వీసీల నియామకాల్లో ప్రమాణాలు పాటించాలి.. | Standards Should Be Followed In The Appointment Of VCs Guest Column News | Sakshi
Sakshi News home page

వీసీల నియామకాల్లో ప్రమాణాలు పాటించాలి..

Published Tue, Jun 18 2024 12:00 PM | Last Updated on Tue, Jun 18 2024 12:00 PM

Standards Should Be Followed In The Appointment Of VCs Guest Column News

విశ్వవిద్యాలయాలు సమాజాన్ని నడిపించే మేధావులను తయారుచేసే కేంద్రాల వంటివి. చరిత్రను మలుపు తిప్పే ఉద్యమ కేంద్రాలుగానూ అనేకసార్లు నిరూపించుకున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ చరిత్రలో యూనివర్సిటీలు నిర్వహించిన పాత్ర అమోఘం. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీలు మలి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది.

తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. అయితే ఇదంతా సాకారం చేయటానికి తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన విశ్వ విద్యాలయాల పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారుతోంది.

2014లో స్వరాష్ట్రం వచ్చిన నాటి నుండి గడిచిన పదేండ్లలో విశ్వ విద్యాలయాలపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. యూనివర్సిటీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న విధంగా ఉంది. మౌలిక సదుపాయాలు కొత్తగా కల్పించినవి ఏమీ లేదు. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాలు లేక యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. అటెండర్‌ పోస్ట్‌ మొదలుకొని అధ్యాపక పోస్టు వరకూ ఎన్నో పోస్టులు ఖాళీ అయ్యాయి. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు చాలా యూనివర్సిటీలకు పెద్ద దిక్కు అయిన వైస్‌ ఛాన్స్‌లర్లు (వీసీలు) లేరు. ఇన్‌చార్జీలతోనే కాలం గడుపుతూ వచ్చింది గత ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ‘మార్పు కావాలి –కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అనుముల రేవంత్‌ రెడ్డి సర్కారు సైతం విశ్వవిద్యాలయాలను గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోంది. వీసీల నియామకాలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెబుతున్నా అది సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఒకరిద్దరు వీసీ పదవితో పాటూ మరో ఉన్నత పదవినీ నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.

విద్యారంగంలో నిష్ణాతులుగా ఉండి, ప్రొఫెసర్‌గా పదేళ్ళ అనుభవం ఉండి, మంచి పాలనా దక్షుడై ఉన్నవారే వీసీ పదవికి అర్హులు. కానీ ఈ ప్రమాణాలతో సంబంధం లేకుండా మంత్రులూ, కాంట్రాక్టర్లూ తమకు అత్యంత సన్నిహితులూ, క్లాస్‌మేట్లూ అయినవారిని కొన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులుగా నియమించాలని పావులు కదుపుతున్నట్లు యూనివర్సిటీ క్యాంపసుల్లో చర్చలు నడుస్తున్నాయి. వీసీల నియామకంలో మంత్రులు తమ తమ సామాజిక వర్గాలవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

దీన్నిబట్టి విశ్వ విద్యాలయాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంత భయంకరంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల జోక్యం తగ్గి, విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ఇప్పటికైనా ఉపకులపతుల ఎంపిక ప్రక్రియ, కేవలం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో మాత్రమే కాకుండా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో, నిష్పక్ష పాతంగా, అందరి దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేవిధంగా సాగాలి.

అభ్యర్థులు ఆయా విశ్వవిద్యాలయాలను  ఏ రకంగా అభివృద్ధి చేస్తారో తెలియచేసే విజన్‌ డాక్యుమెంట్లను సైతం సేకరించి విశ్లేషించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి. అలా కాకుండా ప్రమాణాలను తుంగలో తొక్కి, అయినవారికే వీసీ పదవులను వడ్డిస్తే యూనివర్సిటీలు స్వరాష్ట్రంలోనూ బాగుపడవు. ఇక అందులో చదువుకునే యువత ఏవిధంగా తయారవుతారో ఊహించాల్సిందే!
– జవ్వాజి దిలీప్‌; జేఎన్‌టీయూ పరిశోధక విద్యార్థి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement