దాడి ఒకలాగుండదు... ఒక రూపంలో ఉండదు... దాడికి పలు రూపాలు, పలు అవతారాలు! ఏ విశ్వాసాలను నమ్మకాలనైనా అడ్డుపెట్టుకుని అమాంతం దాడి చేయవచ్చు. దాడి చేయటమన్నది పథకం ప్రకారం ఆట మధ్యలో అవాంతరాలు సృష్టించి అడ్డంగా గెలవటం లాంటిది కదా! అధికారం కోసం కల్లోలాలు సృష్టించటం, అంతర్యుద్ధాలు సృష్టించటం, సమాజాన్నే రెండు ముక్కలు చేయటం, రెండు మతాల మధ్య మంట రాజేయటం, కులాల మద్య రాజకీయ కుంపట్లు పెట్టటం, పార్టీలను చీల్చటం... ఎన్ని పన్నాగాలో!
ఇలాంటి వారికి కొనుగోలు శక్తి తక్కువేం కాదు... దేశాన్ని ఎన్ని రకాలుగా ప్రైవేటైజేషన్ చేయాలో అన్నీ రకాలుగా చేసేశారు. నానా అగచాట్లు పెడతారు. అరగోసలు, అర్వతిప్పలు!
ఇపుడు నా దేశ ప్రజాస్వామ్యమనే సౌధం రకరకాల అధికార దాహాలతో చేసే విచ్చలవిడి దాడులతో నెర్రలు బాస్తోంది... లౌకికత్వం తనను తాను రక్షించుకోలేక... భిన్న సంస్కృతుల, భిన్న జాతుల ఐక్యతను కాపాడలేక దురాక్రమణల దాడులకు నిలువలేక తల్లడిల్లుతుంది. జాతి సంస్కృతే చిన్నాభిన్నమౌతూ ఛిద్రమైపోతుంది. ఏమి దౌష్ట్యం? ఏమి దుర్నీతి? ఏమైపోతున్నాం... ఎటుపోతున్నాం. మన దేశ దశ దిశల లక్ష్యం ఏ వైపునకు పయనిస్తుందో కదా!
రాష్ట్రాలపై కేంద్రం దాడులు మాములైపోయాయి. రాష్ట్రాలను అస్థిరపరచటం మామూలు క్రీడైపోయింది. ఒక ప్రభుత్వం ఒక్క పూటలో కూలిపోయి ఎప్పుడది వన్‌డే క్రికెట్ మ్యాచ్ అవుతుందో తెలియదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవటం, వాళ్ల చేతులతో వాళ్లే కూల్చుకునేలా చేయటం షరా మామూలైన స్థితికి ప్రజలస్వామ్యం రావటం చెప్పలేని బాధ. ప్రశ్నలను జోకొట్టవచ్చనే భ్రమలు బాగా పెరిగాయి. ప్రశ్నిస్తే ప్రశ్న నోటిని మూసేసి ప్రశ్నలను కిడ్నాప్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రశ్నలనే బెదిరిస్తూ ప్రశ్నను ప్రశ్నించకుండా ప్రశ్నల గొంతులపై సీబీఐలను పెడ్తుండ్రు. ప్రశ్నల తలలు లేవకుండా పార్టీల అంతర్గత కలహాలు రాజేస్తుండ్రు. ప్రశ్నలు పురి విప్పకుండా ప్రశ్నల గాలులను ఆపాలని చూస్తుండ్రు. ప్రశ్నించకుండా అధికార ముద్రలతో దాడులన్నీ చేస్తుండ్రు. దుర్నీతి రాజకీయాలు చేస్తున్నవాళ్లే చీకటి రోజుల గురించి మాట్లాడుతుండటమే విచిత్ర చిత్రం.
ఎందుకో ఈ తెలంగాణ మట్టి ఆధిపత్యాలను ససేమిరా ఒప్పుకోలేదు. మత ఆధిపత్యాన్ని అస్సలు సహించదు. తెలంగాణ పరమత సహన లౌకికతత్వం కోరుకునే మానవీయ మహాతల్లి. తెలంగాణ అందరికోసం తపన పడే బోళాతనమున్న మహాతల్లి. ఇది సృజనాత్మకమైన నేల. సబ్బండ వర్ణాల మహా సంస్కృతిని తనువంతా నిండిన తెలంగాణ నేల ఇది. ఇదొక మానవీయ మహా సమాజం. మానవీయత మత సామరస్యం తెలంగాణ తల్లివేరు. దీన్ని పెకలించటం ఎవరితరం కాదు. మనం ఉరుముల్లా ఉరిమినోళ్లం. జన జాతర్ల మెరుపులుగా మెరిసిన వాళ్లం. పిడుగుల్లా కురిసినోళ్లం. జన జలప్రళయాలుగా పొంగి పొరలినోళ్లం. ఆవేశ ఆగ్రహాలకు ఆది అంతాలుగా నిలిచిన సింహగర్జనలం. (క్లిక్: లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలి!)
ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి లక్ష్యాన్ని చేరుకున్న విజయ చిహ్నాలం కదా... ఇపుడు కమ్ముకొస్తున్న కుల, మత కారు మేఘాలను చెల్లాచెదురు చేయగల శక్తులం మనమే. ఎంతపోరు చేసి ఎన్నెన్ని త్యాగాలు చేసి తెలంగాణను నిలబెట్టుకున్నమో... గెలిచిన తెలంగాణను మత గత్తరల నుంచి, కుల కలరాల నుంచి కాపాడుకోలేమా. మనకు కొత్తగా చెప్పాల్సిన పన్లేదు. చేసిన యుద్ధం పదును ఏ మాత్రం తగ్గనోళ్లం... మనమే గెలుస్తాం. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?)
- జూలూరు గౌరీశంకర్
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి
Comments
Please login to add a commentAdd a comment