Anti Defection Law: మేడిపండు ప్రజాస్వామ్యం | Bollimunta Sambasiva Rao Write on Anti Defection Law in Democracy | Sakshi
Sakshi News home page

Anti Defection Law: మేడిపండు ప్రజాస్వామ్యం

Published Thu, Nov 3 2022 12:26 PM | Last Updated on Thu, Nov 3 2022 12:26 PM

Bollimunta Sambasiva Rao Write on Anti Defection Law in Democracy - Sakshi

భారత రాజ్యాంగంలో పేర్కొన్న పార్లమెంట్, శాసన సభల వ్యవస్థలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వంటివి చెప్పే ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిదని కొన్ని సంవత్సరాలుగా రుజువవు తూనే ఉంది. నేడు తెలంగాణలో ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆ కంపును మరింత వ్యాపింప చేసింది. 

భారత రాజ్యాంగంలో ఒక పార్టీ తరఫున చట్ట సభలకు ఎన్నికై మరొక పార్టీలోకి వెళితే అతని సభ్యత్వం రద్దు అవుతుందని  మొదట్లో పేర్కొన లేదు. అందువల్ల కొందరు పార్టీలు మారి కొన్ని ప్రభుత్వాల పతనానికి కారకులయ్యారు. 1952–67 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. 1967లో లోక్‌సభతో పాటు 16 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగగా... ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మెజారిటీ కోల్పోయింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, తర్వాత పార్టీ ఫిరాయింపులు చేయించి మెజారిటీ పొందింది. 1967–71 మధ్య పార్లమెంట్, శాసనసభకు ఎన్నికైన నాలుగు వేల మంది సభ్యుల్లో 2 వేల మంది పార్టీ ఫిరాయింపులు చేశారు.

ఫిరాయింపుల పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 1979లో తొలిసారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. 1985లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్‌ లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం ఒక పార్టీ తరఫున టికెట్టు పొంది ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడూ, పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌కు హాజరు కానప్పుడూ, విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడూ, స్వతంత్ర సభ్యులుగా ఎన్నికైన సభ్యులు ఏదైనా పార్టీలో చేరినప్పుడూ; నామినేట్‌ అయిన పార్లమెంట్, శాసనసభ సభ్యులు 6 నెలల్లోపు ఏదైనా  పార్టీలో చేరినప్పుడూ సభ్యత్వాలు రద్దు అవుతాయి. 

ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసన సభ్యుల్లో 2/3 వంతుల మంది వేరే పార్టీలో చేరినప్పుడు, లేదా స్వతంత్రంగా పార్టీ పెట్టిన ప్పుడు వారి సభ్యత్వాలు రద్దు కావు. చట్టంలో ఉన్న కంతలు ఉపయోగించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తన వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్నాయి. 2016లో అరుణా చల్‌ప్రదేశ్‌లో 45 కాంగ్రెస్‌ సభ్యుల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రితో సహా 44 మంది సభ్యులు ‘పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌’లో విలీనమయ్యారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇలాగే జరిగింది. తెలంగాణలోనూ 2/3 మంది కాంగ్రెస్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సభ్యుల చేత రాజీనామా చేయించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టించి, తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 23 మంది వైసీపీ శాసనసభ్యులు రాజీనామాలు చేయకుండానే చంద్రబాబు పార్టీలో చేరి కొందరు మంత్రులయ్యారు. కర్ణాటకలో కొందరు కాంగ్రెస్‌ శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. 

చట్ట సభల స్పీకర్లు  రాజకీయ పార్టీలు కోరినా... గీత దాటిన సభ్యులపై అనర్హత వేటు వేయడంలో పక్షపాతం చూపిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి ఎడల అనర్హత వేటు వేయకుండా పదవీ కాలం ముగిసేవరకు సభ్యునిగా కొనసాగే వైఖరిని తీసుకుని... వ్యతిరేకంగా ఉన్న సభ్యునిపై వెంటనే అనర్హత వేటు వేస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య తాజాగా టీఆర్‌ఎస్‌ శాసనసభ సభ్యుల కొనుగోలు వ్యవహారంలో వివాదం సాగుతోంది. పరస్పర ఆరోపణలు జగుస్సాకరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బాగా పరిఢవిల్లుతోందో అర్థమవుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలు ఉద్యమించాలి. (క్లిక్ చేయండి: కళ్లముందున్న వివక్ష కనబడదా?)


- బొల్లిముంత సాంబశివరావు 
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రైతు కూలీ సంఘం (ఏపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement