
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది.
మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది.
గత విచారణలో
గత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్‌ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.
ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment