తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా? లేక ఆయన పని మానుకుని పొరుగు రాష్ట్రం ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తారా?రేవంత్ ఏమి చేస్తారో కాని, టీడీపీ కార్యకర్తలు కొందరు చేసిన హడావుడి చూస్తుంటే రేవంత్ ఇంకా టీడీపీలోనే ఉన్నారనుకుంటున్నారేమో అన్న సందేహం వస్తుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ జెండాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ పంచలో కనిపించిన తీరు ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తుంది. కాంగ్రెస్‌కు అధికారికంగా మద్దతు ఇవ్వనప్పటికీ కొందరు టీడీపీ కార్యకర్తలు,నేతలు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్న సభలలో టీడీపీ జెండాలు పట్టుకుని తిరిగారు.
✍️తాము అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ వారు సంబరాలు చేసుకుంటుంటే వారికన్నా ఎక్కువగా టీడీపీ జెండాలతో వీరు హడావుడి చేయడం.. ఇదంతా చూసేవారికి విడ్డూరం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అనుసరించే రెండు కళ్లు, మూడు కళ్ల సిద్దాంతానికి అనుగుణంగానే ఇది ఉంది. తమకు సంబంధం లేకుండానే జరిగిందని టీడీపీ నేతలు చెబితే చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ పార్టీ వెంట టీడీపీ కార్యకర్తలు తిరుగుతుంటే పార్టీ అధిష్టానం ఖండించాలి కదా!లేదా తమ మద్దతు కాంగ్రెస్ కు ఇవ్వడం లేదని, లేదా ఇచ్చామని తెలియచేయాలి కదా! అలాంటివి ఏమీ చేయకుండా రహస్య మద్దతు ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి?టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకే ఎన్నికల బరినుంచి టీడీపీ వైదొలగాలని చంద్రబాబు చెప్పారని ప్రకటించారు.
✍️దానిని ఇంతవరకు చంద్రబాబు కాని, ఆయన తరపున మరెవరూ కాని కాదనలేదు. కాసాని తర్వాత ఇంకొకరిని పార్టీ అధ్యక్షుడుగా పెట్టలేదు. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు కనీస మద్దతు ఇవ్వలేదు.ఇదంతా కాంగ్రెస్ కోసమే చేశామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన రేవంత్‌రెడ్డికి ఉపయోగపడేందుకే ఇలా వ్యవహరించామని ఆ వర్గాలు బాహాటంగానే వెల్లడిస్తున్నాయి. కాకపోతే అధికారికంగా పేర్కొనడం లేదు. ఇదంతా దేని గురించి. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమకు ఏపీలో ఉపయోగపడతారన్నది వారి భావన. ఏపీలో వీరు నేరాభియోగాలకు గురై తెలంగాణలో ఉంటే అరెస్టు కాకుండా రేవంత్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నది వీరి నమ్మకం కావచ్చు.
✍️ఏపీలో ఎన్నికలు వస్తే టీడీపీకి రేవంత్‌కు ఆర్ధిక సాయం చేస్తారన్నది వీరి ఆశ. రేవంత్ రెడ్డి టీడీపీలో సుమారు తొమ్మిది,పదేళ్లు ఉన్న మాట నిజమే. టీడీపీ మహానాడులో ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి వాస్తవమే. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు,రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. సోనియాగాంధీని బలిదేవత అని ఉండవచ్చు. అయినా తన చాకచక్యంతో కాంగ్రెస్ లో చేరి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అంటున్నారు. రాహుల్ గాంధీ గొప్ప నేత అని చెబుతున్నారు. సోనియాగాంధీ తెలంగాణ అమ్మ అని అంటున్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు గొప్పవని ప్రబోధిస్తున్నారు. అంతే తప్ప తెలుగుదేశం సిద్దాంతాన్ని అమలు చేస్తానని అనడం లేదు. చంద్రబాబుకు విధేయుడుగా ఉంటానని ప్రకటించడం లేదు.
✍️తెలంగాణలో తన ప్రబుత్వ ఎజెండాను వదలి ఏపీలో టీడీపీ కోసం ,చంద్రబాబు కోసం పనిచేస్తానని చెప్పడం లేదు. అయినా టీడీపీ నేతలు ఏపీలో తమ రాజకీయ ప్రయోజనం కోసం రేవంత్ ఉపయోగపడతాడని విశ్వసిస్తున్నారు. తమవల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నంత సీన్ చేస్తున్నారు. నిజానికి వారి వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదంటే అదంతా టీడీపీ వారు చేసిన నిర్వాకం వల్లే. రేవంత్ ప్రాతినిద్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. రేవంత్ ను ఉపయోగించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలన్నది టీడీపీ దురాశ. టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రేవంత్ ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వం నడపవచ్చని భావిస్తున్నాయని చెబుతున్నారు.
✍️నిజమే! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, రేవంత్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండవచ్చు.అంతమాత్రాన వారు చెప్పినట్లే ఈయన పని చేయడం మొదలైతే అనతికాలంలోనే తన ప్రభుత్వాన్ని తానే అప్రతిష్టపాలు చేసుకుంటారని గమనించాలి. కేసీఆర్ ప్రభుత్వంపై ఈగ వాలకుండా ఈనాడు వంటి మీడియా కృషి చేసినా, జనంలో వ్యతిరేకతను ఆపలేకపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రక్షించలేకపోయారు. దీనిని రేవంత్ అర్ధం చేసుకోకపోతే ఆయనకే ప్రమాదం. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చంద్రబాబు తరపున ఏభై లక్షల డబ్బు తీసుకువెళ్లి నామినేటెడ్ ఎమ్మెల్యే కి ఇస్తూ ఎసిబికి పట్టుబడిన ఘటనను ఆయన గుర్తుంచుకోవాలి. దానివల్ల ఆయన రాజకీయ జీవితంలో ఎంత పరాభవం పాలయ్యాడో మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాల కోసం అనవసరంగా టీడీపీ ట్రాప్ లో పడితే ఆయనకే నష్టం.
✍️తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ మానిఫెస్టోని అమలు చేయడమే పెద్ద సవాల్. దానిపైనే ఆయన దృష్టి పెట్టుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ఏడాదికి సుమారు లక్షనుంచి లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అంచనా. వచ్చే పార్లమెంటు ఎన్నికల లోపు వాటిని అమలు చేయలేకపోతే కాంగ్రెస్ బదనాం అయిపోతుంది. దానిని ఎలా సాధించాలన్నది రేవంత్ ఆలోచించాలి. అలా కాకుండా ఏపీ టీడీపీ వారు కోరుకుంటున్నట్లు వ్యవహరించారో ఇక అంతే సంగతి. తెలుగుదేశం పార్టీ వారు తన పేరు తరచు వాడుకోకుండా చూడకపోతే కూడా ఆయనకు చికాకులు వస్తుంటాయి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఎలాంటి కుట్రలు చేస్తుంటారో రేవంత్ కు తెలియనివి కావు. తెలంగాణలో గత సారి కాంగ్రెస్ తో నేరుగా పొత్తు పెట్టుకుని ఓటమి తర్వాత 2019 ఎన్నికలలో దానిని ఏపీలో గాలికి వదలివేశారు.
✍️2023 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు చంద్రబాబు పరోక్ష మద్దతు ఇచ్చినా, 2024 ఎన్నికలలో ఏపీలో బీజేపీ స్నేహం కోసం అర్రులు చాస్తున్నారు.అలాగే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనతో టీడీపీ కొనసాగిస్తున్న అక్రమ సంబంధం గురించి రేవంత్ కు తెలియకుండా ఉంటుందా?ఏపీలో శాసనసభ ఎన్నికలు జరిగే సమయంలోనే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. అంటే తెలంగాణలో కూడా ఎన్నికల హడావుడి ఉంటుంది. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోలేకపోతే దాని ప్రభావం ఆయనపై ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తో నేరుగా టీడీపీ పొత్తు పెట్టుకుని పనిచేస్తే వేరే విషయం. దానిని ఎవరూ కాదనరు.
✍️రేవంత్ రెడ్డి కూడా పార్టీపరంగా బహిరంగంగానే సాయపడవచ్చు. అందుకు చంద్రబాబు సిద్దపడతారా?ఆయన ఒకవైపు బీజేపీతో, మరోవైపు కాంగ్రెస్ తో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ రాజకీయాలలో రేవంత్ ఇరుక్కుంటే కాంగ్రెస్‌లో ఆయన వ్యతిరేక వర్గీయులు దానిని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎలా వ్యవహరించినా ఎవరూ మరీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ముఖ్యమంత్రి అయ్యాక సరైన ధోరణిలో వెళ్లకుండా టీడీపీ భావజాలాన్ని మర్చిపోకుండా ఉంటే మాత్రం ఆయన రాజకీయ మనుగడనే దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందువల్ల రేవంత్ తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ ప్రయోజనాల కోసం పనిచేస్తారో, లేక పొరుగు రాష్ట్రంలో టీడీపీ కోసం, కొందరు పత్రికాధిపతుల కోసం పనిచేస్తారో తేల్చుకోవాలని చెప్పకతప్పదు.
కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment