
ఆచార్య బిరుదురాజు రామరాజు గురించిన ఆలోచన రాగానే సంస్కృతి, సంప్రదాయం, సాధన, విద్వత్తు మూర్తీభవించిన వ్యక్తిని మనోనేత్రంతో చూస్తాం. 55 ఏళ్ళనాడు పరిచయమైన రామ రాజుగారు కీర్తిశేషులయ్యే వరకు నా మీద చూపిన వాత్సల్యం ఎప్పటికీ గుర్తుంటుంది. వయసులో చిన్నవాళ్ళయినా ప్రేమతోబాటు గౌరవం చూపే సౌజన్యం ఆయనది. దీన్ని ఎన్నో సందర్భాలలో నేను చవిచూచాను. 24 సంవత్సరాల వయస్సులోనే నన్ను ఉస్మా నియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు పిలిపించి తెలుగు ఎం.ఎ. విద్యార్థులకు జానపద సాహిత్యం మీద ఉప న్యాసం ఇప్పించారాయన. 26 ఏళ్ళ వయస్సులోనే పిహెచ్.డి. పరీక్షకునిగా చేశారు. 27 ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు ప్రాదుర్భావ సందర్భంగా నాచేత ప్రధానోపన్యాసం ఇప్పించారు. ‘గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః’ అనే వాక్యానికి నిలువెత్తు ఉదాహరణ రామరాజుగారు.
హైదరాబాదుకు ఎప్పుడైనా వెళ్ళానంటే చిక్కడ పల్లిలో రామరాజుగారి నివాసానికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడవలసిందే. జానపద విజ్ఞానంలో జరుగుతున్న కొత్త పరిశోధనలను గురించి అడిగి తెలుసుకొనే ఆయన ఆసక్తి ఆశ్చర్య పరిచేది. ‘నేను చెప్పిందే చివరి వాక్యం. చేసేదేదో చేసేశాను. ఇక చేయవల సింది ఏదీ లేదు’ అనే మనస్తత్వం కాదు రామరాజుగారిది. ఆయన చేసిన పరి శోధన, జానపద సాహిత్యంలో ఆయన కృషి తక్కువదేమీ కాదు. ‘జానపద సాహిత్యంలో పరిశోధన చేయడానికి ఏముంది?’ అని భావించే రోజుల్లో పట్టుబట్టి జానపదగేయ సాహిత్యాన్ని పరిశోధనాంశంగా తీసు కున్న సందర్భం తెలుగులో జానపద పరిశోధనకు నాందీ వాక్యం పలికింది. తెలుగులో విస్తృతంగా జానపద విజ్ఞాన పరిశోధన జరగడానికి మూలకారణం రామరాజుగారే. జానపద సాహిత్య సేకరణ, వర్గీకరణ, వివేచన విషయంలో ఆయనదే ఒరవడి.
సంస్కృతి, సంప్రదాయాలు అంటే రామరాజుగారికి విపరీతమైన అభిమానం. అందువల్లనే మనకు తరతరాల వారసత్వంగా సంక్రమించిన జానపద సాహిత్యాన్ని ఆయన అంతగా అభిమానించారు. కాని అభిమా నించడంతో ఆగిపోలేదాయన. జానపద సాహిత్య పరిశోధనపైన దృష్టి సారించారు. పరిశోధనతో ఆగిపోక పోవడం ఆయన ముందుచూపునకు నిదర్శనం. ఆయన పరిశోధన గ్రంథాన్ని రెండోసారి ప్రచురించేటప్పుడు 1976లో నేను ప్రచురించిన ‘జానప సాహిత్య స్వరూపం’ పుస్తకాన్ని చూచినట్లుగా అందులో ఉటంకించారు. ఇది వారి హృదయ వైశాల్యాన్ని తెలుపుతుంది. జానపద విజ్ఞాన అధ్యయనాన్ని గురించి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ విషయంలో ఆయన ఆసక్తిని తెలుపుతుంది.
బిరుదురాజు రామరాజుగారు జానపద సాహిత్య పరిశోధనతోనే ఆగిపోలేదు. వారి సమకాలికులైన దిగ్దంతులవంటి పండితులతో సమానంగా వ్యవహరించాలని సంస్కృతంలో కూడా ఎం.ఎ. చేశారు. ప్రాచీన తెలుగు కావ్యాలవైపు దృష్టి సారించారు. ప్రాచీన రచనలను పరి చయం చేయడమే కాకుండా ‘చరిత్రకెక్కని చరితార్థులు’ పేరుతో విస్మృత కవులను గురించి ప్రచురించారు. ప్రాచీన తెలుగు కావ్యాలనే కాకుండా కొన్ని సంస్కృత గ్రంథాల్ని సేకరించి ప్రచురించారు. తెలుగు, సంస్కృతం మాత్రమే కాక ఆంగ్లంలో కూడా రామరాజు గారు ప్రావీణ్యం గడించారు. ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా ‘ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ‘జానపద సాహిత్య బ్రహ్మ’ అనిపించుకోవడమే కాకుండా ప్రాచీన సాహిత్య పరిశోధన, నిఘంటు రచన, చారిత్రక నవలారచన, అముద్రిత గ్రంథాల పరిష్కరణ వంటి రంగా లలో కృషి చేసిన బిరుదురాజు రామరాజుగారు చిరస్మరణీయులు.
-ఆర్వీయస్ సుందరం
వ్యాసకర్త సాహితీ విమర్శకులు
(నేడు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంఎన్టీఆర్ కళామందిరంలో బిరుదురాజు రామరాజు శత జయంతి సదస్సు)