వారంతా చట్టాన్ని కాపాడే విధుల్లో సత్తా చాటారు.. కానీ చట్టాలు చేసే పదవిని మాత్రం ఆశించిన స్థాయిలో పొందలేకపోయారు! ప్రజలను రక్షించే బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన వారు ‘పొలిటికల్ సైన్స్’లో మాత్రం ఫెయిలయ్యారు!! ప్రత్యక్ష లేదా పరోక్ష రాజకీయాల్లో తమ మార్కును చాటలేకపోయారు... ఖాకీ నుంచి ఖద్దరు వైపు మళ్లిన కొందరు పోలీసుల ప్రస్థానం ఇది.
ఉమ్మడి ఏపీ మొదలు తెలంగాణలో పోలీసు యూని ఫాం వదిలి ఖద్దరు తొడిగిన మాజీ అధికారుల్లో విజయం సాధించిన వారి సంఖ్య అతితక్కువే. ముగ్గురు మాత్రమే మంత్రి పదవులు అలంకరించగలిగారు. మిగిలిన వారిలో కొందరు పార్టీ పదవుల్లో పనిచేసినా, చేస్తున్నా వారివి తెరవెనుక పాత్రలే అయ్యాయి.
ఏమాత్రం ప్రభావం చూపలేక...
కొందరు మాజీ పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చినా ఏ మాత్రం తమ ఉనికి చాటలేకపోయారు. కనీసం ఎన్నికల్లో పోటీ, గెలపోటములు, పెద్దల సభలు, నామినేటెడ్ పదవులు సహా ఏ ఒక్కటీ తమ ఖాతాల్లో వేసుకోలేకపోయారు. క్లిష్ట సమయంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేసి ఘర్షణల్ని అదుపు చేయమంలో తనకు తానే సాటి అని పేరొందిన ఐపీఎస్ అధికారి ఎంవీ భాస్కర్‌రావు. ఆపై రాష్ట్ర డీజీపీగానూ పని చేశారు.
ఈయన రాజకీయంగా మిగిలిన వారి కంటే మరో అడుగు ముందుకు వేశారు. పదవీ విరమణ పొందిన అనంతరం ఈయనే సొంతంగా ఆంధ్రనాడు పేరుతో పార్టీ స్థాపించారు. విజయవాడ సీపీగా, వరంగల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ రిటైరయ్యాక ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
మహబూబాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ తరఫున గతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేసిన దొమ్మాట సాంబయ్య ఇన్‌స్పెక్టర్‌గా కరీంనగర్ జిల్లాలో పని చేస్తూ వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
రీఎంట్రీ ఇచ్చింది ఒక్కరే...
ఖాకీ వదిలి ఖద్దరు తొడిగాక తిరిగి ‘వెనక్కు’ రావడం దాదాపు అసాధ్యం. అయితే హైదరాబాద్‌లోని చిలకలగూడ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన హనుమంతరావు పీఆర్పీ ఆవిర్భావంతోనే వీఆర్‌ఎస్ తీసుకొని ఆ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆపై మళ్లీ పోలీసు ఉద్యోగంలో చేరారు. అదనపు ఎస్పీ వరకు పదోన్నతులు కూడా పొందారు.
♦ సీనియర్ ఐపీఎస్ రావులపాటి సీతారామరావు రిటైరయ్యాక టీడీపీలో, రిటైర్డ్ డీఐజీ స్థాయి అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ డీజీ స్థాయి అధికారి ఎస్‌కే జయచంద్రం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
♦ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో వివాదాస్పద పరిస్థితుల్లో తన డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళిని తొలుత టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆపై బీజేపీలో చేరారు.
♦ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, కాగజ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
మంత్రులుగా ముగ్గురే...
♦ ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పనిచేసిన 1954 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్య నాయుడు 1991లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పటి పీవీ నరసింహారావు కేబినెట్‌లో 1996 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆపై ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు.
♦ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేసిన కె.విజయరామారావు, ఆపై సీబీఐ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. రిటైరయ్యాక టీడీపీలో చేరి 1999లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో వాణిజ్య పన్నులు, రోడ్లు భవనాల శాఖల్ని పర్యవేక్షించారు. 2004 ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలే కన్నుమూశారు.
♦ వరంగల్ జిల్లా మదనపల్లెలో పుట్టిన పి.బలరామ్‌నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన నాయక్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా గెలిచి యూపీఏ–2లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
అలా మెరిసి.. ఇలా తెరమరుగై...
హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి డీజీపీ వరకు అనేక కీలక పోస్టుల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారి వి.దినే‹Ùరెడ్డి పదవీవిరమణ అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విధానా లకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 సాధారణ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆపై బీజేపీ చేరినా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. డీజీపీ ర్యాంక్‌లో ఉండి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన తొలి ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు ఆపై ఉమ్మడి ఏపీ డీజీపీగానూ వ్యవహరించారు. రిటైర్మెంట్ అనంతరం తొలుత టీడీపీలో చేరిన ఆయన ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో చేరారు. అయినప్పటికీ పొలిటికల్‌గా తన మార్కు చూపించుకోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment