయి, తాము మాత్రం డార్విన్ వానర సంతతికి వారసులం కాము, కేవలం రుషుల నుంచి జాలువారిన బిడ్డలమేనని, డార్విన్ సిద్ధాంతం అబద్ధమనీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సత్యపాల్‌సింగ్ మానవ హక్కుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంలో చెప్పారు. దానికి దీటైన సమాధానమిస్తూ డీఎంకే సభ్యురాలు కనిమొళి ‘దురదృష్టవశాత్తు నా పూర్వీకులు ఋషులు కారు, కేవలం మానవమాత్రులు, విజ్ఞానశాస్త్ర నిరూపణ ప్రకారం నా తల్లిదండ్రులు శూద్రులు. వీరెవరూ దేవుడి బిడ్డలు కారు, దేవుడిలో ఏ భాగానికీ చెందిన వారు కారు. కానీ ఈరోజుకీ వీరందరూ మానవహక్కుల కోసమే పోరాడుతూ వచ్చారు, ఇంకా ఈ రోజుకీ పోరాడుతూనే ఉన్నారని’ నషాళానికి అంటే జవాబిచ్చారు సింగ్‌కి. ఎందుకంటే, తమది ‘సాంస్కృతిక జాతీయవాదం’ అని ఆరెస్సెస్–బీజేపీ కలయిక నమ్మించజూస్తోంది. మరి ఆ జాతీయ స్రవంతిలోనే, ఆ సంస్కృ తిలోనే అంతర్భాగంగా పెరుగుతూ వచ్చిన విభిన్న మతాలకు, కులాలకు, వృత్తులకు, వివిధ జాతులకు, విభిన్న భాషలకు చెందినవారు వెరసి ‘ఉమ్మడి సంస్కృతిలో, జాతీయ వాదంలో భాగస్వాములు కారా? అందుకు ఆరెస్సెస్–బీజేపీయులు అవుననీ చెప్పరు, కాదనీ చెప్పరు. ముంగిగా మౌనం వహిస్తారు. ఆ మౌనమే ‘హిందూ రిపబ్లిక్’ ఆశయాన్ని వారు సాధించే క్రమంలో ముందుకు సాగడానికి ఆస్కారమవుతుంది. బహుశా బీజేపీ (ఆరెస్సెస్) ఎంపీ సాక్షీ మహరాజ్ 2019 ఎన్నికల తర్వాత ఇండియాలో ఇక ఎన్నికలుండవని ప్రకటించడానికి పార్టీ లోలోపల అంతర్మథనానికి పునాది అయి ఉండాలి. పార్టీ నాయక స్థానంలో ఉన్నవారిలో ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ ధోరణుల ఫలితంగానే, రెండో అభిప్రాయాన్ని గౌరవించకపోతేమానె, కనీసం స్వీకరించగల ప్రజాస్వామిక నైజం కొరవడినందువల్లనే అర్ధంతరంగా, అనాలోచితంగా, నిరంకుశంగా మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి పేద, మధ్యతరగతి, చిన్న పారిశ్రామిక వర్గాలకు బ్యాంకులలో నగదు లావా దేవీలు జరుపుకొనకుండా నానా ఇబ్బందులకు గురిచేసినప్పుడు– ముందు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ రాజన్, ఆ పిమ్మట వచ్చిన ఊర్జిత్ పటేల్, ఆ తర్వాత క్రమంగా మరి ఇద్దరు గవర్నర్లు పదవులకు రాజీ నామాలిచ్చి మౌనంగా నిరసన తెలపాల్సి వచ్చింది, అలాగే బీజేపీ– ఆరె స్సెస్ సర్కార్ ప్రవేశపెట్టించిన విద్యా సంస్కరణలకు నిరసనగా కనీసం ఇరువురు ప్రముఖ విద్యావేత్తలు తమ వైస్ ఛాన్స్లర్ పదవులను అర్ధంతరంగా విడిచిపెట్టి పోవలసివచ్చింది. ఇంతటి పరిణామాలు దేశ ప్రజలు అంతకుముందు అంత ఆకస్మిక నిర్ణయాలుగా ఎరుగరు. చివరికి ప్రపంచ ప్రసిద్ధ భారత ఆర్థికవేత్తలలో ఒకరు, నోబెల్ బహుమాన గ్రహీత, నలందా (బౌద్ధ) విశ్వవిద్యాలయాల వైస్–ఛాన్స్‌లర్‌గా ఉంటున్న ప్రొఫెసర్ అమర్త్యసేన్, బీజేపీ పాలకుల ఒత్తిడి వల్లనే మోదీ తొలి పాలనలోనే వైదొలగవలసి వచ్చింది. పైగా– స్వామి వివేకానందను గౌరవిస్తున్నట్లు కనబడుతూనే ఆయన చికాగో (అమెరికా) ప్రపంచ సర్వమత సమ్మేళన సభలో చేసిన మహా నైతిక బోధను, దాని ప్రాశ స్త్యాన్ని బీజేపీ–పరివార్ పాలకులు ఆచరణలో పాటించడం మానేశారు. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒకే నేత’ అనే సరికొత్త పాలనా నినాదం లేదా విధానంవల్ల దేశంలో రెండో స్వాతంత్య్ర పోరాటం ద్వారానే బహుశా మోదీ ఆశిస్తున్న నిజమైన ‘సురక్ష ఆధునిక సర్వజన దేశం’ ఆవిర్భవిస్తుందేమో కళ్లు వత్తులు చేసు కుని చూద్దాం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పార్లమెంటరీ విధానంలో మార్పు రావాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సెక్యులరిజం మరింతగా పటిష్టం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ప్రజాసమస్యలపై చర్చ పెరగాలని, ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలన్నారు. ఆదివారం ఇక్కడి బిర్లా ఆడిటోరియంలో లెర్న్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టాక్ విత్ అసద్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువ త వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చా రు. పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చిన ప్రజాసమస్యలపై ప్రధాని మోదీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ఉపన్యాసాలతో పక్కదారి పట్టించారని ఆరోపించా రు. ఐదేళ్లలో కశ్మీర్ సమస్య మరింత జఠిలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు కశ్మీరీలు వలస వెళ్లి జీవించే పరిస్థితి లేకుండా చేశారన్నారు. పుల్వామా ఉగ్రదాడికి పెద్దమొత్తంలో ఆర్డీఎక్స్ ఎలా వచ్చిందని ఎవరూ ప్రశ్నించడం లేదని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు రఫేల్ తప్ప ఇంకేమీ పట్టింపు లేద ని విమర్శించారు. పాలకులు మారుతున్నారే తప్ప మైనారిటీలకు ఒనగూరుతున్న అభివృద్ధి శూన్యమన్నారు. కలసికట్టుగా ముందుకు వెళ్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణ యం తీసుకుంటునే సమర్ధవంతమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. రాజకీయాల్లో త్యాగా లు పనికి రావని, బతికి ఉండి ప్రజాసేవ చేయాలన్నారు. యువత టీవీలను వీక్షించడం తగ్గించి పత్రికలు చదివి మరింత జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఎంపీ కోటా నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఆరు రోజులు పార్టీ కార్యాలయమైన దారుస్సాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. యువత పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
భారత్‌లో లౌకికవాదం ఇంకెక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ విభజన సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల్లో లక్షలాది ప్రజలు మరణించినప్పుటికీ భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాంగానికే కట్టుబడి పనిచేశారు. ఏ మతాన్ని ప్రోత్సహించక పోవడం, ఏ మతం పట్ల వివక్ష చూపక పోవడం, సర్వమతాలను సమాన దృష్టితో ప్రభుత్వం చూడడమే భారత లౌకిక వాదం. అయితే 1980 దశకం నుంచి ఈ భారత లౌకిక వాదం బలహీన పడుతూ వస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారికంగా దీపావళి వేడుకలను నిర్వహించగా, అయోధ్యలో తమ ప్రభుత్వమే రామాలయాన్ని నిర్మిస్తుందని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నాడు అధికార హోదాలో కాలికాదేవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో భారత దేశానిది లౌకిక రాజ్యాంగమని ఏమాత్రం చెప్పుకోవడానికి, గర్వపడడానికి వీల్లేదు. దేశంలో లౌకికవాద పునాదులను కదిలిస్తూ కేవలం హిందూ మతం నుంచి మరో మతంలోకి మార్పిడులను అడ్డుకునేందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో మత మార్పిడుల నిరోధక చట్టాలను తీసుకొచ్చారు. గోవధ నిషేధ చట్టాలను తీసుకొచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లౌకికవాదానికి పట్టం కడతారన్న నమ్మకం కూడా ఎవరికి లేకుండా పోయింది. ఎన్నికల రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. -
కాపాడుకోవాల్సిన లౌకిక కాంక్ష
‘‘నేను ఇస్లామిక్ పాకిస్తాన్లో బతకను. లౌకిక భారత దేశంలో జీవిస్తాను’’ అన్న సాహిర్ లూథియాన్వీ ప్రకటన ఆయనలోని అద్భుతమైన లౌకిక కాంక్షాపరుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆయన ప్రతి అక్షరం అణచివేతపై ఎక్కుపెట్టిన విల్లంబే. ఆయన ప్రేమగీతాల్లో సైతం స్త్రీల పక్షపాత ధోరణి గోచరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆయనొక వర్గదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్టు, స్త్రీల అస్తిత్వాన్ని చాటిచెప్పిన ఫెమినిస్టు. ఈనాటి సమాజానికి సాహిర్ లూథియాన్వీ వదిలివెళ్ళిన లౌకిక అభ్యుదయ, ప్రజాస్వామ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘తూ హిందూ బనేగాన ముసల్మాన్ బనేగా ఇన్సాన్కీ అవులాద్ హై ఇన్సాన్ బనేగా’’ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఈ పాట యావత్ భారతదేశాన్నీ ఓ కుదుపు కుదిపింది. ‘దూల్ కా ఫూల్’ అనే హిందీ చిత్రంలో ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూథియాన్వీ కలం నుంచి జాలువారిన సినీగీతమిది. ఇదే పాటలో మాలిక్‌నే హర్ ఇన్సాన్ కో/ఇన్సాన్ బనాయా హమ్నే ఉసే హిందూ యా ముసల్మాన్ బనాయా/ కుద్రత్ నే తో హమే బక్సీ థీ ఏకీ ధర్తీ హమ్ నే కహీ భారత్ /కహీ ఇరాన్ బనాయా! ఈ గేయం కవి సాహిర్ లూథియాన్వీలోని గొప్ప మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది. దూల్ కా ఫూల్ చిత్రం 1959లో అప్పటికి భారత దేశంలోనూ, పాకిస్తాన్‌లోనూ అల్లర్లు జరిగి చేదు జ్ఞాపకాలను మూటగట్టుకున్న సందర్భంలోనిది. లక్షలాది మంది ప్రజలు, వేలాది కుటుంబాలు ఉన్న ఇళ్లనీ, కన్న తల్లుల్నీ వదిలి కొంపాగోడూ వెతుక్కుంటూ దేశాన్ని వీడి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దూల్ కా ఫూల్ చిత్రం తీసారు. ఈ చిత్రం ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘర్షణ. పెళ్ళి కాకముందే తల్లి అయిన ప్రేమికురాలు తన ప్రేమను అంగీకరించి ఇరువురికీ పుట్టిన బిడ్డను తమ బిడ్డగా అంగీకరించి స్వీకరించాల్సిందిగా ప్రియుడిని కోరుతుంది. అతను నిరాకరించడంతో ఆమె సమాజానికి భయపడి తన ఆరు నెలల పసికందును పట్టణం సమీపంలోని ఓ చిట్టడివిలో వదిలి వెళుతుంది. అదే తోవలో వెళుతోన్న ఒక ముస్లిం వ్యక్తి ఆ పసివాడిని వెంటతీసుకువెళ్లి కంటికి రెప్పలా కాపాడుకొని పెంచి పెద్దచేస్తాడు. కులమేదో, మతమేదో కూడా తెలియని ఆ అనాథ బాలుడిని పెంచుకున్నందుకు అతడిని ఇస్లాం మత పెద్దలు వెలివేస్తారు. వెలివేతను లెక్కచేయని ఆ ముస్లిం వ్యక్తి ఆ పిల్లవాడిని తనతో తీసుకెళతాడు. పైగా ఆ పిల్లవాడికి రోషన్ అనే హిందూ పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఆ సందర్భంలోనే చిత్రీకరించిన పాట ఇది. హిందూ ముస్లిం అనేవి మనుషులు గీసుకున్న విభజన రేఖలేననే సందేశాన్ని ఈ పాటలో కవి లూథియాన్వీ వెలిబుచ్చుతాడు. ఇప్పటికీ ఈ మతాల విభజనరేఖని చెరపలేని సమాజానికి అరవైయేళ్ళ క్రితమే సర్వమానవ సౌభ్రాతృత్వ సందేశాన్నిచ్చిన లూథియాన్వీ జీవితం కూడా సరిగ్గా ఇదే ఒరవడిలోంచి రావడం యాదృచ్ఛికమే కావచ్చు. నాటికీ, నేటికీ లూథియాన్వీ... ప్రేమకూ, ప్రేమికులకూ పాటల పట్టాభిషేకం కట్టినవాడు. అటువంటి సాహిర్ లూథియాన్వీ జీవితం గురించి తెలిసిన వారు బహుతక్కువనే చెప్పాలి. లూథి యాన్వీ అసలు పేరు అబ్దుల్ హయీ. సాహిర్ లూథి యాన్వీ ఆయన కలంపేరు. ఆయన లూథియానాలో జన్మించడం వల్ల లూథియాన్వీ అయ్యాడు. కవిత్వం రాయడం వల్ల సాహిర్ అయ్యాడు. సాహిర్ లూథి యాన్వీగా మారిన అబ్దుల్ హయీ మార్చి 8, 1921న జన్మించాడు. తల్లి సర్దార్ బీబీ. ఆయన తండ్రి ఫజల్ మహమ్మద్. ఫజల్ మహమ్మద్ అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వాడు. తన సంపదకు వారసుడు కావాలనే కారణంతో 11 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అందులో సాహిర్ లూథియాన్వీ తల్లి సర్దార్ బీబీ ఒకరు. లూథియాన్వీ తల్లి సామాజిక, ఆర్థిక నేపథ్యం ఫజల్ మహమ్మద్ కుటుంబానికి నచ్చలేదు. దాంతో తమ వివాహ సంబంధాన్ని ఫజల్ మహమ్మద్ నిరాకరించాడు. దాంతో సర్దార్ బీబీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకి వెళ్ళకముందే ఫజల్ ద్వారా సర్దార్ బీబీ గర్భందాల్చింది. కింది కోర్టులో ఆమె వీగిపోయింది. లూథియాన్వీని తన కొడుకుగా ఫజల్ మహమ్మద్ అంగీకరించలేదు. బీబీ మాత్రం తన పట్టువదల్లేదు. లాహోర్‌లోని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పై కోర్టు ఫజలుద్దీన్ సాహిర్ లూథియాన్వీకి తండ్రి అని నిర్ధారించింది. సాహిర్ ఫజలుద్దీన్‌కు నిజమైన వారసుడని ప్రకటించింది. తల్లి అయిన సర్దార్ బీబీని సాహిర్ సంరక్షకురాలిగా ఉండాలని ఆదేశించింది. సాహిర్ లూథియాన్వీని చంపడానికి సైతం ప్రయత్నిస్తారు. దీంతో సర్దార్ బీబీ తన కొడుకు సాహిర్ లూథియాన్వీని తీసుకొని బతుకుదెరువుకోసం అజ్ఞాత జీవితంలోకి వెళుతుంది. అందుకే సాహిర్ లూథియాన్వీ కవిత్వం తన తల్లి జీవితంలో అనుభవించిన కష్టాలతో పాటు వేనవేల స్త్రీల జీవి తాల్లో ముసురుకున్న సవాలక్ష సమస్యల్ని ప్రతిబింబిస్తుంది. సాహిర్ లూథియానాలో తన చదువుని కొనసాగించారు. కాలేజీ రోజుల్లోనే 1947 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నిలబడినందుకు కాలేజీ నుంచి యాజమాన్యం బహిష్కరించింది. లూథియానాలోని సతీష్ చందర్ ధావన్ ప్రభుత్వ కళాశాలలో ఆయన ఒక రోజు ఇచ్చిన ఉపన్యాసం ఆయన జీవితాన్ని మార్చివేసింది. చదువుని మధ్యలోనే ఆపివేసిన సాహిర్ తననూ, తన తల్లినీ పోషిం చుకోవడానికి చిన్నా చితకా ఉద్యోగాలెన్నో చేసాడు. కానీ ఆయన తన కవితాకాంక్షను మాత్రం వదులుకోలేదు. చేదుజ్ఞాపకాలు(బిట్టర్నెస్) పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. ఈ కవితా సంపుటి ప్రచురణతో సాహిర్ లూథియాన్వీ సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన నాలుగు ఉర్దూ పత్రికలకి ఎడిటర్‌గా పనిచేసారు. అందులో ఆదాబ్ యే లతీఫ్, సహకార్, ప్రిత్లరీ, సవేరా పత్రికలు ఈయన సంపాదకత్వంలో విజయవంతంగా నడిచాయి. ఆ సందర్భంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరారు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో రాసిన రాతలు అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వానికి కంట గింపుగా మారాయి. 1949లో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వారంట్‌తో వచ్చారు. దాంతో సాహిర్ ఢిల్లీ పారిపోయాడు. ఆ సందర్భంలోనే ‘‘నేను ఇస్లామిక్ పాకిస్తాన్లో బతకను. లౌకిక భారత దేశంలో జీవిస్తాను’’ అన్న సాహిర్ లూథియాన్వీ ప్రకటన ఆయనలోని అద్భుతమైన లౌకిక కాంక్షాపరుడిని మనకు పరి చయం చేస్తుంది. సాహిర్ లూథియాన్వీ సినీగేయ రచయితగానే ప్రపంచానికి పరిచయం. అయితే ఆయనలో పరవళ్ళు తొక్కిన అభ్యుదయ ప్రజాకవిత్వం గురించి మాత్రం కొందరికే తెలుసు. ఆయన ఢిల్లీ నుంచి ముంబాయికి మారినప్పుడు, సినిమాలలో పాటలు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యుదయ రచయితల సంఘంలోని ఆయన మిత్రులు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. అయితే చిత్రపరిశ్రమకు బయట ఆయన రాసిన కవిత్వం మాత్రమే ఆ విమర్శలకు సరైన సమాధానం అయ్యింది. విమర్శకులెవ్వరూ ఆ తరువాత నోరుమెదపలేదు. సాహిర్ లూథియాన్వీ కవిత్వంలో పైన పేర్కొన్నట్టుగానే మహిళల జీవితం ఒక కోణం అయితే పేదలు, కార్మికులు, అనాథలు మరో పార్శ్వంగా ఆయన కవితాలోకాన్ని ఆశ్రయిస్తారు. పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, వివక్ష, అణచివేత, ఇవన్నీ ఆయనకు బద్ధ శత్రువులు. తాజ్‌మహల్ అందచందాలనూ, చలువరాతి సోయగాలనూ పొగిడిన కవులే మనకెంతో మంది కనిపిస్తారు. ఈ కట్టడం ప్రేమకు చిహ్నమే కావచ్చు. రాజుల గొప్పతనమే కావచ్చు. కానీ తాజ్‌మహల్ నిర్మాణంలో శ్రమజీవుల నెత్తుటి ధారలను కవిత్వాం తరంగంలోకి ఇంకించింది మాత్రం సాహిర్ లూథి యాన్వీనే. నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతూ సంబరాలు చేసుకుంటున్న వాళ్ళకార్లను వెంబడించే పేదపిల్లల గురించి రాస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం విధ్వంసాన్ని కళ్ళారా చూసిన సాహిర్ లూథియాన్వీ యుద్ధాన్ని తీవ్రస్వరంతో ద్వేషిస్తాడు. యుద్ధం ఒక సమస్య మాత్రమే. అది సమాధానం కాదు అని ప్రకటించిన లూథి యాన్వీ యుద్ధం ఈ రోజు రక్తపాతాన్ని సృష్టిస్తే, రేపు అది ఆకలినీ, ఆర్తనాదాల్నీ బహూకరిస్తుందంటాడు. పేద, అణగారిన వర్గాల జీవితాల్లోని ప్రతి చీకటి కోణాన్నీ తడిమి చూసినవాడు సాహిర్. పీడితులకూ, పేదలకూ రేపటి కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఏకమౌదాం రండి అంటూ పిలుపునిస్తాడు. ఈనాటి సమాజానికి సాహిర్ లూథియాన్వీ వదిలివెళ్ళిన లౌకిక అభ్యుదయ, ప్రజాస్వామ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు సాహిర్ స్వప్నాన్ని చిన్నాభిన్నం చేసేవిగా ఉన్నాయి. మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య, అగాధాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న శక్తులు నానాటికీ విజృంభిస్తున్నాయి. ఇవి భారతదేశ వారసత్వ భావనలను ధ్వంసం చేస్తోన్న పరిణామాలు. సరిగ్గా ఇక్కడే సాహిర్ లూథియాన్వీ మనకు ఒక వెలుగుదివ్వెలా కనిపిస్తాడు. పాకిస్తాన్ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చిన సమయంలో ఆయన అన్న మాటలు మనకు ప్రతిక్షణం గుర్తుకు రావాలి. అంతేకాదు ఆ మాటల అంతస్సారం మనకు మార్గదర్శకం కావాలి. లౌకిక భారతావనిలో జీవిస్తాను అని ప్రకటించిన సాహిర్ లూథియాన్వీ వ్యాఖ్యలు మనకాదర్శం కావాలి. సాహిర్ లూథియాన్వీ తల్లి కూడా ఎంతో సాహసోపేతమైన జీవితాన్ని గడిపింది. అదే సాహసం తన కొడుక్కి వారసత్వంగా అందించింది. అదే ఆయనను నిజాయితీగా, నిర్భీతితో ఎదిగేలా చేసింది. ఆయనలో అత్యంత మానవీయతను నాటింది. అతడిని శ్రామిక జనపక్షపాతిగా నిలిపింది. ఎంత ఎత్తుకెదిగినా తన పునాదిని మరువకుండా చేసింది. కష్టజీవుల కన్నీళ్ళను తడిమి చూసింది. ఆయన ప్రతి అక్షరం అణచివేతపై ఎక్కుపెట్టిన విల్లంబే. ఆయన ప్రేమగీతాల్లో సైతం స్త్రీల పక్షపాత ధోరణి గోచరిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఆయనొక వర్గదృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమ్యూనిస్టు, స్త్రీల అస్తిత్వాన్ని చాటిచెప్పిన ఫెమినిస్టు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ఈ–మెయిల్ : lmallepalli@gmail.com -
మౌలిక లక్షణం మలినం కారాదు
ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్‌లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. మన దేశంలో జరిగే చాలా బహిరంగ చర్చలు ఎలా ఉంటాయంటే, అవి బధిరుల సంభాషణలను మరిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు ప్రతి నాయకుల మధ్య జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శత్రువుల మధ్య సాగుతూ ఉంటాయనవచ్చు. వాదనలోని ఏ ఒక్క విషయాన్ని అంగీకరించకూడదని భీష్మించుకుని కూర్చున్నట్టే వారు ఉంటారు. ద్వంద్వ యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో చర్చకు దిగినట్టు ఉంటుంది. ఇక మిత్రులైతే ఒకరి వాదనను ఒకరు బహి రంగంగా నిరాకరించుకోరు. అందుకే మన టీవీ చర్చలన్నీ అలా చెవులు చిల్లులు పడేటట్టు ఉంటాయి. చాలా చర్చలు సమర నాదాల తోనే సాగుతాయి. ఇంకా, దశ దిశ లేకుండా ఉంటాయి. ఈ కారణం గానే ఈ మధ్య ‘మైనారిటీల స్థితిగతులు’ అన్న అంశం మీద జరిగిన ఒక చర్చను చూశాక ముచ్చటగా అనిపించింది. సెక్యులర్‌వాద కార్య కర్తలు, మేధావులు కొందరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ఆ అంశం మీద తమ తమ విభేదాల గురించి వెల్లడించారు. ప్రముఖ సామాజిక, మానవ హక్కుల కార్యకర్త హర్షమందిర్ రాసిన వ్యాసంతో ఈ చర్చ ఆరంభమైంది. ఆరోగ్యకరమైన చర్చ అవశ్యం ముస్లింల పార్టీ అన్న ముద్ర పడడం వల్లనే మొన్నటి సాధారణ ఎన్ని కలలో కాంగ్రెస్ ఓటమి పాలైందంటూ ఆ మధ్య ఇండియాటుడే పత్రిక నిర్వహించిన గోష్టిలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన ప్రకటన ఆధారంగా హర్ష ఆ వ్యాసం రాశారు. సోనియా అభిప్రాయానికి మరొక ఉదంతం కూడా జోడించారు. ఒక సందర్భంలో ముస్లింలను బురఖా, టోపీ లేకుండా రావాలంటూ చెప్పిన ఉదంతమది. ముస్లింలు ఈరోజు రాజకీయ అనాథలుగా మిగిలిపోయారని ఆయన వాదన. కానీ ప్రముఖ చరిత్రకారుడు, ఉదారవాద మేధావి రామచంద్ర గుహ దీనితో విభేదించారు. బురఖా ధరించడం ముస్లింల వెనుకబాటుతనానికి ప్రతీకగా కనిపిస్తుందనీ ఉదారవాదులైన మేధావులు ఎవరూ దానిని ఎట్టి పరిస్థితులలోను సమర్థిం చరాదనీ గుహ అభిప్రాయం. ఇంకా సుహాస్ పాల్షికార్, ఇరేన్ అక్బర్, ముకుల్ కేశవన్ వంటి మేధావులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే, అసలే ముస్లింలు పెద్ద సవాలును ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి చర్చ జరగడం గురించి కొందరు మేధావులు కలత పడి ఉండవచ్చు. దీనిని నేను అంగీకరించను. ఎందుకంటే, తమని తాము ఆత్మశోధన చేసుకోవడానికి కష్ట కాలమే మంచి అవకాశం ఇస్తుంది. ఆచరణ ఎలా ఉందన్నదే ప్రశ్న సిద్ధాంతపరంగా, ఆచరణ స్థాయిలో సెక్యులరిజం ఎలా ఉన్నదీ అనే అంశం గురించి నిజాయితీగా చర్చించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి చర్చ అనివార్యంగా జరగాలి కూడా. ఎందుకంటే మన గణతంత్ర రాజ్యం నిర్దే శించుకున్న పవిత్ర సిద్ధాంతం సెక్యులరిజం. 1975లో సెక్యులరిజం అన్న పదాన్ని మన రాజ్యాంగ పీఠికలో లాంఛనంగా చేర్చుకుని ఉండవచ్చు. కానీ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగమది. సెక్యులర్ కాని భారతదేశాన్ని మనం ఎంచుకోలేదు. అయినప్పటికీ ఆచరణలో ఈ పవిత్ర సిద్ధాంతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. ఇందుకు కారణం సెక్యులరిజం ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా రెండు మౌలిక దోషాలతో ఉంది. వాటి గురించి నిజాయితీతో బహిరంగంగా చర్చిండానికి ఇదే అను కూల సమయం. ఆ రెండింటిని రాజకీయ సెక్యులరిజం సమస్య, మేధావుల సెక్యులరిజం సమస్య అనుకోవచ్చు. సెక్యులరిజాన్ని రాజకీయ రంగం పర స్పర విరుద్ధంగా, పక్షపాత దృష్టితో, ఒక సాధనం అన్న ధోరణి నుంచే ఆచ రిస్తుండడం మొదటి సమస్య. ఏదైతే మైనారిటీల హక్కుల పరిరక్షణే ఆశ యంగా మొదలైందో, కాలగమనంలో అదే ఇతరుల బలహీనతలను ఆధారం చేసుకుని మైనారిటీ మేధావులు ప్రయోగించడానికి ఉపకరించే సాధనంగా మారిపోయింది. వాస్తవాల వెల్లడిలో దాపరికమేల? మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం మధ్య వైరుధ్యాన్ని శాస్త్ర బద్ధంగా వివరించేందుకు ప్రారంభమైన ఆలోచనే, ఇప్పుడు ముస్లిం మైనా రిటీలను మతోన్మాద పంథాలో కదిలించడానికి జరుగుతున్న ప్రయత్నం నుంచి, వారిలో వ్యక్తమవుతున్న పురోగమన వ్యతిరేకతల నుంచి మన దృష్టిని మళ్లించేదిగా పరిణమించింది. హిందూ సామాజిక విధానంలోని రుగ్మతలను బాహాటంగా చర్చించడానికి చర్చలూ, అందులోని అవాంఛనీయ పరిణామా లను గురించి చెప్పడానికి ఒక విమర్శకుడు కనిపిస్తున్నారు. కానీ ఇతర మతా లలో కనిపించే అలాంటి రుగ్మతలను, అవాంఛనీయ పోకడలను చర్చించే విమర్శకులు తరచూ మౌన ప్రేక్షకులై పోతున్నారు. హిందువులు, వారి సంస్థలు చేస్తున్న దుర్మార్గాల మీద దాడి జరుగుతుంది. శల్యపరీక్షలు జరుగు తాయి. అదే విధంగా ఒక చర్చి, లేదా గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థలు చేసిన దుర్మార్గాల గురించి ఎలాంటి దాడి జరగదు. ఏ విధమైన∙శల్య పరీక్షలు ఉండవు. మైనారిటీలను లాలించడమనే ఆరోపణ తప్పయితే, ఒక సాధారణ ముస్లిం దుస్థితిని గురించి వస్త్వాశ్రయ దృష్టితో చేసిన సూచనలన్నీ కూడా కీడు చేసేవే అవుతాయి. ముస్లిం పురోహిత వర్గాన్ని లాలించడమనేది ఒక చేదునిజం. ఒకవేళ ఆరెస్సెస్, బీజేపీ ముస్లింలను ముస్లింతనానికే పరిమితం చేయాలని కోరుకుంటున్నాయని అనుకుంటే, సెక్యులర్ పార్టీలు చేస్తున్నది కూడా అదే. కొన్నేళ్లుగా సెక్యులర్ పార్టీలు ముస్లింలకు సంబంధించిన సమస్యలను మాత్రమే వెలుగులోకి తెచ్చి, వారి భద్రత గురించి మాత్రమే మాట్లాడి, వారి మత అస్తిత్వం గురించి మాత్రమే చెప్పి వారి ఓట్లను విజయవంతంగా తమ ఖాతాలో వేసుకోగలిగాయి. సాధారణ భారత పౌరులను చేసినట్టు సెక్యులర్ రాజకీయాలు ముస్లింలను ప్రజా సేవలకు, ప్రయోజనాలకు దగ్గర చేయలేదు. వెనుకబడిన ముస్లింలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో, కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు అ«ధికారంలో ఉన్న రాష్ట్రాల చరిత్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల రికార్డు కంటే భిన్నంగా ఏమీ లేదు. ఓటు బ్యాంకు రాజ కీయాలంటూ ఇతరులను విమర్శించే స్థితిలో బీజేపీ లేకపోవచ్చు. కానీ సెక్యులర్ పార్టీలు మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను బందీ లుగా చేసుకుని, వారి ఓట్లను రాబట్టుకోవడానికి సంక్షేమ పథకాల అమలు చేయడం కాకుండా, వారిలో భయాందోళనలు కల్పిస్తున్నారు. సెక్యులర్ పార్టీల ఈ ఘనతను గమనించిన తరువాత సెక్యులరిజం అంటే మైనారిటీ అనుకూల విధానం తప్ప మరొకటి కాదంటూ సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచారంలో సాధారణ హిందువులు పడి పోవడం పెద్ద వింతేమీ కాదు. మూలాలను నాశనం చేసిన మేధావులు ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్ చానల్స్‌లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. ఇది ప్రతికూలార్థం ఇచ్చేటట్టుగా కనిపించ డమే కాదు, సాంస్కృతికంగా అస్పష్టంగా అనిపిస్తుంది. సెక్యులర్ మేధావుల మాటలలో ఎక్కువగా తిలక ధారణ, బురఖా వంటి మత, సాంస్కృతిక చిహ్నాల పట్ల నిరసన కనిపిస్తుంది. సెక్యులరిజం, ఆధునిక విద్య మన మత వారసత్వం పట్ల ఒక సామూహిక నిరక్షరాస్యతను పెంచేశాయి. దీనితో జరి గిందేమిటంటే, సెక్యులరిజం అంటే ఏవో విదేశాలకు సంబంధించిన విధానం, పాశ్చాత్య ధోరణులు ఉన్న హేతువాదులకు పరిమితం, మన సంస్కృతీ సంప్రదాయాలలో ఇమిడేది కాదు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తు న్నది. ఈ సిద్ధాంతాన్ని దారుణంగా ఖండిస్తున్నప్పటికీ ఎదురొడ్డి మాట్లాడు తున్నవారు గడచిన రెండేళ్ల నుంచి బాగా తక్కువగా కనిపిస్తున్నారు. ఒక విషయం స్పష్టం చేస్తాను. ఇది సెక్యులరిజంను వ్యతిరేకించడం కాదు. సెక్యులరిజం అనేది గణతంత్ర భారతం అవతరణకు ఆదిలోనే ఏర్ప రుచుకున్న సిద్ధాంతం. మనం ఇప్పుడు పిలుచుకుంటున్న సెక్యులరిజం అనే సిద్ధాంతం నిజంగా సెక్యులరిజంగా ఉండాలంటే, సిద్ధాంత పరంగానే కాకుండా, దాని ఆచరణ తీరును గురించి పునరాలోచించుకోవాలని నా విన్నపం. మనకు కావలసినది పొందికైన, నిబద్ధత కలిగిన రాజకీయ సెక్యు లరిజం. మనకు మేధో సెక్యులరిజం కూడా కావాలి. కానీ అది మన బహు ళత్వ, మత సంప్రదాయాల మూలాలు కలిగినదై ఉండాలి. ఇందుకు మనం గాంధీజీ నుంచి కొంత నేర్చుకోవలసి రావచ్చు. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్: 98688 88986 -
డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం..
సాక్షి, హైదరాబాద్: అనేక రకాల దాడుల నుంచి సెక్యులరిజాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగమే గొప్ప ఆయుధమని, రాజ్యాంగం ప్రసాదించిన అత్యున్నతమైన విలువల వెలుగులలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా పిలుపునిచ్చారు. సెక్యులరిజానికి విఘాతం కలిగించే చర్యలను నియంత్రించకపోవడం వల్ల రోజురోజుకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. అషార్ఫరాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గాంధీ, నెహ్రూ కాలం నాటి సెక్యులరిజాన్ని ఇప్పుడు చూడలేమని, ఆనాటి లౌకికవాద విలువలు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వరుసగా జరుగుతున్న దాడులతో సెక్యులరిజానికి తూట్లు పడుతున్నాయి. దీంతో రాజ్యాంగ లక్ష్యం అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదు. ఇది మన సెక్యులర్ వ్యవస్థకే ప్రమాదకరం’’అని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోందని, దీనివల్ల దాడులు, హింస చెలరేగుతున్నాయన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పరమత సహనం, లౌకిక భావాలపై అవగాహన కల్పిస్తే భావితరాల్లో సెక్యులరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. వేర్పాటువాదం, మతం ఒకటి కాదు.. ప్రపంచంలో ఎక్కడ హింస చోటుచేసుకున్నా, దాడులు జరిగినా ఇక్కడ ముస్లింల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సరైంది కాదన్నారు. భారతీయ ముస్లింలు ఈ దేశ సంస్కృతిలో ఒక భాగమని అర్థం చేసుకోవాలన్నారు. ‘మైనారిటీ’భావనను ఏ ఒక్క దేశానికి, రాష్ట్రానికి పరిమితమైన అర్థంలో కాకుండా విస్తృత పరిధిలో చూడాలని, మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీ భావనను పునర్నిర్వచించాలని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తలెత్తే వేర్పాటువాద ఆందోళనలకు ముస్లిం మతానికి ఎలాంటి సంబంధం లేదని, రెండూ ఒకటి కాదని చెప్పారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇలాంటి అనేక విషయాలు స్పష్టంగా బోధపడతాయన్నారు. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేకుండా వాస్తవాలను యథాతథంగా రిపోర్ట్ చేయాలన్నారు. ‘పద్మావత్’ మూవ్మెంట్లో ఉన్నాం.. కొన్ని రకాల అసహన భావాలను చూస్తోంటే ఎంతో విస్మయం కలుగుతోందని, చరిత్రను ఉన్నదున్నట్లుగా స్వీకరించేందుకు కూడా కొన్ని వర్గాలు సిద్ధంగా లేవని నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కన్నబీరన్ అన్నారు. ఇప్పుడు మనమంతా ‘పద్మావత్’ సినిమా మూవ్మెంట్లో ఉన్నామని, పద్మావతి అనే మహిళ పేరును ‘పద్మావత్’గా మార్చి చెప్పుకునే దుస్థితిలో ఉన్నామన్నారు. ‘ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వుమెన్’అనే అంశంపై కొలంబియా రచయిత్రి లారా రెస్ట్రెపో, సీమా ముస్తఫా పాల్గొన్నారు. కొలంబియాలో ఇప్పటికీ మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారని లారా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు తమ భావప్రకటన స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారని, ఇందుకు రాజకీయాల్లో, సమాజంలో వ్యవస్థీకృత పురుషాధిపత్యమే కారణమని సీమా ముస్తఫా అన్నారు. మరోవైపు ‘ది జర్నీ ఆఫ్ కాటన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన చర్చలో మీనా మీనన్, ఉజ్రమ్మ పాల్గొన్నారు. బీటీ కాటన్బారి నుంచి దేశ రైతాంగాన్ని కాపాడాలని, మన దేశ అవసరాలకు అనుగుణమైన స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ఉజ్రమ్మ కోరారు. ‘ది జునూన్ ఆఫ్ ది కెండల్స్ అండ్ కపూర్స్’అనే అంశంపై శశికపూర్ కూతురు సంజనా కపూర్ మాట్లాడారు. తమ తండ్రి కుటుంబం నుంచి, అమ్మ కుటుంబం నుంచి నాటక రంగానికి జరిగిన కృషిని గురించి వివరించారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘గులాబీ టాకీస్’సినిమాను ప్రదర్శించారు. ముంబైకి చెందిన చింటూసింగ్ కళాకారుల బృందం ప్రదర్శించిన బాంబే బైరాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ భాషల్లో సాగిన కవి సమ్మేళనం విశేషంగా ఆకట్టుకుంది. మిలిటరీ హీరోస్‌కు సెల్యూట్.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శత్రువుతో వీరోచితంగా పోరాడే ఎందరో సైనికులు తమ సొంత జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రముఖ జర్నలిస్టులు శివ్అరూర్, రాహుల్‌సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు, ఇటీవల జరిగిన పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయిన 14 మంది వీరుల గాథలను వివరిస్తూ వారు రాసిన ‘ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలటరీ హీరోస్’పుస్తకంపై నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. సరిహద్దుల్లో సైనికులతో గడిపిన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం.. ‘లిటరేచర్ అండ్ ఫిల్మ్’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ కన్నడ డైరెక్టర్ గిరీష్ కాసరవల్లి మాట్లాడుతూ.. డబ్బింగ్ సినిమాల వల్ల సినీపరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోందన్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదని, దీనివల్ల ఆయా భాషల్లో సినిమాలు తీసేందుకు అవసరమైన 70 విభాగాలు నష్టపోతాయన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఇప్పటికీ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని, ప్రభుత్వ సేవలను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఆదిరాజు పార్థసారథి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అధ్యక్షత వహించారు. -
‘లౌకికత’నే లేకుండా చేస్తే..!
లౌకిక రాజ్యం అనే పేరు వింటేనే దురదగుండాకు ఒంటికి పూసుకున్నట్లు భావిస్తున్న కేంద్రం, రాజ్యాం గంలో లౌకికత అనే పేరు లేకుండా చేయాలని భావిస్తోంది. అలా మన దేశం కూడా మతతత్వరాజ్యమైన పాకిస్తాన్ దుస్థితికి వెళ్లాలని పాలకుల ప్రయత్నం. అప్పట్లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు, ‘రాజ్యాంగాన్ని సవరించేం దుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. ‘అత్యవసర పరిస్థితిలో భారత రాజ్యాంగం అన్న పేరు, దాని పీఠికలో ప్రజాస్వామ్య లౌకిక, సోషలిస్టు రిపబ్లిక్ అన్న విశేషాలకు పర్యాయపదాలుగా అలానే ఉంచి, లోపల పేజీలలో వీటి వివరణలు అన్నింటినీ సవరించవచ్చు’ అని కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ సమాధానమిచ్చారు. ‘అలా అయితే ప్రాథమిక హక్కులు, పౌరులకు జీవించే హక్కు సంగతేమిటి?’ అని న్యాయమూర్తులు అడిగారు. ‘దాన్ని కూడా పూర్వపక్షం చేస్తూ సవరణ చేయవచ్చు’ అని అదే అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ పాలనలో ప్రధాని మోదీ, అమిత్ షాల ద్వయం పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీలో వలే మన భారతదేశమైన ఈ దేశ ప్రజలం, మాకై మేము నిర్మించుకున్న ప్రజాస్వామ్య, లౌకిక, సోషలిస్టు రిపబ్లిక్ అన్న పేరు మాత్రం మిగిలింది. మచ్చుకు స్థూలంగా చూద్దాం! మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రాజ్యాంగం. కానీ ప్రజలను తమ బూటకపు వాగ్దానాలతో వంచించి, అధికారంలోకి వచ్చిన పిదప, ఆ వాగ్దానాలన్నింటినీ తుంగలోతొక్కి తద్విరుద్ధమైన ప్రజావ్యతిరేక విధానాలతో, అధికారంలో కులుకుతున్నా, అదీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమేనట. ఇందుకు గత 3, 4 ఏళ్ల బాబు అబద్ధపు పాలనను మించిన సరైన ఉదాహరణ ఏముంటుంది? మరో ఘోరం ఏమంటే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని పలు రకాల భయభ్రాంతులకు గురిచేసి, ధన, పదవీ ప్రలోభాలతో లోబర్చుకుని ఫిరాయింపచేసి.. వారిని తమ వెన్నుపోటు పార్టీలో చేర్చుకున్నారు. మన రాజ్యాంగంలో మరో మౌలిక అంశం సోషలిజం. నేటికీ మన రాజ్యాంగ స్వరూపం పేరుకు మాత్రమే నిలిచివుంది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆ పేరును కూడా తొలగించడమే తరువాయిగా ఉంటోంది. కాంగ్రెస్ పాలకుల ఆచరణ ఎలా ఉండినా, అప్పుడప్పుడు సోషలిజం అనే పదాన్ని కలలో గుర్తుకొచ్చినట్లు అయినా అనేవారు. నేడు మోదీ, షా ద్వయం ఆ పదం ఉచ్చరించడం సరే, వినేందుకు కూడా ఘంటాకర్ణులే. మహాభారతంలో ఘంటాకర్ణుడు అని ఒక పాత్ర ఉంది. ఇతడు కృష్ణుడు అనే పదాన్ని సైతం వినడట. అందుకే చెవులకు గంటలు కట్టుకుని కృష్ణ అన్న పదం వినబడితే చాలు గంటల చప్పుడు చేసుకునేవాడట. మనందరం మోదీ పెద్దనోట్ల రద్దు వ్యవహారం చూశాం. కుబేరుల నల్లధనాన్ని తెల్లగా శుభ్రం చేసి, చలామణిలోకి తెచ్చే ప్రయత్నమే. ఎవరో ఎందుకు, మన బాబుగారి కుటుంబం మర్నాడు పెద్ద నోట్ల రద్దు కానున్నాయన్న ఉప్పందుకుని ఆ రోజే తమ హెరిటేజ్ కంపెనీ షేర్లను అమ్మేసి, తమ నల్లడబ్బును దర్జాగా వేల కోట్లు తెల్లగా మార్చి, తెల్లదొరలల్లే తిరుగుతున్నారు కదా. నరేంద్ర మోదీ తన ఈ ‘విప్లవ సోషలిస్టు’ చర్యవలన కుబేరులు, కోటీశ్వరులు కునుకు పట్టక తల్లడిల్లుతున్నారని ప్రచారం చేసుకున్నారు. తీరా జరిగిందేమిటి? నల్ల డబ్బు కనబడకుండా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు నిర్భయంగా తిరుగుతున్నారు. మోదీ పాలనలో మరో మహా గొప్ప చర్య జీఎస్టీ పన్నుల విధానం. దీని దెబ్బకు సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు వీరందరి నడ్డి విరిగింది. ఉన్న కొన్ని ఉద్యోగాలు ఊడి రోడ్డున పడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ రెండింటినీ రెండుచేతులతో ఆహ్వానించిన మన బాబు ప్రస్తుతం కిమ్మనడం లేదు. ప్రస్తుతం దేశంలో అత్యంత ధనవంతుల చేతిలో 90 శాతం సంపద పోగైతే, కడు పేదవారిలో 20 శాతం మందికి ఒక శాతం కూడా సంపద లేకుండా తిండి, నిలువనీడ కూడా కరువై కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారు. మరి ఆ పెద్దల సేవలో తరిస్తున్న ప్రభువుల పాలనలో సోషలిజమా? మన రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిజం పదం ప్రపంచీకరణకు గురై కుంచించుకుపోతోంది. ఇక లౌకిక రాజ్యం. మోదీ, షాలకు ఈ లౌకిక అన్న పదం వింటేనే దురదగుండాకు ఒంటికి పూసుకున్నట్లు ఎలర్జీతో వొళ్లంతా దురద. వీరికి, వీరి గురువులకు కావలసింది అఖండభారత హిందూ రాజ్యం. మన లౌకిక రాజ్యంలో ఎవరి మతం వారు స్వీకరించవచ్చు. ఎవరి విశ్వాసాలను వారు పాటించవచ్చు. కానీ పరమత ద్వేషమే పునాదిగా కలిగిన మతతత్వవాదులకు ఎవరికైనా మన రాజ్యాంగంలోని లౌకికత నచ్చదు. వీరందరికీ మన దేశం కూడా పాకిస్తాన్ ఆదర్శంలో నడవాలనే దుగ్ధ. దేశంలో గోసంరక్షకుల పేరుతో, మానవభక్షక సమూహాలు పేట్రేగి పోతున్నారు. గోసంరక్షణ వంకతో ముస్లిం, క్రైస్తవులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కూడా జరుగుతున్నాయి. కాగా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రాచీన కాలంలో మన దేశంలో అంతరిక్ష వాహనాలు, పుçష్పకవాహనాలు ఉండేవని, ప్లాస్టిక్ సర్జరీతో తెగిన శిరస్సులను కూడా అతికించేవారని ప్రసంగం దంచిన నేపథ్యంలో మన హేతువాదులకు, ప్రగతిశీలురకు రక్షణ ఎక్కడ? అందుకే గౌరీలంకేశ్ వంటివారు హత్యకు గురవుతున్నారు. రోహిత్ వేముల వంటి దళిత మేధావి తన దళిత పుట్టుకే తన మృత్యువైందంటూ హృదయం బద్దలై ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నింటినీ చూస్తే లౌకికత్వమా ఎక్కడున్నావు, రాజ్యాంగ పీఠికలో మాత్రమే ఉన్నావు అనాలనిపిస్తుంది. వీటన్నింటికీ తీసిపోనిది, మన దేశ ఫెడరల్ స్వభావాన్నే మార్చి, రిపబ్లిక్ బదులు, ఏకశిలా సదృశంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పన్నుల విధానం, ఒక జాతి అంటూ ఉన్మత్త జాతీయత పెచ్చరిల్లుతున్నది. ఇక మిగిలింది ‘ఒకే నేత మోదీ’ అన్నదే. లెనిన్ తన రోజుల్లో రష్యన్ పార్లమెంటు డ్యూమాను బాతాఖానీ క్లబ్ అన్నాడు. కులక్కులు, భూస్వాముల సభగా మిగిలిపోయిన డ్యూమాను రద్దు చేసి, దాన్ని నిజమైన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సభగా మారుస్తామని ప్రకటించారు. మన దేశ పార్లమెంటు కూడా బాతాఖానీ క్లబ్‌గా తయారైందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆచరణలో సాధించేది ఏమీ లేదని అందుకే సాయుధ పోరాటం, తదితర పోరాట మార్గాలను ఎంచుకోవలసిందేనని కొన్ని విప్లవ కమ్యూనిస్టు గ్రూపులు, ప్రధానంగా మావోయిస్టు పార్టీ ప్రచారం చేయడమే కాకుండా పరిమితంగానైనా గత 50 ఏళ్లుగా అదే పంధాను కొనసాగిస్తోంది. వారిని తీవ్రవాదులని, అంతర్గత ప్రజాస్వామ్య విచ్ఛిన్నకులని ఆరోపిస్తున్న నేటి కేంద్ర, రాష్ట్ర పాలకుల వ్యవహార శైలిని చూస్తుంటే ప్రజలు తమ అనుభవం ద్వారా ఆ మావోయిస్టుల ప్రచారానికి ప్రభావితులయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. తస్మాత్ జాగ్రత్త. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 19848 06972 -
‘లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదు’
కొప్పల్(కర్ణాటక) : భారత రాజ్యాంగం నుంచి ‘లౌకికతత్వం’ పదాన్ని తొలగించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే వెల్లడించారు. కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సెక్యులరిస్టులపై విరుచుకుపడ్డారు. లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మేము సెక్యులరిస్టులం అని చెప్పుకోవడానికి రాజ్యాంగం ప్రజలకు అనుమతి ఇచ్చింది. రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారన్న విషయం గుర్తుంచుకోవాలి. మేం కూడా రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తాం. మేం అధికారంలోకి వచ్చింది అందుకే. మీరు ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే మతాలకు చెందిన వారు అయితే ఆ మతంతో, కులంతో సంబంధం కలిగివున్నందుకు గొప్పగా భావించండి. అంతేకానీ, అసలు ఎవరీ లౌకికవాదులు?. లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరు’ అని వ్యాఖ్యానించారు అనంత్. అనంత కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇస్లాం మతాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన నిరాకరించారు. -
లౌకికత్వం కోసం పోరాడారు
న్యూఢిల్లీ: ప్రజలను, దేశాన్ని కులమతాల పేరుతో విభజించాలనుకున్న వారికి వ్యతిరేకంగా, లౌకికవాదం కోసం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోరాడారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇందిర శత జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, జీవన విధానంపై ఆదివారం ‘ఎ లైఫ్ ఆఫ్ కరేజ్’ పేరుతో ఢిల్లీలో చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సోనియా మాట్లాడుతూ ‘ఇందిరను కొందరు ఉక్కు మహిళగా అభివర్ణించడాన్ని నేను విన్నాను. ‘ఉక్కు’ అనేది ఆమె వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. మానవత్వం, ఉదారత అనేవి ఆమెకున్న అనేక సద్గుణాలలో కొన్ని’ అని పేర్కొన్నారు. . ప్రముఖుల నివాళి... ఇందిర జయంతి సందర్భంగా ఆదివారం ప్రముఖులు నివాళులర్పించారు. ‘జయంతి సందర్భంగా ఇందిరా గాంధీని జాతి స్మరిస్తోంది’ అని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఓ ట్వీట్‌తో ఇందిరకు నివాళి అర్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోనూ లోక్‌సభ స్పీకర్ మహాజన్, బీజేపీ నేత ఆడ్వాణీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్æ తదితరులు నివాళులర్పించారు. ఇందిర సమాధి ‘శక్తి స్థల్’ వద్ద ప్రణబ్, మన్మోహన్, రాహుల్‌గాంధీ పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. ఇందిర దేశానికి అమ్మ అని బీజేపీ ఎంపీ, ఇందిర మనవడు వరుణ్ గాంధీ శ్లాఘించారు. మన్మోహన్‌కు శాంతి బహుమతి... ఈ ఏడాదికి ‘ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి’ బహుమతిని మాజీ ప్రధా ని మన్మోహన్ అందుకోనున్నారు. 2004 –14 మధ్య దేశాభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆయనను ఈ బహుమతికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
‘లౌకికతత్వం’ దేశాన్ని సర్వనాశనం చేసింది
రాయ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర తర్వాతి నుంచి వినిపిస్తున్న ‘లౌకికతత్వం’ అనే పదం అతి పెద్ద అబద్దమని అన్నారు. దేశాన్ని ఈ పదం సర్వనాశనం చేసిందని వ్యాఖ్యానించారు. చరిత్రను తప్పుగా చెప్పడం రాజ ద్రోహం కంటే పెద్ద నేరమని అన్నారు. ఎవరినైనా ఉద్దేశించి ‘పాకీ’ అనే పదాన్ని వాడితే యూరప్‌లో ఘోరమైన అవమానంగా భావిస్తారని వెల్లడించారు. దైనిక్ జాగ్రణ్ గ్రూప్ రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్యనాథ్.. కమ్యూనలిజమ్, సెక్యులరిజమ్‌లపై ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజమ్ అనే పదాన్ని సృష్టించిన వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సివుంటుందని యోగి అన్నారు. ఏ వ్యవస్థా కూడా లౌకికతత్వాన్ని పాటించలేదని చెప్పారు. రాజకీయ వ్యవస్థ న్యూట్రల్‌గా మాత్రమే ఉండగలదని అన్నారు. ఒకే విధానంతో ప్రభుత్వం నడవాలని ఎవరైనా చెప్పినా అది సాధ్యపడదని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను 22 కోట్ల మంది ప్రజల భద్రతకు, వారి భావాలకు సమాధానం ఇవ్వాల్సివుంటుందని అన్నారు. ఒక కమ్యూనిటీని నాశనం చేసేందుకు తాను సీఎం కుర్చీలో కూర్చొలేదని చెప్పారు. పాకిస్తాన్, పాకీ అనే పదాలను యూరప్‌లో వినియోగిస్తే అవమానంగా భావిస్తారని చెప్పారు. దేశంలో టెర్రరిజం, నక్సలిజం, వేర్పాటువాదాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. వందల కోట్ల మంది ప్రజల భావాలతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆడుకుందని అన్నారు. స్వార్థంతో దేశాన్ని విడగొట్టిన పాపం కూడా కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. కుల, మత, భాషల ప్రతిపాదికన దేశాన్ని చీల్చిన కాంగ్రెస్ పాపం ఊరికేపోదన్నారు. దేశం మొత్తం వసుధైక కుటుంబంలా ఉండాలే తప్ప ఇలా చిన్నభిన్నంగా ఉండకూడదని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని రామ రాజ్యంతో పోల్చుతూ.. ప్రజల బాధలు అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు చత్తీస్‌గఢ్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
సిరా చుక్కలో ఉషోదయం
కొత్త కోణం గౌరీ లంకేశ్ జీవితం, ఆలోచన, ఆచరణ ఒక విశాల ప్రజాస్వామ్య తాత్వికతకు అద్దం పడుతున్నాయి. ఏదో ఒక సిద్ధాంత చట్రంలో ఒదిగిపోయే తత్వం కాదు ఆమెది. ఆమె గత ముప్ఫై ఏళ్లుగా సాగించిన రచనలతో హిందుత్వ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అనేక సామాజిక సమస్యలపై విరుచుకుపడ్డారామె. హిందుత్వ వ్యతిరేక పోరాటం ఆమె ఎజెండానే. ఆమె హత్యకు ఇదే కారణం. వందల సంవత్సరాలుగా కులతత్వ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైన ఎన్నో వందల మంది ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది కూడా అందుకే. ‘మతవాదాన్ని రెచ్చగొట్టడమో, ప్రచారం చేయడమో నా ఉద్దేశం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా చాలామంది ఐక్యమవుతున్నారని మాత్రమే చెప్పదలచుకున్నాను. అబద్ధపు వార్తలను అసత్యాలుగానే బట్టబయలు చేస్తున్నందుకు అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఇటువంటి మంచి ప్రయత్నంలో కలసి వస్తారని ఆశిస్తున్నాను’ అంటూ గౌరీ లంకేశ్ తన ‘గౌరీ లంకేశ్ పత్రిక’ చివరి సంపాదకీయంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు, జర్నలిస్టులకు ఇచ్చిన సందేశమిది. 54 ఏళ్ల గౌరీ లంకేశ్ గత నెల 5వ తేదీన బెంగళూరులోని తన ఇంటి గుమ్మంలోనే హంతకులు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఆమె రచనలు ఎక్కువగా కన్నడలోనే ఉన్నాయి. అందుకే బాహ్య ప్రపంచానికి ఆమె రచనలు, తాత్విక దృక్పథాల గురించి తక్కువ తెలుసు. మరణానంతరం కొన్నింటిని ఇంగ్లిష్లోనికి అనువదించారు. ఆ చివరి సంపాదకీయం అలా లభించిందే. ఈ రచనను ప్రత్యేకమైనదిగా భావించాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు, ప్రధానంగా హిందుత్వవాదులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆధారాలతో సహా అందులో బయటపెట్టారు. ఉదాహరణకు గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రచారమైన ఒక అసత్యపు వార్త – సోషల్ మీడియాలో చాలా దుమారాన్ని లేపిన వార్త – గురించి ఆ సంపాదకీయంలో వివరించారు. ‘గణేశ్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ప్రభుత్వం సూచించిన స్థలంలోనే ప్రతిష్టించాలని, అందుకు పది లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని, విగ్రహం ఎత్తుకు సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ఇతర మతస్తులు నివాసాలున్న చోట నుంచి నిమజ్జనం ఊరేగింపు వెళ్లకూడదని, టపాకాయలు కాల్చకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అన్నదే ఆ వార్త. ఇది నిజం కాదని, కావాలనే ‘మోదీ భక్తులు’ ఈ వార్తను ప్రచారం చేశారని ఆ సంపాదకీయంలో ఆరోపించారు. కర్ణాటక పోలీసు ఉన్నతాధికారి ఆర్.కె. దత్తా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ వార్తలో నిజం లేదని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా ఆమె వివరించారు. ఈ వార్తతో పాటు, బాబా గుర్మీత్ రామ్ రహీంతో ప్రధాని మోదీ సహా పలువురు హరియాణా మంత్రులు తీయించుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయనీ, వాటిని పక్కదోవ పట్టించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రామ్ రహీంతో దిగినట్టు ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో ఉంచారనీ, నిజానికి అది కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో దిగిన ఫొటో అని తెలిసిందని కూడా ఆమె రాశారు. ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది గౌరి సత్యశోధనకు నిదర్శనం. ఇటువంటి అసత్యాలు ఎలాంటి దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంటాయో కూడా వివరించారు. కాదనుకుంటూనే తండ్రి వారసత్వం జర్నలిజం వ్యాసంగంలో ప్రవేశించాలని అనుకోలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వైద్యవృత్తిని చేపట్టాలని భావించానని, సాధ్యం కాక జర్నలిజం చదివానని చెప్పారు. తన తండ్రి పి. లంకేశ్ నడుపుతున్న పత్రికలో పనిచేయడం కష్టమని భావించానని, అలాగే ఆయన సాహసాన్ని అందుకోలేనని భావించినందువల్లే టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొదట చేరానని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కూడా ఆ పత్రికను నడపాలని ఆమె అనుకోలేదు. కానీ పి. లంకేశ్ స్నేహితులు పత్రికను మూసివేయవద్దని గౌరి కుటుంబాన్ని కోరారు. తన తదనంతరం ఏం చేయాలో తండ్రి ఏనాడూ చెప్పకపోయినా, పరిస్థితులను గమనించి పత్రికను కొనసాగించాలని గౌరి కుటుంబం నిర్ణయించుకున్నది. అయితే 2001 సంవత్సరం మొదట్లో గౌరికీ, ఆమె సోదరుడు ఇంద్రజిత్కూ పత్రిక విషయంలో విభేదాలు పొడసూపాయి. తన సోదరి మావోయిస్టు రాజకీయాలను పత్రిక మీద రుద్దుతున్నదని ఇంద్రజిత్ ఆరోపించారు. ఆ విమర్శకు సమాధానంగా తాను కూడా పత్రికాముఖంగా సోదరుడి వైఖరిని దుయ్యబట్టారు. చివరికి ‘గౌరీ లంకేశ్ పత్రిక’ పేరుతో ఆమె వేరే పత్రికను స్థాపించారు. గౌరి తన పత్రికను విలక్షణంగా నిర్వహించారు. ఏ పత్రిక నడపాలన్న ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. దానికి ప్రభుత్వాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే ప్రకటనలే ఆధారం. కానీ ఆమె ఈ రెండు రకాల ప్రకటనలను తిరస్కరించారు. ప్రధానంగా చందాదారుల సహాయంతో పాటు, ఇతర రచనల ముద్రణల నుంచి వచ్చిన ఆదాయంతోనే పత్రికను వెలువరించేవారు. ఇదో కొత్త పద్ధతి. ప్రజల కోసం నడిచే పత్రికలు మనగలగడం కష్టమనే అభిప్రాయాన్ని గౌరీ లంకేశ్ పూర్వపక్షం చేశారు. మావోయిస్టుగా, హిందూమత వ్యతిరేకిగా, తీవ్రవాద భావాలను ప్రచారం చేస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆమె రచనలను, జీవిత గమనాన్ని, రాజకీయ, సామాజిక సంబంధాలను పరిశీలిస్తే ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, మానవ హక్కుల గొంతుకగా, అసమానతలను నిరసించి, సామాజిక సమత్వాన్ని ప్రబోధించిన ఒక నిండైన శక్తిగా కనిపిస్తారు. కర్ణాటకలో చాలా ఏళ్లుగా పత్రికాస్వేచ్ఛ మీద దాడులు జరుగుతున్న సంగతినీ, మావోయిస్టు నాయకునితో ఇంటర్వ్యూ చేసినందుకు ఒక జర్నలిస్టు మీద కేసు బనాయించడానికి పోలీ సులు చేసిన ప్రయత్నాన్ని తాను అడ్డుకున్న విషయాన్నీ ఆమె ఒక వ్యాసంలో వివరించారు. లౌకికత్వాన్ని భగ్నం చేయవద్దన్నందుకు... ‘మతం, రాజకీయాలు, నగ్నసత్యం’ అనే పేరుతో ప్రచురితమైన ఒక వ్యాసంలో హరియాణా అసెంబ్లీలో నగ్నంగా దర్శనమిచ్చిన జైన ముని తరుణ్‌సాగర్ ఉదంతాన్ని ఉటంకించారు. ‘మన లౌకిక రాజ్యాంగం రాజకీయాల నుంచి మతాన్ని వేరుగా చూడాలని ప్రబోధించింది. కానీ మన దేశ రాజకీయాల్లో మతం ప్రధాన పాత్రను పోషిస్తున్నది’ అంటూ రాజ్యాంగ విలువలను గుర్తు చేశారామె. దేశభక్తి గురించి రాసిన మరొక వ్యాసంలో ‘ఈ రోజు దేశభక్తి గురించి జబ్బలు చరచుకొంటున్న హిందుత్వ శక్తులేవీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా వారంతా బ్రిటిష్ వారికి సానుభూతిపరులుగా ఉన్నారు’అంటూ చారిత్రక సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఒక్కళిగ సామాజిక వర్గం యువతి, ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నప్పుడు వివాదం చెలరేగింది. అప్పుడు ఆమె కుల సమస్యను తూర్పారబట్టారు. ‘కులం అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఎన్నో ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా కుల వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయి. వీటిని పట్టి పల్లార్చటమెట్లా’ అని ప్రశ్నిస్తూనే, కుల నిర్మూలన కోసం కులాంతర, మతాంతర వివాహాలు అవసరమని చెప్పే అంబేడ్కర్ ఆలోచన దీనికి పరిష్కారమంటూ ఆ వ్యాసాన్ని ముగించారు. బెంగళూరులో సఫాయి కార్మికులు మ్యాన్‌హోల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరతరాలుగా అంటరాని కులాలు ఎన్నో అవమానాలకు, అత్యాచారాలకు బలవుతున్నాయనీ, ఇలాంటి చావులు అందులో భాగమేనంటూ సమాజం ప్రదర్శిస్తున్న వివక్షను ఎత్తిచూపారు. బెంగళూరులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఉదహరిస్తూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, వారిపై జరిగిన వేధింపులను నిరసించారు. వీటితో పాటు, ఇటీవల గోరఖ్‌పూర్ హాస్పిటల్లో జరిగిన పసిపిల్లల మరణాలను బీజేపీ నరమేధంగా అభివర్ణించారు. హిందువులం కాదన్నందుకు... తన సామాజిక నేపథ్యాన్ని గౌరి ప్రగతిశీలమైనదిగా ప్రకటించుకున్నారు. గౌరి తండ్రి లింగాయత్ సామాజిక వర్గం. వీరు బసవేశ్వరుని అనుచరులు. బసవేశ్వరుడు నడిపిన వీరశైవ ఉద్యమాన్ని క్రమంగా హిందూ మతం మింగేసింది. బసవేశ్వరుడి ఉద్యమం కుల రహిత, కుల నిర్మూలన ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. లింగాయత్‌లు హిందువులు కారని, తాము కుల వ్యవస్థకు వ్యతి రేకమని తన సామాజికవర్గం భావించే హిందూత్వ వ్యతిరేకతలోని ప్రత్యేకతను గౌరి వెల్లడించారు. ఇది హిందుత్వ వాదులను, కుల సమాజ రక్షకులను భయపెట్టింది. అందుకే హిందూ మత వ్యతిరేకిగా, కమ్యూనిస్టుగా, నక్సలైటుగా ముద్ర వేశారు. కానీ ఆమె రచనలు చదివిన వారెవ్వరికైనా ఆమె ఏదో ఒక రాజకీయాలకు పరిమితమైన వ్యక్తికాదని అనిపిస్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా ప్రజలను ప్రేమించడానికి, ప్రజాఉద్యమాలకు అండగా నిలబడటానికే ఆమె వెచ్చించింది. పెళ్లి చేసుకున్నా, కొద్దికాలానికే విడాకులు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన విద్యార్థి యువజనోద్యమాలను ఆమె హత్తుకున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉద్యమ నాయకులైన కన్హయ్య కుమార్, గుజరాత్ దళిత యువకిశోరం జిగ్నేష్ మేవాని, షీలా రషీద్, ఉమర్ ఖలీద్‌లను తాను దత్తత తీసుకున్నానని, తాను వారి పెంపుడు తల్లినని ప్రకటించుకుని తన ఉద్యమ వాత్సల్యాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఈ నలుగురి రాజకీయ నేపథ్యం ఒకటి కాదు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కడ, ఎవరు ఉద్యమాలు చేసినా అందులో తాను మమేకమైపోవడం ఆమె సొంతం. మావోయిస్టు ముద్ర కూడా ఆమెకు సరైంది కాదు. అలాగని ఆమె మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేయలేదు. విప్లవ రచయిత వరవరరావుతో కలసి ఆమె అధ్యయనం చేశారు. కర్ణాటక – తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్వాసితులవుతున్న ప్రజల గురించి వీరిద్దరూ ఒక నివేదిక తయారు చేసినట్టు వరవరరావు చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో గౌరి సభ్యురాలు. ఆమెను మావోయిస్టుగా అభివర్ణించి, ఆ కమిటీ నుంచి తొలగించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదు. గౌరీ లంకేశ్ జీవితం, ఆలోచన, ఆచరణ ఒక విశాల ప్రజాస్వామ్య తాత్వికతకు అద్దం పడుతున్నాయి. ఏదో ఒక సిద్ధాంత చట్రంలో ఒదిగిపోయే తత్వం కాదు ఆమెది. ఆమె గత ముప్ఫై సంవత్సరాలుగా సాగించిన రచనలతో హిందుత్వ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అనేక సామాజిక సమస్యలపై విరుచుకుపడ్డారామె. హిందుత్వ వ్యతిరేక పోరాటం ఆమెకు ప్రధాన ఎజెండానే. ఆమె హత్యకు ఇదే అసలు కారణం. వందల సంవత్సరాలుగా కులతత్వ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైన ఎన్నో వందల మంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది కూడా అందుకే. కానీ అటువంటి త్యాగాలెప్పుడూ ఓడిపోలేదు. పోవు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
యూనివర్శిటీల్లో గోడలెందుకు ?
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి విశ్వవిద్యాయంలో, ప్రతి కళాశాలలో 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఓ దేశభక్తి గోడను నిర్మించాలని, దానిపై సైన్యంలో అత్యున్నత పురస్కారమైన పరమవీర్ చక్ర అవార్డు అందుకున్న 21 మంది ధీర సైనికుల చిత్రాలను పెయింట్ చేయాలని కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ మంగళవారం పిలుపునిచ్చారు. పైగా ఇది తన ఆలోచన కాదని, ఆరెస్సెస్ నేత తరుణ్ విజయ్ బుర్రలో నుంచి పుట్టుకొచ్చిందని కూడా చెప్పారు. ఇలాంటి గోడల నిర్మాణం వల్ల ఇప్పటికే కల్లోలంగా తయారైన కళాశాలల వాతావరణం ఎలా మారుతుందో, విద్యార్థుల్లో దేశ భక్తి ఎలా పెరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలు త్యాగం చేసిన అమరులు, రాజకీయ నాయకుల చిత్రాలను వదిలేసి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సరిహద్దుల వద్ద కాపలాగాస్తున్న సైనికుల చిత్రాలను పెట్టాలంటూ సూచించడం వెనక ఉద్దేశం ఏమిటీ? దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్రగానీ, సంస్కతిగానీ లేనీ ఆరెస్సెస్ లాంటి సంస్థలు దేశ స్వాతంత్య్ర పోరాట దశ్యాలనే విద్యార్థుల మనో ఫలకం నుంచి శాశ్వతంగా చెరపేయాలనుకుంటున్నాయా? దేశ సరిహద్దుల వద్ద కాపలాగాస్తూ విధి నిర్వహణలో ఎంతో మంది సైనికులు అమరులవుతున్నారనడంలో సందేహం లేదు. వారి ప్రాణత్యాగం వల్ల ఛిద్రమవుతున్న వారి కుటుంబాల గురించి కన్నీళ్లు పెట్టని వాళ్లు ఉండరు. బాధాతప్త హదయంతో వారి గురించి మాట్లాడని వారుండరు. అయితే అది ఎవరి తప్పు? దేశ, విదేశీ విధానాల వ్యూహాల్లో విఫలమవుతున్న రాజకీయ పెద్దలది కాదా? ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి పథంలో దేశాన్ని నడిపించలేక నెపాన్ని సరిహద్దు పరిస్థితులపైకి నెట్టివేసే నాయకులది కాదా? ఆరెస్సెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా గత ఫిబ్రవరిలో సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యంలోకి వచ్చిన ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న గుర్మెహర్ కౌర్కన్నా ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పగలరు? భార త్, పాక్ సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు చర్చల ద్వారా నెలకొల్పే నాయకత్వం ఇరు దేశాల్లో రావాలని, అప్పటి వరకు ఇరువైపుల ఎంతో మంది పిల్లలు తమ తండ్రులను కోల్పోతూనే ఉంటారని కార్గిల్ యుద్ధంతో తన తండ్రిని కోల్పోయిన కౌర్ మాటలు నేటి నాయకత్వానికి అర్థం అవుతాయా? ప్రభుత్వ యూనివర్శిటీల్లో, కళాశాలల్లో ఈ దేశభక్తి గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయదని, ప్రత్యేక నిధులు కూడా విడుదల చేయదని, విద్యార్థుల విరాళాల ద్వారా ఈ గోడలను నిర్మించాలని కూడా జవడేకర్ సూచించారు. అంటే గోడల నిర్మాణానికి ఎవరు ముందుకు రావలన్నది, వస్తారన్నది ఆయన ఉద్దేశం? అధికార పక్షానికి చెందిన విద్యార్థి సంఘం ముందుకొస్తే వాతావరణం ఎలా మారుతుందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఢిల్లీ యూనివర్శిటీ, కశ్మీర్ యూనివర్శిటీల్లో ఇప్పటికే చూశాం. అయినా గోడ కట్టడమంటే భిన్న విశ్వాసాలు, భిన్న సంస్కతులు కలిగిన భారతీయుల మధ్య గోడ కట్టడమే అవుతుంది. –ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
రాజ్యాంగం మన జీవనాడి
* వాడివేడి చర్చతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు షురూ * ‘లౌకికవాదం’ పదం చాలా దుర్వినియోగమవుతోంది: రాజ్‌నాథ్ * లౌకికవాదం అంటే.. ‘ధర్మ నిరపేక్షత’ కాదు.. ‘పంత్ నిరపేక్షత’ * రాజ్యాంగంలోని నియమాలపై దాడి జరుగుతోంది: సోనియా * విమర్శ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం: లోక్‌సభ స్పీకర్ * అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక్‌సభలో చర్చ న్యూఢిల్లీ: ‘భారత రాజ్యాంగానికి నిబద్ధత’ అనే అంశంపై చర్చతో అధికార, విపక్షాల మధ్య పరస్పర విమర్శలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. రాజ్యాంగ పీఠికలోని ‘లౌకికవాదమ’నే పదం చాలా దుర్వినియోగమవుతోందని ప్రభుత్వమంటే, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని విపక్షాలు ‘అసహనం’ అంశాన్ని లేవనెత్తాయి. స్పీకర్ సహా అధికార, విపక్ష సభ్యులందరూ రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కొనియాడారు. తొలి రోజు ప్రారంభంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సామరస్య పూర్వక వాతావరణం కనిపించింది. ప్రధాని మోదీ సభలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం, టీఎంసీ నేత సుదీప్ బంద్యోపాధ్యాయ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, ఆర్జేడీ నేత జైప్రకాష్ల వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ, కరచాలనాలు చేస్తూ అభివాదం చేశారు. ఆ సమయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ సభలో లేరు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై మురళీమనోహర్ జోషి, మరో ఇద్దరు సీనియర్ నేతలతో కలిసి పార్టీ నాయకత్వం మీద ధ్వజమెత్తిన కురువృద్ధుడు అద్వానీకి మోదీ అభివాదం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా, మంత్రి వెంకయ్య, మరి కొందరు బీజేపీ నేతలు ప్రతిపక్షాల స్థానాలకు వెళ్లి అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు. జైట్లీ ప్రతిపక్షాల స్థానం వద్దకు వెళ్లి ఆజాద్, శరద్‌యాదవ్, ఏచూరి, మాయావతి సహా విపక్ష నేతలందరినీ పలుకరించారు. రోజంతా సభలోనే మోదీ: చర్చ సందర్భంగా మోదీ గురువారం రోజంతా సభా కార్యక్రమాలు సాగినంత సేపూ సభలోనే కూర్చోవటం విశేషం. సభ్యులు మాట్లాడుతున్నపుడు వింటూ, నోట్స్ రాసుకున్నారు. ఉదయం 11కు మొదలైన సమావేశం గంట భోజన విరామం తర్వాత రాత్రి 7:15 వరకూ కొనసాగింది. మోదీ రోజంతా సభలో ఉండి రికార్డు సృష్టించారంటూ ఖర్గే వ్యాఖ్యానించి సభ్యులను నవ్వించారు. ‘లౌకికవాదం’ చాలా దుర్వినియోగమవుతోంది ‘‘రాజ్యాంగ పీఠికలో ‘సామ్యవాదం’, ‘లౌకికవాదం’ అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ రెండు పదాలూ రాజ్యంగంలో భాగమైనందున.. వాటిని పీఠికలో చేర్చాల్సిన అవసరముంటుందని బి.ఆర్.అంబేడ్కర్ ఎన్నడూ ఆలోచించలేదు. * సెక్యులరిజం (లౌకికవాదం) అనే పదానికి హిందీలో ‘ధర్మ నిరపేక్షత’ అనే పదాన్ని వినియోగించటం సరికాదు. సెక్యులరిజం పదానికి ‘పంత్ నిరపేక్షత’ (హిందీలో పంత్ అంటే మతం లేదా మతవర్గం) అనేది వాస్తవ అనువాదం. ఇది హిందీ అధికారిక అనువాదమైనందున ఈ పదాన్ని వినియోగించాలి. * ‘లౌకికవాదం’ అనేది దేశంలో అత్యంత అధికంగా దుర్వినియోగం చేసిన పదం. పదాన్ని అతిగా దుర్వినియోగం చేయటం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న ఉదంతాలు ఉన్నాయి. * రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేశారు. కోటా అనేది రాజ్యాంగంలో భాగం. ఈ అంశంపై ఇక చర్చకు ఆస్కారమే లేదు. * సీత విషయమై ఎవరో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తినపుడు ఆమెను ‘అగ్ని పరీక్ష’ ఎదుర్కోమన్న రాముడు గొప్ప ప్రజాస్వామ్యవాది. * అంబేడ్కర్ ఎన్నో అవమానాలకు, వివక్షకు గురైనా కూడా.. ఈ దేశాన్ని వదిలి వెళ్లాలని ఎన్నడూ ఆలోచించలేదు. (అమీర్‌ఖాన్ అసహనం విషయమై మాట్లాడుతూ తన భార్య దేశం విడిచి వెళదామా అన్నారన్న వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ పరోక్షంగా విమర్శించారు.) ముస్లింలలోని 72 తెగలన్నీ నివసించే దేశం, జోరాస్ట్రియన్, యూదు తెగలు నివసించే దేశం భారతదేశం. * అంబేడ్కర్ తత్వశాస్త్రంతో, రాజ్యాంగంతో మోదీ స్ఫూర్తి పొందారు.. జన్ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బఢావో - బేటీ పఢావో వంటి పథకాలను ప్రారంభించారు. చర్చలకు సభా వేదిక కన్నా పెద్దది ఏదీ ఉండదు ‘‘ఈ సమావేశాల్లో ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ చర్చ, ఉత్తమ వినూత్న భావనలు వస్తాయని విశ్వసిస్తున్నా. చర్చలకు సభా వేదిక కన్నా మరొక పెద్ద వేదిక ఏదీ ఉండదు. ’’ అని ప్రధాని మోదీ విలేకరులతో పేర్కొన్నారు. ఆయన గురువారం పార్లమెంటు భవనం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగే విషయమై బుధవారం అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ తాను మాట్లాడినట్లు చెప్పారు. ‘‘రాజ్యాంగం పీఠిక ప్రజల రోజు వారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మా లక్ష్యం. రాజ్యాంగం ఒక ఆశాకిరణం. అది మన మార్గదర్శి’’ అని తెలిపారు. ‘‘ఆశ(హోప్) అంటే సామరస్యం, అవకాశం, ప్రజాభాగస్వామ్యం, సమానత్వం అని’’ ఆయన అన్నారు. రాజ్యాంగం రూపకల్పనపై పార్లమెంటు గ్రంధాలయ భవనంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రదర్శనను మోదీ సందర్శించారు. ఆదర్శాలు, విలువలను పాటిద్దాం: ‘‘చరిత్రాత్మకమైన తొలి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మీకు స్ఫూర్తినివ్వాలి. భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వటం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహిళలు, పురుషులు అందరికీ ఈ దినోత్సవం ఒక నివాళి. మనమంతా రాజ్యాంగపు ఆదర్శాలు, విలువలను పాటిద్దాం.. దేశ నిర్మాతలు గర్వించే భారతదేశాన్ని తయారు చేద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన అపూర్వ కృషిని గుర్తు చేసుకోకుండా మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవటం అసంపూర్తిగానే ఉంటుంది. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా’’ అని మోదీ ట్విటర్లో వ్యాఖ్యానించారు. వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనుల్లంఘనీయం ‘‘రాజ్యాంగంలో పరిపాలనా ప్రణాళికకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే మూడు సూత్రాలు కేంద్రంగా ఉండే స్వేచ్ఛాయుత రాజకీయాలు భారతదేశానివి. * వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛ అనేవి ఉమ్మడి మేలు లాగానే అనుల్లంఘనీయం. * ప్రతి వ్యక్తికీ విశ్వాసం, మతం, ఆరాధన హక్కును రాజ్యాంగం హామీ ఇస్తోంది. * ప్రజాస్వామ్య పరిపాలనలో ఏకాభిప్రాయ నిర్మాణం అనేది చాలా కీలకమైన అంశం. అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనటానికి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పరస్పరం చర్చిస్తూ, కలిసి పనిచేయాల్సి ఉంటుంది. * రాజ్యాంగంలోని రాజ్య విధానానికి సంబంధించిన ఆదేశక సూత్రాలు.. న్యాయబద్ధమైన సామాజిక క్రమాన్ని నిలబెట్టి, కాపాడాలని చెప్తున్నాయి. * ప్రజాస్వామ్యానికి మౌలిక పునాదులుగా బలమైన సంస్థలను రాజ్యాంగం అందిస్తోంది. రాజ్యపు మూడు అంగాలు - శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు - సామరస్యంగా పనిచేయాలి. * కీర్తిప్రతిష్టలతో విశ్రమించే సమయం కాదిది. అభివృద్ధికి సంబంధించి మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఇన్నేళ్లలో బలమైన సంస్థాగత, ప్రభుత్వ నిర్మాణాలను మనం అభివృద్ధి చేసుకున్నాం. విద్య, అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళల భద్రత వంటి ఎంతో కీలకమైన రంగాల్లో మన లక్ష్యాలను సాధించుకోవటానికి మరింత కష్టపడి పనిచేయాల్సిన సమయమిది.’’ రాజ్యాంగ ఆదర్శాలపై దాడి జరుగుతోంది ‘‘రాజ్యాంగంలోని ఆదర్శాలు, నియమాలు ప్రమాదంలో పడ్డాయి. వాటిపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది. కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న ఉదంతాలు.. రాజ్యాంగ మూలసూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమైనవి. * ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ.. దానిని అమలు చేసే వారు చెడ్డవారు అయితే.. తుది ప్రభావం చెడ్డగానే ఉంటుంది’ అని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. * రాజ్యాంగంపై ఎన్నడూ విశ్వాసం లేని వారు, రాజ్యాంగ రచనలో పాలుపంచుకోని వారు.. ఇప్పుడు దానిపై ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు దానికి నిబద్ధతపై చర్చ జరుపుతున్నారు. ఇంతకు మించిన పెద్ద జోక్ ఇంకేదీ ఉండదు. * రాజ్యాంగం సరళమైనదని నిరూపితమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దానికి వందకు పైగా సవరణలు జరిగాయి. * అమెరికా, బ్రిటన్, జర్మనీల్లో రాజకీయ సిద్ధాంతం, ఆర్థికశాస్త్రాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగివచ్చి, షెడ్యూల్డు కులాలు, అణగారిన వర్గాల వారి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న అంబేడ్కర్ అసమాన ప్రతిభను, శక్తిసామర్థ్యాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. * ‘నన్ను చైర్మన్‌గా ఎంపిక చేయటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీలో నా కన్నా విద్యావంతులు, ఉత్తములైన వారు ఉన్నారు’ అని అంబేడ్కర్ అప్పుడు చెప్పారు. * 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించినప్పుడు.. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేడ్కర్ కన్నా ఉత్తమ సారథి మరొకరు ఉండబోరని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కితాబునిచ్చారు. * రాజ్యాంగం చరిత్ర చాలా పురాతనమైనది. 1931 మార్చిలో నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరాచీ సదస్సులో ప్రాధమిక హక్కులు, ఆర్థిక హక్కులపై తీర్మానం చేసింది.’’ సామ్యవాద, లౌకిక పదాలు లేకుండానే... న్యూఢిల్లీ: రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకల సందర్భంగా గురువారం ఆప్ ప్రభుత్వం ఇంగ్లిష్ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో సామ్యవాద, లౌకిక పదాలు ప్రచురితం కాలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొరపాటుకు ఆప్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై విచారణ నిర్వహించి, 4 రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా సమాచార, ప్రచార శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు. జరిగిన పొరపాటుకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విచారం వ్యక్తం చేశారు. ‘భారతీయ భాషలకు అధికార హోదా’ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు, తమిళం సహా భారతీయ భాషలన్నింటికీ అధికార భాష హోదా కల్పించాలని లోక్‌సభ ఉపసభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువా రం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషలను అధికార భాషలుగా గుర్తిస్తూరాజ్యాంగ సవరణ ఎందుకు తీసుకురారు? నేను తమిళంలో పార్లమెంటులో మాట్లాడాలంటే ముందు అనుమతి తీసుకోవాలి? మా సొంత భాషలో మాట్లాడుకునే హక్కు మాకుంది. అని అన్నారు. భారత ఆత్మకు ప్రతిబింబం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్... రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటోంది. నేడు ప్రపంచం భారత్ వైపు, భారత విలువలవైపు చూస్తోందంటే అందుకు మన రాజ్యాంగమే ప్రధాన కారణం. ఇప్పటి దాకా వందసార్లు సవరణలు జరిగినా.. ప్రాథమిక కూర్పునకు ఎక్కడా భంగం వాటిల్లకపోవటమే మన రాజ్యాంగం ప్రత్యేకత. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం కూర్పు, రాజ్యాంగంలోని ముఖ్యాంశాలను గమనిస్తే.. * 1930ల నుంచే సొంత రాజ్యాంగం కోసం కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది. * ఎన్నో తర్జన భర్జనలు, గొడవల తర్వాత 1946లో వైస్రాయ్ లార్డ్ వావెల్ ఇందుకు అంగీకరించారు. * రాజ్యాంగ రచనకు 1946 నుంచి 1949 మధ్య రెండు సంవత్సరాల 11నెలల 18 రోజుల సమయం పట్టింది. * రాజ్యాంగ పరిషత్తులో ప్రతీ వర్గానికి ప్రాతినిధ్యం లభించింది. 9 మంది మహిళలు ఇందులో ఉన్నారు. 24 మంది అమెరికన్లు కూడా రాజ్యాంగ చర్చలో ఏడ్రోజుల పాటు పాల్గొన్నారు. * రాజ్యాంగ రచన సమయంలోనే దేశంలో మతఘర్షణలు, కులపోరాటాలు చోటుచేసుకున్నాయి. * దీంతో ప్రాథమిక విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతత్వాలను రాజ్యాంగంలో చేర్చారు. * రాజ్యాంగ నిజప్రతిని ప్రఖ్యాత లేఖకుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ చేత్తో రాశా రు. ఇందుకు ఆయనకు ఆరు నెలలు పట్టింది. ఇందుకు ఒక్క పైసా తీసుకోలేదు. * వివిధ భాషల్లో రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగినా.. రాజ్యాంగాన్ని మాత్రం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాశారు. * ఇప్పటికీ రాజ్యాంగం నిజప్రతులు పార్లమెంటు లైబ్రరీలోని హీలియం చాంబర్స్‌లో భద్రంగా ఉన్నాయి. * ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, రష్యా నుంచి ప్రాథమిక విధులు, పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు విధులు, కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వ సమాఖ్య, యూకే నుంచి ప్రధాన మంత్రి, కేబినెట్, పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని తీసుకున్నారు. * 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ సభ ఆమోదించింది. * 1950, జనవరి 26 రాజ్యాంగ అమలు ప్రారంభం కావటంతో.. గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించింది. * 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. * దీనికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు రాజ్యాంగ పరిషత్ 166సార్లు సమావేశమైంది. * ఇందులో 144 రోజులు రాజ్యాంగ ముసాయిదాపైనే చర్చ జరిగింది. * చర్చ సందర్భంగా ప్రతిపాదించిన 7,635 సవరణల్లో 2,473 సవరణలను తిరస్కరించారు. * ప్రపంచంలోనే అతిపెద్దదైన మన రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 అధికరణలు, 5 అనుబంధాలున్నాయి. -
రెచ్చిపోయిన ఉన్మాదం
పేరేదైనా పెట్టుకోవచ్చుగానీ ఉన్మాదానికి ప్రాంతీయ, మత, జాతి భేదాలుండవు. పాలకులు చేతగానివాళ్లయినప్పుడో...సమాజం ఒక్కటిగా నిలిచి పోరాడలేనప్పుడో అది విజృంభిస్తుంది. వీరంగం వేస్తుంది. అలాంటపుడు వ్యక్తులుగా కొందరు బలైపోవడమే కాదు...అంతకన్నా ముఖ్యమైన విలువలు ప్రమాదంలో పడతాయి. సకాలంలో మేల్కొనకుంటే అవి కనుమరుగవుతాయి కూడా. మూఢ విశ్వాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారని పేరున్న ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివ ర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్బుర్గిని ఉన్మాదులిద్దరు ఆదివారం ఉదయం ఆయన ఇంటికొచ్చి కాల్చిచంపిన తీరు ఈ కోణంలో దిగ్భ్రాంతికరమైనది. మూఢ విశ్వాసాలపై పోరాడి ఇటీవలికాలంలో నేలకొరిగిన వ్యక్తుల్లో కల్బుర్గి మూడోవారు. మహారాష్ట్రలో రెండేళ్లక్రితం డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌నూ, ఈ ఏడాది మొదట్లో గోవింద్ పన్సారేనూ దుండగులు ఈ తరహాలోనే పొట్టనబెట్టుకున్నారు. దభోల్కర్ హేతువాద ఉద్యమకారుడు. గోవింద్ పన్సారే సీపీఐ నాయకుడు. కల్బుర్గికి ఏ హేతువాద సంస్థలోనూ సభ్యత్వం లేకపోయినా మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. అనేక సభల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురూ వయసు మీదపడినా సామాజిక న్యాయం కోసం, సెక్యులర్ విలువల కోసం తమ తమ పరిధుల్లో, పరిమితుల్లో పోరాడినవారు. డాక్టర్ దభోల్కర్‌ను కాల్చిచంపిన రోజున ఆనాటి కాంగ్రెస్-ఎన్సీపీ సర్కారు బాధ్యులను పట్టి బంధిస్తామని చెప్పింది. ఆయన ఆకాంక్షించిన మూఢ నమ్మకాల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ దుండగుల జాడ కనిపెట్టలేకపోయింది. అదే ఉన్మాదులకు బలమిచ్చింది. వారు సీపీఐ నేత పన్సారేను కాల్చిచంపడానికి తెగించారు. ఆ కేసులోనూ ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఇప్పుడు కర్ణాటకలో కల్బుర్గి నేలకొరిగారు. కన్నడ నేల సామాన్యమైనది కాదు. సామాజిక దురన్యాయాలపైనా, మూఢ విశ్వాసాలు, సంప్రదాయాలపైనా 12వ శతాబ్దిలోనే పోరాడిన బసవన్నను కన్న గడ్డ అది. ఆ పరంపరను కొనసాగిస్తూ రచనలు చేసిన సాహితీ దిగ్గజాలకు అక్కడ కొదవలేదు. ఆ విలువలను పుణికిపుచ్చుకుని తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పుతున్న కల్బుర్గి దుండగులకు లక్ష్యంగా మారారంటే ఆశ్చర్యం కలుగుతుంది. కన్నడ సాహిత్యంలో... ముఖ్యంగా బసవన్న సాహిత్యంపైనా, తాత్వి కతపైనా కల్బుర్గి లోతైన పరిశోధనలు చేశారు. కన్నడ జానపదం, మతం, సంస్కృతి తదితర అంశాల్లో ఆయన ప్రామాణికమైన రచనలు అందించారు. ఆయన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, కన్నడ సాహిత్య అకాడమీ అవార్డుల తో సహా ఎన్నో పురస్కారాలు లభించాయి. బసవన్న అనుచరులమంటున్నవారు ఆయన పాటించిన విలువలనూ, ఆచరణనూ సరిగా అర్థం చేసుకోకుండా మత సంప్రదాయాల్లో కూరుకుపోతున్నారని కల్బుర్గి రాయడం గతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహారాధన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై లోగడ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ వంటి సంస్థలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. కేసులు పెట్టాయి. ఏదైనా రచనో, ఉపన్యాసమో తమకు నచ్చని భావాలతో ఉన్నప్పుడు ఆ భావాలను సవాల్ చేయడం...అవి తప్పని నిరూపించడం నాగరిక సమాజంలో ఎవరైనా చేయాల్సిన పని. అందువల్ల సమాజానికి మేలు జరుగుతుంది తప్ప కీడేమీ కలగదు. పురాతన కాలంనుంచీ మన దేశంలో ఆ సంప్రదాయం ఉంది. వేదాలను ప్రమాణంగా ఎంచే ఆస్తిక దర్శనంతోపాటే...అందులోని అనుమాన ప్రమాణం, ఆప్త ప్రమాణం, ఆగమ ప్రమాణం వంటివాటిని తిరస్కరించి ఉన్నదొక్కటే- అది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమేనని కుండబద్దలుకొట్టిన చార్వా కుల తాత్వికతను కూడా ఆదరించిన నేల ఇది. ఇలాంటిచోట తమకు నచ్చని భావాలను వ్యక్తం చేశారని కక్షబూనడం, బెదిరింపులకు, భౌతిక దాడులకు దిగడం ఉన్మాదం అనిపించుకుంటుంది. ఆ బాపతు వ్యక్తులవల్ల వారు నమ్ముతు న్నామంటున్న విశ్వాసాలను కూడా అనుమానించే పరిస్థితులు ఏర్పడతాయి. కర్ణాటకలోనే సంస్కృతీ పరిరక్ష కులమంటూ శ్రీరాంసేన పేరిట కొందరు ఆమధ్య పబ్‌ల వద్దా, పార్క్‌ల వద్దా యువ జంటలను చితకబాదడం వంటి చేష్టలకు పాల్పడినప్పుడు జనంలో ఎంత ఏవగింపు కలిగిందో అందరూ చూశారు. దుండగుల తుపాకి గుళ్లకు బలైన ముగ్గురూ సమాజంలో మూఢనమ్మకాలకు ఎవరూ బలికావొద్దని దృఢంగా కోరుకున్నారు. మూఢ విశ్వాసాలను ప్రేరేపించే వారినీ, చేతబడులవంటి ప్రక్రియలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నవారిని శిక్షించే చట్టం తీసుకురావాలని ఉద్యమించారు. డాక్టర్ దభోల్కర్ మరణానంతరం మహారాష్ట్ర తీసుకొచ్చిన చట్టంవంటిది కర్ణాటకలో కూడా అమలు చేయాలని కల్బుర్గి గట్టిగా వాదించారు. అనేక సభల్లో ప్రసంగించారు. ఇవే ఆయనకు కొందరిని శత్రువులుగా మార్చాయి. మన పొరుగునున్న బంగ్లాదేశ్‌లో సెక్యులరిజాన్ని, హేతువాద భావాలనూ ప్రచారం చేస్తున్న నలుగురు యువకులను ఉన్మాదులు కొందరు ఈమధ్య కాలంలో కాల్చిచంపారు. వీరిలో కొందరు హత్యకు ముందు తమకు బెదిరింపులు వస్తున్న సంగతిని పోలీసులకు చెబితే దేశం విడిచివెళ్లిపొమ్మని సలహా ఇచ్చి వారు చేతులు దులుపుకున్నారు. బంగ్లాదేశ్ మన దేశంతో పోలిస్తే చిన్నది. మన పోలీసు వ్యవస్థకుండే వనరులుగానీ, నైపుణ్యంగానీ, సమర్థతగానీ వారికి అందుబాటులో ఉండకపోవచ్చునని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటి ఉన్మత్త ధోరణులే ఇక్కడా వ్యాపిస్తున్నాయి. మన పోలీసులు కూడా నిస్సహాయులుగా మిగులుతు న్నారు. అక్కడిలా ‘మీ చావు మీరు చావండ’ని మన పోలీసులు చెప్పి ఉండక పోవచ్చుగానీ డాక్టర్ దభోల్కర్, పన్సారే హత్య కేసుల్లో చురుగ్గా దర్యాప్తు సాగుతున్న దాఖలాలైతే లేవు. తమిళనాట పెరియార్ రామస్వామి నాయకర్, మన తెలుగునాట త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు దశాబ్దాలక్రితమే తమ రచనలతో, ఆచరణతో సామాజిక విప్లవానికి బాటలు వేశారు. కానీ అలాంటి అరుదైన వ్యక్తులకు ఇప్పుడు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని కఠినంగా వ్యవహరించాలి. దుండగులను శిక్షించే దిశగా చర్యలు తీసుకోవాలి.