centenary
-
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!
దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20న డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం) లో క్రిక్కిరిసిన అక్కినేని అభిమానులందరి మధ్య అక్కినేని శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షులు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఏఎఫ్.ఏ ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఉదాహరణంగా వివరించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినదర్శకులు వి.ఎన్ ఆదిత్య డా. అక్కినేనికి తొలిసారి తాను రాసుకున్న సినిమాకథను వినిపించడం, ఆయన కథ విని ఇచ్చిన సలహాలు, తన జీవితాంతం పాటించే విలువైన అంశాలు అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఛైర్మన్ మోహన్ శ్యాం ప్రసాద్ మునగాల మాట్లాడుతూ స్వయంకృషితో ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన ఏ.ఎన్.ఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.ప్రత్యేక అతిథులుగా హాజరైన పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లు డా. అక్కినేనితో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ఆయన చేసిన విద్యాదానం ద్వారా ఎంతోమంది విద్యావంతులను సృష్టించిన మేధావి అక్కినేని అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు, ఏ.ఎన్.ఆర్ కళాశాల, గుడివాడ పూర్వవిద్యార్ధి అయిన కిషోర్ కంచర్ల తన కళాశాల అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి ఆధ్వర్యంలో ‘సినీ విజ్ఞాన విశారద’ ఎస్.వి రామారావు రచించిన “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) అనేగ్రంథాన్ని వి.ఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను మోహన్ శ్యాం ప్రసాద్ ఆవిష్కరించి తొలిప్రతిని అవధాని డా. పాలపర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని నాగార్జున, వెంకట్, నాగసుశీల, సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు.అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో నృత్యం చేసిన పురుషుడు చంద్రశేఖర్ రెడ్డి లోకా, రషీద్‌ల జంట అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట మాయాబజార్, దొంగరాముడు, మాంగల్య బలం, ఆత్మీయులు, అనార్కలి, సుమంగళి, కులగోత్రాలు, ఆత్మబలం, శ్రీ రామదాసు, మనసు మాంగల్యం, రావణుడే రాముడైతే, ఇద్దరు మిత్రులు, పెళ్లి కానుక, ఏడంతస్తుల మేడ, ఆలుమగలు, ప్రేమ మందిరం, డాక్టర్ చక్రవర్తి, గాండీవం మొదలైన చిత్రాలనుండి అనేక మధురమైన గీతాలను శారద ఆకునూరి, చంద్రహాస్ మద్దుకూరి, రవి తూపురాని, నాగి పార్థసారథి, శ్రీకాంత్ లంకా, జయకళ్యాణి, సృజన ఆదూరి బృందం శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు. క్కినేని శతజయంతి ప్రత్యేక సంచికను రూపకల్పనచేసి, తీర్చిదిద్దడంలో ఎంతో సమయాన్ని వెచ్చించిన కమిటీ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, లెనిన్ బాబు వేముల మరియు దయాకర్ మాడలను పాల్గొన్న అతిథులందరినీ, నృత్య కళాకారులను, గాయనీ గాయకులను ఎ.ఎఫ్.ఎ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. అక్కినేనిలో ఉన్న నటనకన్నా ఆయనలోని విశిష్ట లక్షణాలను అధ్యయనంచేసి అనుసరించ వలసినవి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయన్నారు.” శారద ఆకునూరి తన వందనసమర్పణలో షడ్రుచుల విందు భోజనం అందించిన బావర్చి రెస్టారెంట్ యజమాని, ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు అయిన కిషోర్ కంచర్ల, మంచి వేదికను కల్పించిన రాధాకృష్ణ టెంపుల్ యాజమాన్యానికి, వీడియో, ఆడియో, ఫోటోగ్రఫీ సహకారం అందించిన వారికి, కార్యకర్తలకు ఎఎఫ్ఎ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు) -
నాన్నగారి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది: అక్కినేని నాగార్జున
‘‘నాన్నగారి (అక్కినేని నాగేశ్వరరావు) శత జయంతి రోజున ఆయన పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు పోస్ట్ మాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డిగారికి థ్యాంక్స్. శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్నగారి అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమాలు చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం మర్చిపోలేనిది’’ అని నాగార్జున అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్ఎఫ్డీసీ, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి ‘ఏఎన్ఆర్ 100– కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో అక్కినేని ఐకానిక్ ఫిలిం ‘దేవదాసు’ స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఏఎన్నార్ ‘దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, ‘గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మనం’ సహా ఏఎన్ఆర్ ల్యాండ్‌మార్క్ మూవీస్‌ని దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ పైన పేర్కొన్న చిత్రాల ప్రింట్లను 4కేలో పునరుద్ధరించాయి. ‘దేవదాసు’ స్క్రీనింగ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్‌లో అద్భుతమైన స్పందన వస్తోందని శివేంద్ర చెప్పడం ఆనందాన్నిచ్చింది. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేయడం సంతోషంగా ఉంది. నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారితో కలసి నటించే అవకాశం రావడంతో పాటు ఆయన బ్యానర్లో నిర్మించిన తొలి సినిమాలో నేను నటించడం నా అదృష్టం. హైదరాబాద్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది’’ అని పేర్కొన్నారు. నిర్మాత వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘నాన్నగారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. బాపుగారు ఆ ఫొటో గీశారు. దాంట్లో నాన్నగారి లక్షణాలన్నీ కలగలిపి ఉంటాయి’’ అన్నారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు, మా నాన్నగారు, నేను, నాగార్జున కలిసే ప్రయాణం చేశాం. నాగేశ్వరరావుగారు హైదరాబాద్‌కి అన్నపూర్ణ స్టూడియోను తలమానికంగా ఇచ్చి వెళ్లారు. ‘దేవదాసు, కాళిదాస్, విప్రనారాయణ’.. ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. తండ్రీ కొడుకులతో సినిమాలు చేసిన అదృష్టం నాకు దొరికింది’’ అని చె΄్పారు. నిర్మాత శివేంద్ర సింగ్ దుంగార్పూర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఫెస్టివల్‌ని దేశంలోని 31 సిటీస్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదొక హిస్టారికల్ డే. ఈ మూడు రోజుల్లో అక్కినేనిగారి పది క్లాసిక్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు’’ అన్నారు.ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు 1955లో లక్ష రూపాయలు విరాళం ఇచ్చి గుడివాడలో కళాశాల కట్టించారు. ఆయన దగ్గర పాతిక వేలే ఉంటే 75 వేలు అప్పు తీసుకొచ్చి మరీ లక్ష ఇచ్చారు. 70 ఏళ్ల క్రితమే ఆయన జన్మభూమి కాన్సెప్ట్ అనుకొని ఊర్లో స్కూల్ కట్టించారు. అనేక విద్యాలయాలకు విరాళాలు ఇచ్చారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. బుడమేరుపై వంతెన కట్టించిన ఘనత ఆయనది. కానీ, చేసిన సాయం గురించి ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు’’ అని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏఎన్ఆర్గారి శత జయంతిని భారత ప్రభుత్వం తరఫున సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ వేడుకలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అక్కినేని అభిమానుల్లో 600 వందల మందికి దుస్తులు బహూకరించారు. చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు‘‘ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాం. ఈ ఏడాది ఈ అవార్డుని చిరంజీవిగారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవిగారు ఎమోషనల్‌గా నన్ను హత్తుకుని.. ‘ఏఎన్ఆర్గారి శత జయంతి ఏడాదిలో నాకు అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. దీనికంటే పెద్ద అవార్డు లేదు’ అని అన్నారు. అక్టోబర్ 28న నిర్వహించే ఈ ఫంక్షన్లో అమితాబ్ బచ్చన్‌గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తాం’’ అని నాగార్జున తెలిపారు. -
మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...
గొప్ప నటుడిగా, మంచి వ్యక్తిగా తనతో కలిసి నటించిన నటీనటులతోనూ, ప్రేక్షకులతోనూ ‘మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...’ అనిపించుకున్నారు అక్కినేని. ‘‘అంతటి మహానటుడితో కలిసి నటించడం మా అదృష్టం’’ అంటున్నారు ప్రముఖ తారలు. ఈ నట సామ్రాట్ తమకు ఏ విధంగా ఆదర్శంగా నిలిచారో కొందరు నటీమణులు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ విశేషాలు...నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశారు: షావుకారు జానకినాగేశ్వరరావుగారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ‘అక్కా–చెల్లెళ్లు’ సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమాలో ఫస్ట్ నైట్ సీన్లో ‘పాండవులు పాండవులు తుమ్మెద...’ పాటకి డ్యాన్స్ చేయమని దర్శక–నిర్మాత అంటే, ‘పాట వద్దండీ... ఏదైనా డైలాగ్‌తో సీన్ ముగించవచ్చు కదా’ అంటూ వెనక్కి తగ్గాను. కానీ, ఆ చిత్రనిర్మాత రాజేంద్రప్రసాద్‌గారు, నాగేశ్వరరావుగారు పట్టుబట్టి చేయించారు. ‘డెఫినెట్‌గా హైలైట్ అవుతుంది... బాగుంటుందమ్మా చెయ్యి... ఆ తర్వాత చూడు’ అంటూ నాగేశ్వరరావుగారు ఎంతగానో ప్రోత్సహించారు. దాంతో చేశాను. ఆయన అన్నట్లే పాట హిట్ అయింది. ఆ తర్వాత ‘చూశావా... చెయ్యనన్నావు... ఎంత బాగా వచ్చిందో’ అన్నారు. మన మీద మనకు నమ్మకం లేని స్థితిలో అంతటి మహానటుడు ప్రోత్సహించి, చేయించడం అనేది నేను చేసుకున్న అదృష్టం అనిపించింది. మన ప్రతిభను గుర్తించి, ఎవరైనా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. నా మీద నాకు నమ్మకం వచ్చేలా చేశారు. అప్పుడు స్టన్నయ్యా...ఇంకా నన్ను ఆయన అభినందించిన విషయాల్లో ముఖ్యమైనది ఒకటి చెబుతాను. నాగేశ్వరరావుగారిలానే నేనూ పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారి వృత్తిరీత్యా మేం ఎక్కువగా నార్త్‌లో ఉండేవాళ్లం. పదిహేనేళ్లకే పెళ్లయిపోయింది. ఆ తర్వాత మద్రాసులో ఉన్నాం. అనుకోకుండా సినిమాలకు అవకాశం వచ్చింది. నార్త్‌లో ఉన్నప్పటికీ మన తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో చాలా శ్రద్ధగా పట్టు సాధించాను. నేను తెలుగు మాట్లాడే తీరుని నాగేశ్వరరావుగారు బాగా మెచ్చుకునేవారు. ఆ ఉచ్చారణ, ఎక్కడ నొక్కాలి? ఎక్కడ తగ్గించాలి? వంటివి బాగుంటాయని ప్రశంసించేవారు. ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకు వాయిస్ ఇచ్చేదాన్ని. అప్పట్లో నాకు ఆల్ ఇండియో రేడియోలో ‘ఏ స్టార్’ స్టేటస్.ఇక కొందరు డైలాగ్స్ మింగేస్తున్నారని, సరిగ్గా పలకడంలేదని, నువ్వెందుకు వాళ్లకు తర్ఫీదు ఇవ్వకూడదని నాగేశ్వరరావుగారు అన్నప్పుడు నేను స్టన్నయ్యా. నా మీద ఆయన ఎంత భరోసా పెట్టుకున్నారో అప్పుడు అర్థమైంది. వహీదా రెహమాన్, కేఆర్ విజయలాంటి హీరోయిన్లకు వాయిస్ ఇచ్చాను. కానీ వారు కనిపించడంలేదు... జానకియే కనబడుతోందనే మాట రావడంతో ఎవర్నీ తక్కువ చేయడం ఇష్టంలేక వేరేవాళ్లకి వాయిస్ ఇవ్వడం మానేశాను. నాకు మంచి డైలాగ్స్ ఇచ్చిన రైటర్లకు, మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను.ఆపరేషన్‌కి వెళుతూ గిఫ్ట్ ఇచ్చారు: లక్ష్మి మా అమ్మగారు (కుమారి రుక్మిణి) నాగేశ్వరరావుగారికి అమ్మగా, అత్తగా... ఇలా చాలా క్యారెక్టర్లు చేశారు. నా స్కూల్ సెలవులప్పుడు ఆ షూటింగ్స్ చూడ్డానికి అమ్మతో లొకేషన్‌కి వెళ్లేదాన్ని. సారథి స్టూడియోలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లినప్పుడు నాగేశ్వరరావుగారిని చూశాను. ‘ఎంత పెద్ద యాక్టర్’ అంటూ అలా చూస్తుండిపోయాను. ‘ఏమ్మా... ఇవాళ స్కూల్ లేదా? ఫ్రీయా? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ’ అంటూ చాలా ప్రేమగా మాట్లాడారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం) ఇప్పుడు తలుచుకున్నా ఆయనకు నేను హీరోయినా? అనిపిస్తుంది. అప్పట్లో నేను యాక్ట్ చేసిన ఏయన్నార్‌గారు, ఎంజీఆర్‌గారు, శివాజీ గణేశన్‌గారు... వీళ్లంతా వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్లు. అంత పెద్దవాళ్లతో సినిమాలు చేయడం వల్ల చాలా నేర్చుకోగలిగాను. నాగేశ్వరరావుగారితో నా ఫస్ట్ సినిమా ‘సుపుత్రుడు’. కొడైకెనాల్లో షూటింగ్. మధురై నుంచి ఫ్లైట్‌లో వెళ్లాం. ఫ్లైట్‌లో కూర్చున్నాక ‘ఏమ్మా ఎలా ఉన్నావ్... ఇన్నాళ్లూ షూటింగ్‌కి వచ్చి నన్ను చూసేదానివి. ఇప్పుడు నువ్వే హీరోయిన్‌వా? ఇప్పటిదాకా ఏం బేబీ అన్నాను... ఇప్పట్నుంచి ఏం హీరోయిన్ అనాలి’ అని నవ్వారు. (కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు)నన్ను ‘పెరుగన్నం’ అని పిలిచేవారుఫ్లైట్లో వెళుతున్నప్పుడు ‘నువ్వు చాలా ఇష్టపడి తినేవి ఏంటి’ అని అడిగితే ‘పెరుగన్నం సార్’ అన్నాను. అది కాదమ్మా... ‘జనరల్‌గా ఏం ఇష్టపడతావు’ అంటే ‘పెరుగన్నం’ అన్నాను. అప్పట్నుంచి నన్ను ఆయన ‘ఏయ్ పెరుగన్నం’ అని పిలిచేవారు. ఎక్కడ కనిపించినా ఇదే పిలుపు. అంతెందుకు ‘మిథునం’ ఫంక్షన్‌కి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆ తర్వాత నాగేశ్వరరావుగారి అవార్డు ఫంక్షన్ ఉండటంతో వెళ్లాను. నేను, బాలు సార్, చంద్రమోహన్ అందరం వెళ్లాం. ‘నైట్ డిన్నర్ ఉంది... నీ పెరుగన్నం నీకు రెడీ... వస్తావా’ అంటే, బాలూగారూ ‘అవునండీ... మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా పెరుగన్నమే...’ అంటూ ‘పెరుగు లక్ష్మి’ అని పేరు పెట్టారాయన.మా అమ్మతో షూటింగ్‌కు వెళ్లిప్పటి (పన్నెండేళ్ల వయసు) నుంచి ఏఎన్నార్ గారిలో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే... మనం కొన్ని విషయాలు మర్చిపోతుంటాం... కానీ ఆయన మాత్రం ఏదీ మర్చిపోరు. వాట్ ఎ మెమరీ అంటే... ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లినప్పుడు నా స్కూల్ టైమ్‌లో నేను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని, మాట్లాడితే ఆశ్చర్యపోయాను. ఇక సెన్సాఫ్ హ్యూమర్ అయితే సూపర్. నేను, వహీదా రెహమాన్‌గారు ఆయన కాంబినేషన్లో సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇంటికి మమ్మల్ని డిన్న ర్కి పిలిచారు. అన్నపూర్ణమ్మ (ఏయన్నార్ సతీమణి), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడిన విధానం చాలా బాగా అనిపించింది. నాగేశ్వరరావుగారి పిల్లలకు ఆయన క్లాస్ బిహేవియర్ వచ్చింది.నాగార్జునని చిన్నప్పుడు నేను సెట్లో చూసి, ‘ఏయ్ హీరో... నేనే నీ హీరోయిన్ని... డ్యూయెట్ పాడాలి’ అంటే సిగ్గు పడిపోయి పారిపోయేవాడు. ‘రేయ్ రారా... నీ హీరోయిన్ వచ్చింది’ అని నాగేశ్వరరావుగారు నవ్వేవారు. ఆయన నవ్వేటప్పుడు చక్కని పలువరుస, పెద్ద కళ్లు చూడముచ్చటగా ఉండేవి. ‘పల్లెటూరి బావ’లో యాక్ట్ చేసేటప్పుడు నా కూతురు (నటి ఐశ్వర్య) లొకేషన్‌కి వస్తే... ‘నాకు ఇంకో హీరోయిన్ రెడీ అయిపోయింది’ అని తనని ఎత్తుకున్నారు. నాతోనే ఆయన అంత చనువుగా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. కానీ ఓ షూటింగ్లో సుమిత్ర నాతో ‘అక్కా... ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఇంత బాగా మాట్లాడతారనుకోలేదు’ అని నాతో అంది. అందరితోనూ ఆయన ఆ΄్యాయంగా మాట్లాడేవారు... సరదాగా ఉండేవారు. సెట్లో ఎవరూ టెన్షన్ పడని వాతావరణాన్ని క్రియేట్ చేసేవారు.‘నా హీరోయిన్’ అంటూ...అప్పట్లో మదరాసులో నాకు ‘కళా సాగర్’ అవార్డు ఇచ్చారు. ఆ ఫంక్షన్‌కి వచ్చిన నాగేశ్వరరావుగారు, శివాజీ గణేశన్‌గారు ‘నా హీరోయిన్’ అంటూ నా చేయి పట్టుకుని, స్టేజి మీదకు తీసుకెళ్లి, అవార్డు ఇచ్చిన సంఘటన నాకెప్పటికీ గుర్తే. ఒక ఆర్టిస్ట్‌గా నాకు ఇంతకన్నా ఏం కావాలి? అప్పట్లో మొబైల్ ఫోన్ లేదు... సెల్ఫీ తీసుకోవడానికి. ఇక నాగేశ్వరరావుగారి మనోధైర్యం గురించి చెప్పాలి. 1973లో అనుకుంటా ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి యూఎస్ వెళుతున్నారు. ‘పల్లెటూరి బావ’ సినిమా చేస్తున్నాం. ఆయన తల్లిగా సుకుమారిగారు నటిస్తున్నారు. ఆపరేషన్‌కి వెళ్లే ముందు ‘నేను మళ్లీ రావాలి.. ఐ విల్ కమ్‌బ్యాక్ పాజిటివ్లీ. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితే... అందుకే నా గుర్తుగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా’ అని చాలా కూల్‌గా అన్నారు. మేం ‘అయ్యో... అలా అనకండి సార్’ అన్నాం. కానీ, గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటూ అమ్మాయిలకు వీఐపీ బ్రాండ్ మేకప్ వ్యానిటీ బాక్స్, అబ్బాయిలకు వీఐపీ బ్రీఫ్‌కేస్ ఇచ్చారు. నాకు రెడ్ కలర్ బాక్స్ ఇచ్చారు... ఇప్పటికీ ఆ గిఫ్ట్ నా దగ్గర భద్రంగా ఉంది.ఆయన రోజూ ఒక కప్పు మీగడ తినేవారు. ‘ఈ మీగడ తినీ తినీ నేను హాస్పిటల్‌కి వెళుతున్నాను. నువ్వు పెరుగన్నంలో మీగడ వేసుకుని తినకు. మళ్లీ నాలా హాస్పిటల్‌కి వెళ్లాలి’ అన్నారు. ఒకసారి నేను ఒక షూటింగ్‌కి వెళుతూ తాజ్ బంజారా నుంచి కారులో వెళుతుంటే, పంచెకట్టులో ఓ ఐదారుగురు కనిపించారు. ‘మన సార్లా ఉందే’ అని కారు ఆపాను. ఆయన, సుబ్బరామి రెడ్డిగారు, ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. అప్పుడు టైమ్ ఉదయం ఆరు. నన్ను చూసి, ‘ఏం లక్ష్మి... ఎక్కడికి వెళుతున్నావు? షూటింగ్కా?’ అంటే... ‘సార్ మీ స్టూడియోకే వెళుతున్నాను’ అన్నాను. ‘వెరీ గుడ్... మై హీరోయిన్ లక్ష్మి’ అని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేశారు. వాకింగ్ స్టిక్ పట్టుకుని, ఆ పంచెకట్టులో ఆయన రూపాన్ని మర్చిపోలేను. ఆ ఆ΄్యాయంగా మాట్లాడటం అనే లెగసీ ఆయన కూతుళ్లకు, కొడుకులకు, ఆ తర్వాతి జెనరేషన్‌కి వచ్చింది.నాలోని భయాన్ని తీసేశారు: శారదనా ఫస్ట్ సినిమా (ఇద్దరు మిత్రులు) ఆయనతోనే. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘కన్యాశుల్కం’ సినిమాలో ఒక పాటకి డ్యాన్స్ చేశాను. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయేమో. నా పదహారేళ్లప్పుడు ‘ఇద్దరు మిత్రులు’లో నాగేశ్వరరావుగారి చెల్లెలిగా చేశాను. అందులో ఆయనవి రెండు పాత్రలు. ఒక పాత్రకు నేను చెల్లెల్ని. ‘ఈ సీన్ ఇలా చెయ్యి... ఇదయ్యాక అలా చెయ్యాలి’ అంటూ దగ్గర కూర్చుని చక్కగా నేర్పేవారు. ఆ వయసులో నాకు నటనంటే తెలియదు. ఇలాంటి పెద్దవాళ్లతో నటించడం అంటే చిన్న విషయం కాదు. నాకు ఆ అవకాశం రావడం నా అదృష్టం.మా ఫ్యామిలీలో పదమూడేళ్లకే పెళ్లి చేసి, పంపించేస్తారు. కానీ, మా అమ్మకు నన్ను ఆర్టిస్ట్‌ని చేయాలని ఉండేది. నాన్నని ఎంతో కన్విన్స్ చేసి, తీసుకొచ్చినప్పుడు నాకు దొరికిన అవకాశం ‘ఇద్దరు మిత్రులు’. ఆ సమయంలో ఎల్వీ ప్రసాద్‌గారి ఆఫీసులో నాకు నవరసాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పుడు చెల్లెలి పాత్రకు ఆర్టిస్ట్ దొరక్క తర్జన భర్జన పడుతున్నారు. అది తెలిసి, ‘మా దగ్గర ఒక అమ్మాయి ఉంది’ అని ‘ఇద్దరు మిత్రులు’ యూనిట్‌కి ఫోన్ చేసి, ఆ పక్కన ఉన్న వారి ఆఫీసుకి పంపించారు. నాతో రెండు డైలాగ్స్ చెప్పించారు. ‘వండర్ఫుల్... నాగేశ్వరరావుగారి చెల్లెలిగా నువ్వే చేయబోతున్నావు’ అని డైరెక్టర్ (ఆదుర్తి సుబ్బారావు)గారు అన్నారు. సెట్లో నాగేశ్వరరావుగారిని చూసినప్పుడు పెద్ద నటుడు, వయసులోనూ పెద్దవారు కాబట్టి కాస్త భయపడ్డాను.కానీ మాలాంటి కొత్తవారిని ఆయన ప్రోత్సహించిన తీరు అద్భుతం. మాలోంచి భయాన్ని తీసేసేవారు. ‘శారదా.. ఈ సీన్ ఇలా చేయాలి’ అని చక్కగా నేర్పేవారు. తనది పెద్ద స్థాయి అని కాకుండా అందరితో కలిసిపోయేవారు. నటుడిగా ఆయన ఎంత గొ΄్పో.. వ్యక్తిగానూ అంతే గొప్ప. ఎదుటివాళ్లు బాగా యాక్ట్ చేస్తే కొందరు చూడలేరు. పైకొచ్చినా చూడలేరు. కానీ, నాగేశ్వరరావుగారికి అలాంటివి లేవు. ఆయనేమో ఆయన వర్క్ ఏమో అన్నట్లు ఉండేవారు. ఒక పాత్రను ఎలా అవగాహన చేసుకోవాలి? డైలాగ్స్ ఎలా పలకాలి వంటివి ఆయన్నుంచి నేర్చుకున్నాను. ఆయనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంటికి వెళ్లాను. అదే ఆఖరిగా ఆయన్ను కలిసింది.డైలాగ్స్ చెప్పింది ఈ అమ్మాయేనా అన్నారు: రోజా రమణినాగేశ్వరరావుగారి ‘మూగ మనసులు’ సినిమాలోని ‘గోదారి గట్టుంది...’ పాటను ఆడిషన్‌కి వెళ్లినప్పుడు పాడటం వల్ల నేను ‘భక్త ప్రహ్లాద’ సినిమాకి సెలక్ట్ అయ్యాను. ఇక ఆయన కాంబినేషన్లో నటించే అవకాశం నాకు ‘మరపురాని మనిషి’ సినిమాలో వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు. ఆయన నాతో ‘అమ్మాయ్... నువ్వు తొందరగా ఎదిగిపో... నా పక్కన హీరోయిన్గా చెయ్యాలి. ఇలా చిన్నపిల్ల వేషం వేయకూడదు’ అని సరదాగా అన్నారు. ఆ తర్వాత ‘ఆలు మగలు’ సినిమాలో ఆయన కోడలిగా చేశాను. అప్పుడు కూడా ‘ఏంటమ్మాయ్... నువ్వు నా పక్కన హీరోయిన్గా చేస్తావనుకుంటే చిన్నపిల్ల, కోడలు వేషాలు వేస్తావ్’ అని చాలా జోవియల్‌గా అన్నారు. ఓ పదేళ్ల క్రితం అనుకుంటా... ఒకసారి గీతాంజలిగారు మా ఇంటికి వచ్చారు. ‘రోజా... ఇవాళ నాగేశ్వరావుగారి బర్త్‌డే.ఆయన ఇంటికి వెళుతున్నాను... నువ్వూ వస్తావా’ అన్నారు. ‘నేనెప్పుడూ అలా వెళ్లలేదు’ అన్నాను. ‘నాకోసం రావా ప్లీజ్. పెద్దాయన బెస్ల్సింగ్స్ తీసుకుందాం’ అన్నారావిడ. బ్లెస్సింగ్స్ అనగానే వెళ్లాలనిపించింది. ఇద్దరం వెళ్లాం. మేం వెళ్లినందుకు ఆయన ఎంత హ్యాపీగా ఫీలయ్యారంటే... ‘అదేంటీ... ఎప్పుడూ గీత మాత్రమే వస్తుంటుంది... నువ్వు వచ్చావ్’ అన్నారు. ‘నేనే తీసుకొచ్చా’ అన్నారు గీత. ‘ఓ... నువ్వు తీసుకొస్తే వచ్చిందా తను’ అన్నారాయన. వెంటనే నేను ‘మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను’ అన్నాను. ఆయన మాకు టిఫిన్ పెట్టారు. చాలాసేపు మాట్లాడారు. అదొక గ్రేట్ మెమరీగా నా మనసులో ఉండిపోయింది. ఆ తర్వాత ఒక ఫంక్షన్లో నా జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారాయన. ఆ స్టేజి మీద ‘భక్త ప్రహ్లాద’ సినిమా చూశాను. ఆ సినిమాలో ఈ అమ్మాయి వేదాలు, పాటలు, సంస్కృత డైలాగ్స్‌ని ఐదారేళ్లకే అంత బాగా ఎలా చెప్పగలిగింది? అసలు చెప్పింది ఈ అమ్మాయేనా? ఎవరైనా చెప్పారా? అని చాలామందిని అడిగాను. ఆ అమ్మాయే చెప్పిందన్నారు. దాంతో నేను మళ్లీ ఆ సినిమా చూశాను. లిప్ మూమెంట్ అంత కరెక్ట్‌గా ఎలా ఇచ్చిందా అని ఆశ్చర్యపోయాను’ అని నా గురించి చెప్పారు. మలయాళ సినిమా ‘చెంబరుత్తి’కి మద్రాసు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు నాకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డుని నాగేశ్వరరావుగారి చేతుల మీదగా అందుకోవడం అనేది నాకో మంచి మెమరీ.మా బాబు తరుణ్ కూడా ఆయన చేతుల మీదగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత నాగేశ్వరరావుగారి పేరు మీద ఉన్న అవార్డును నాకు ఇచ్చారు. అది స్వీకరించడం నా అదృష్టం. ఇక నాకు బాగా గుర్తుండిపోయినది ఒకసారి ఆయనతో కలిసి చేసిన ఫ్లైట్ జర్నీ. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఆయనకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. కానీ ఆయన ఒకే ఒక్క ఇడ్లీ, కొన్ని బొప్పాయి ముక్కలు తీసుకున్నారు. అంతే తీసుకుంటారా? అని అడిగితే, ‘అంతే అమ్మాయ్... బాగా ఆకలి అయితే ఇంకో ఇడ్లీ తింటాను’ అన్నారు. లిమిటెడ్ ఫుడ్, మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వాకింగ్ ఈ విషయాలన్నింటినీ చెప్పారు. ఆయన లైఫ్‌స్టైల్ బాగుంటుంది.నా ఎక్స్పెక్టేషన్ని దాటేశావు అన్నారు: మీనాఏయన్నార్గారి దగ్గర్నుంచి నేను నేర్చుకున్నది ‘పంక్చువాలిటీ’. ‘సీతారామయ్యగారి మనవరాలు’ సమయంలో ‘షూటింగ్ లొకేషన్లో ఎవరి కోసం అయినా నువ్వు వెయిట్ చేయొచ్చు. కానీ నీకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. అది ఫాలో అవ్వు’ అన్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ షూటింగ్ విషయంలో నేను అదే ఫాలో అవుతున్నాను. ఇక ఆ సినిమా చేసేటప్పుడు ‘నేను పెద్ద నటుణ్ణే. కానీ, ఇది నీ సినిమా. నువ్వే ఈ సినిమాకి బ్యాక్‌బోన్. క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకుని డైలాగ్స్ చెప్పాలి... ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి’ అని ఆయన అన్నారు. ఆ సినిమా ప్రివ్యూ చూశాక ‘న్యూ కమర్ కదా అనుకున్నాను. కానీ బాగా చేశావమ్మా... నా ఎక్స్పెక్టేషన్ని దాటేశావు. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది’ అని అన్నారు.ఎప్పుడు ఆలోచించినా ఏయన్నార్గారిలాంటి పెద్ద నటుడు, పైగా టైటిల్లో నా రోల్ కూడా ఉండటం అనేది చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. నిజానికి నేను ఆ సినిమా చేయాలా? వద్దా అనుకున్నాను. ఎందుకంటే చదువుకుంటున్న టైమ్‌లో ఆ చాన్స్ వచ్చింది. ఈ సినిమా క్లిక్ అయితే సినిమాల్లో కంటిన్యూ అవుదామని చేశాను. కట్ చేస్తే... నా లైఫ్ టర్నింగ్ మూవీ అయిపోయింది. ‘సీతారామయ్యగారి మనవరాలు’ ఫస్ట్ డే షూట్ అప్పుడు ఏయన్నార్‌గారి కాళ్లకు నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ సినిమా తర్వాత ఎక్కడ కనబడినా ‘నా మనవరాలు వచ్చింది... రా’ అని ఆయన అంటే... ‘తాతయ్యా... ఎలా ఉన్నారు’ అనేదాన్ని. నన్ను చూసి చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యేవారు. అంతటి లెజెండ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా లక్.-డి.జి.భవానిఇదీ చదవండి : అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి! -
పాఠశాల నుంచే దాడి?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్‌నగర్ డాబాకొట్ల సెంటర్లో వివేకానంద సెంటినరీ హైస్కూల్ నుంచే ఎయిర్‌గన్‌తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ పాఠశాల వెనుక వైపున రోడ్డులోనే సీఎం జగన్ యాత్ర సాగుతోంది. సీఎం జగన్ ఉన్న బస్సుకు, పాఠశాల కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన ఈ జీ+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వాచ్మెన్ భద్రత లేదు. దీంతో గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి, సులభంగా తప్పించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఆఫీసు ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 59వ డివిజన్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్ బ్యాచ్, ఎయిర్గన్లు, క్యాటర్‌బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఎం జగన్ రోడ్‌షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. -
చిరస్మరణీయుడు
సాక్షి, న్యూఢిల్లీ: తన అసాధారణ వ్యక్తిత్వంతో దివంగత ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. రామాయణ, మహాభారతంలోని పాత్రలకు ప్రాణం పోసి భారతీయ సినిమా, సంస్కృతిని సుసంపన్నం చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై రూపొందించిన రూ.100 స్మారక నాణెంను ఆమె విడుదల చేసి మాట్లాడారు. రిక్షా దిగి నేలకు నమస్కారం.. ‘ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం ముద్రించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుకు తీసుకెళ్లారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు. ఓ గొప్ప వారసత్వానికి ఆమె వారసురాలు. ఎన్టీఆర్ తెలుగు సహా పలు భారతీయ భాషల్లో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఎన్టీఆర్ గురించి నా దృష్టికి వచ్చిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటున్నా. 70వ దశకంలో ఓ పెద్దావిడ తన కుమార్తెను చూసేందుకు మద్రాసు వెళ్లారు. అనంతరం మనవరాలితో కలసి రిక్షాలో వెళ్తుండగా ఓ వీధిలో జనం గుమి గూడటాన్ని చూశారు. ఆ వీధిలో ఎన్టీఆర్ ఉంటారని మనవరాలు చెప్పడంలో ఆమె వెంటనే రిక్షా దిగి భూమికి నమస్కరించారు. ఎన్టీఆర్ గురించి ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సామాన్యుల బాధను కూడా ఆయన తన నటనతో తెలియజేశారు. మనుషులంతా ఒక్కటే సినిమా ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం సందేశాన్ని చాటి చెప్పారు. నటుడు, ప్రజా సేవకుడు, నాయకుడు ఇలా అన్నింటా ఆయన ప్రజాదరణ పొందారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు నేటికీ గుర్తుంటాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. అన్ని తరాలకు ఆదర్శ హీరో: పురందేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ ఒక్క తరానికి మాత్రమే కాకుండా అన్ని తరాలకు ఆదర్శ హీరో అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్రతోపాటు మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. నేటి నుంచి మూడు చోట్ల విక్రయాలు ఎన్టీఆర్ స్మారక నాణెం మంగళవారం నుంచి హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని మింట్ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి స్మారకార్ధం నాణెం హైదరాబాద్‌లో రూపొందించడం ఇదే తొలిసారని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు చెప్పారు. నాణెం తయారీలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ వినియోగించామన్నారు. రూ.100 నాణెం అయినప్పటికీ దీని ధర రూ.3,500 నుంచి రూ.4,850 వరకు ఉండవచ్చన్నారు. ప్యాకింగ్ మెటిరియల్‌ను బట్టి ధర వేర్వేరుగా ఉంటుందన్నారు. స్మారక నాణెం కాబట్టి చెలామణీలో ఉండదని స్పష్టం చేశారు. తొలి విడతలో 12 వేల నాణేలను రూపొందించామని, 50 వేల నాణేల వరకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్, చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద విక్రయాలు నిర్వహిస్తామని తెలిపారు. జీవిత విశేషాలతో వీడియో.. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల వీడియోను రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ప్రదర్శించారు. స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు, ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాకొద్దు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కనిపించని బాబు ఫొటో
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయపడ్డా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి అయితే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విగ్రహావిష్కరణకు వచ్చిన ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు. -
Kundurti Anjaneyulu: వచన కవితా మూర్తి
జాషువా, విశ్వనాథల ప్రేరణా ప్రభావాలతో పద్య కవిత రచనకు పూనుకున్నాడు కుందుర్తి ఆంజనేయులు. విశ్వనాథ వారి ప్రౌఢమైన శైలిలో ‘సౌప్తికం’ అనే కావ్యాన్ని రచించాడు. ఆయన 1922 డిసెంబర్ 16వ తేదీన నరసరావుపేట సమీపంలో కోటవారిపాలెంలో పేదకుటుంబంలో జన్మించాడు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో అనిసెట్టి, రెంటాల, బెల్లంకొండ రామదాస్, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. మాచిరాజు దేవీప్రసాద్ ప్రేరణతో శ్రీశ్రీ కవిత్వ లాలసుడై వచన కవిత్వం వైపు దృక్పథం మరల్చుకున్నాడు. నవ్యకళా పరిషత్, నరసరావుపేట ఆధ్వర్యంలో ఏల్చూరి, బెల్లంకొండ రామదాసులతో కలసి తెలుగులో తొలి వచనా కవితా సంపుటి ‘నయాగరా’ను 1944లో ప్రచురించాడు. తొమ్మిది కవితల సంపుటి నయాగరాలో కుందుర్తి రచించిన ‘మన్యం లోకి’ కవితలో మన్యం వీరుడు అరి విప్లవాగ్నిని ప్రశంసించాడు. ‘జయిస్తుంది’ కవితలో బ్రిటిష్ వారి దురాగతాలను నిరసించాడు. క్విట్ ఇండియా ప్రభావంతో అసమ సమాజాన్ని ఈసడిస్తూ ‘ఒకవేపున అధికోత్పత్తీ/ మరోవేపు డొక్కల కరువు’ ఇకపై సాగవని హెచ్చరిక చేశాడు. ఆయన కవితలపై శ్రీశ్రీ మరోప్రపంచం గేయం ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘పాతకాలం పద్యమైతే / వర్తమానం వచన గేయం’ అంటూ ‘నాలో నినాదాలు’లో కుందుర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఎందరో అధునిక కవులను ప్రభావితం చేశాడు. అనిసెట్టి, ఆరుద్ర, దాశరథి, సి. నారాయణ రెడ్డి, రెంటాల వంటి వారు వచన కవితను ఆదరించి వచన కవితా సంపుటాలు ప్రచురించారు. వచనకవితా మూర్తి కుందుర్తికి ఫ్రీవర్స్ ఫ్రంట్ ఊపిరి. ప్రాచీన కవిత్వంపై తిరుగుబాటు చేసి ‘రచనల పూలతోటలో ఛందస్సుల మొక్కలు నాటను’ అని ప్రతిజ్ఞ చేశాడు. ఆధునిక కాలానికి అనువైన ప్రక్రియ వచన కవిత్వ మేనని నిరూపించేందుకు ఎంతో శ్రమపడ్డాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వ్యాసాలు, పీఠికల ద్వారా వచన కవితా ప్రచారం ముమ్మరంగా చేసినందున కుందుర్తిని వచన కవితా పితామహుడిగా విమర్శకులు పేర్కొన్నారు. ఆశ, ఆచారిగారి అమ్మాయి, శిక్ష వంటి గేయ నాటికలు రాశాడు. తెలంగాణ, యుగేయుగే, నగరంలో వాన, నాలోని నాదాలు, కుందుర్తి కృతులు పాఠకుల మన్ననలు పొందాయి. ‘హంస ఎగిరిపోయింది’ అనే సతీస్మృతి కావ్యం విశిష్టమైంది. ఆయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, ప్రకృతిని సామాజిక స్పృహతో సమన్వయించటం, చమత్కారమైన అధిక్షేపణ, ఆకర్షణీయమైన అంత్యప్రాసలు ఎందరో యువకులను ప్రభావితం చేశాయి. ఆయన 1982 అక్టోబర్ 25వ తేదీన మరణించినా, వచన కవితా పితామహుడిగా ఆధునికాంధ్ర కవిత్వంలో చిరస్మరణీయుడు! (క్లిక్ చేయండి: బాపుయగుట దుష్కరమ్ము సుమ్ము) – డాక్టర్ పీవీ సుబ్బారావు, సాహితీ విమర్శకులు (డిసెంబర్ 16 కుందుర్తి ఆంజనేయులు శత జయంతి ముగింపు) -
Rachamallu Ramachandra Reddy: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!
విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! విమర్శకుల్లో రా.రా. మెథడాలజీని, మెథడ్‌ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది! ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్! ఈ విష యంలో ఫ్రాస్ట్‌కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్.ఎస్. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్ ఖయావ్ు, రబీంద్రనాథ్ టాగోర్ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్‌ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్ ఎట్ హార్ట్) అయివుండాలి!! దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి చెప్తూ ‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి. ‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా. రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! - మందలపర్తి కిశోర్ సీనియర్ పాత్రికేయుడు (నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి) -
తెలుగు సాంస్కృతిక వికాస రారాజు
పిఠాపురం మహారాజారావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ (1885 –1965) ఆంధ్రదేశపు సంస్కరణ పోషణకు, సాంస్కృతిక కళా వికాసానికీ, సత్పరిపాలనకూ ఎనలేని కృషి చేశారు. తన గురువు దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడు చూపిన అభ్యుదయ మార్గంలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికై అలుపెరుగక పరిశ్రమించారు. వివిధ రంగాల్లో సూర్యారావు చేపట్టిన కార్యక్రమాలు ఎన్నదగ్గవి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలుపునందుకుని పాతిక వేలు అందించి, ఆనాటి జమీందార్లలో దేశభక్తికి ఊపిరులూదారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ‘శాంతినికేతన్’ కలకత్తాలోని సిటీ కాలేజి; రాజమండ్రిలోని ఆస్తిక కళాశాల, టౌన్ హాలు నిర్మాణానికీ ఆర్థికంగా ఆయన అందించిన సేవలు అనన్యసామాన్యమైనవి. సంఘ సంస్కరణోద్యమానికి బాటలు వేసిన ‘బ్రహ్మసమాజం’ కార్యక్రమాలకు అన్ని విధాలా సాయం అందించారు. 1933లో బ్రహ్మసమాజ సూత్రధారి రాజా రామ్మోహన్రాయ్ శత వర్ధంతిని నిర్వహించారు. ఎన్నో మత సామరస్య, మానవీయ గ్రంథాల్ని ఈ సందర్భంగా ప్రచురించారు. అలాగే నాలుగవ అంతర్జాతీయ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ రాజుగా ఘనత సాధించారు. ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ను మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాంటి సమగ్రమైన నిఘంటువు తెలుగులో కూడా అవసరమనే ఆశయంతో ‘సూర్యరాయాంధ్ర’ నిఘంటువు నిర్మాణాన్ని ఒక బృహత్కార్యంగా చేపట్టి తెలుగుజాతికి అందించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అనాథ ఆశ్రమంగా ‘కరుణాలయం’ స్థాపించారు. నిమ్న వర్గాల పురుషుల పేరు చివర ‘గాడు’ను చేర్చి అవమానకరంగా పిలవడాన్ని నిషేధిస్తూ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిల్లును ప్రవేశపెట్టి విజయం సాధించారు. గాంధీజీ చేపట్టిన మద్యపాన నిషేధ ఉద్యమం కంటే ముందుగానే పిఠాపురం సంస్థాన పరిధిలో కల్లు తాగడాన్ని నిషేధించారు. కాకినాడలోని పీఆర్ కళాశాల ద్వారా దేశంలో అత్యున్నత విద్యనందించి చరిత్రలో ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎనలేని కృషి చేసిన పిఠాపురం రాజాను స్మరించుకోవడం మన బాధ్యత. – ర్యాలి ప్రసాద్, చారిత్రక పరిశోధకులు (అక్టోబర్ 5న పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూర్ జయంతి) -
Kommareddy Raja Mohan Rao: ప్రగతిశీల వైద్య శిఖామణి
మానవతావాది, పూర్వ ఉపకులపతి, ప్రజా వైద్యులు, అభ్యుదయవాదిగా 86 సంవత్సరాల జీవితాన్ని గడిపిన డాక్టర్ కొమ్మారెడ్డి రాజా రామమోహన్ రావు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో 1922లో జన్మించారు. 1951 నుండి 1980 వరకు గడిపిన వైద్యరంగ జీవితం చిరస్మరణీయం. సింగరేణి కాలరీస్ వైద్యాధికారిగా 200 పడకల ఆసుపత్రిని నిర్మించి సింగరేణి కాలరీలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులకు ఆధునిక వైద్యాన్ని అందించారు. సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని ఉచిత వైద్యాన్ని అందించారు. గుంటూరు మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆయా కళాశాలల అభివృద్ధికి పునాదులు వేశారు. 1982–86 మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా విద్యా రంగంలో పలు మార్పులు, సవరణలకు కారకులయ్యారు. దేశంలో ప్రప్రధమంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘శాస్త్రీయ సోషలిజం అధ్యయన కేంద్రా’న్ని నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే ‘మహాయాన బౌద్ధ కేంద్రం’ కూడా ఆయన పదవీ కాలంలోనే నెలకొల్పబడింది. సర్జన్స్ అంతర్జాతీయ కాలేజ్, ఇంటర్నేషనల్ మెడికల్ స్టడీస్ అకాడమీ, భారత సర్జన్ల సంఘం, భారత యూరోలాజికల్ సొసైటీ, ఇండి యన్ మెడికల్ అసోసియేషన్, జెనీటో– యూరినరీ సర్జరీ(అమెరికా) శిక్షణాబోర్డు తదితర సంఘాలలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఇంగ్లండ్, అమెరికా, జపాన్ తదితర చోట్ల జరిగిన వైద్య సభలకు హాజరయ్యారు. అటు వైద్యరంగానికీ, ఇటు విద్యారంగ వ్యాప్తికీ రామమోహన్ రావు చేసిన కృషికి అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1984లో యార్లగడ్డ రాజ్యలక్ష్మి, వెంకన్న చౌదరి కళాపీఠం తరఫున జాతీయ అవార్డు లభించింది. సామాజిక, వైద్య సేవ రంగాలలో ఆయన చేసిన కృషికిగాను 1992లో ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ అవార్డును పొందారు. శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామ సీమలకు చేర్చాలన్న లక్ష్యంతో ‘జన విజ్ఞాన వేదిక’ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వీరి నిరాడంబర జీవితం, సరళ స్వభావం, సేవా తత్పరత, ఆపన్నుల పట్ల ఆదరణ, ప్రగతి శీల ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత వలన ఒకానొక సందర్భంలో భారత రాష్ట్రపతి పదవికి వామపక్ష అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించిన సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజా రామమోహన్ రావు తండ్రి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి 1937 లోనే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిపిన రైతు రక్షణ యాత్ర చారిత్రాత్మకం. జీవితాన్ని స్వార్థం కొరకు కాక లోకహితం కొరకు ధారపొయ్యాలన్న తండ్రి మాటను శిరోధార్యంగా తీసు కున్నారు రామమోహనరావు. ఆయన ఆశయాలను మనమూ కొనసాగిద్దాం. – వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక, ఏపీ అధ్యక్షులు (సెప్టెంబర్ 25న కొమ్మారెడ్డి శత జయంతి సందర్భంగా గుంటూరు, వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమినార్ జరుగనుంది) -
Yelavarthy Nayudamma: అసమాన ప్రతిభావంతుడు
భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించినవారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు. భారత్‌లో విద్యాభ్యాసం అనంతరం అమెరికా చర్మ శుద్ధి పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, తాను చదువుకున్న సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ ట్లో చేరి చివరకు దాని డైరెక్టర్ అయ్యారు. నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డీ హైడ్స్ వంటి వాటి కలయిక, నిర్మాణశైలిపై కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్లను పదును చేసే వినూత్న ఏజంట్స్‌గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అనేక పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మంతో తయారైన వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశాలకు మధ్య స్నేహవారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచారు. నూతన లేబరేటరీలకు ప్రణాళికలు రచించి, స్వయంగా రూపకల్పన చేసి, స్థాపింప జేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్లను దేశ స్థాయిలో తొలిసారిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. ‘లెదర్ సైన్స్’ మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్స్ లర్గా (1981–1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు పొందారు. 1986 నుండి ఆయన పేరుమీద నెలకొల్పిన అవార్డును సైన్స్, టెక్నాలజీ రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ఏటా అందిస్తున్నారు. – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి (శాస్త్రవేత్త నాయుడమ్మ శతజయంతి) -
Rachakonda Viswanatha Sastry: అల్పజీవుల బుద్ధిజీవి
మామూలుగా రాయడం రావిశాస్త్రికి రాదు. వాక్యానికి ఏ అలంకరణ చేస్తే పాఠకుడు కళ్లు తిప్పుకోలేడో ఆయనకు తెలుసు. దాన్నే విమర్శకులు శైలి అంటారు. తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రి శైలి ఒక మ్యాజిక్. అతి మామూలుగా రాసే ఒక పొట్టి వాక్యం కూడా ఆయన రాసినందువల్ల దానికి ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. అలాంటి శైలిని అనుకరించాలని బోల్తాపడిన వాళ్లెందరో. అది అనితర సాధ్యం. ఆధునిక కాలపు గొప్ప రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. అత్యంత వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర నుండి వచ్చిన ఆయన, ఆ ప్రాంత భాషకు పట్టం కట్టారు. వృత్తిపరంగా న్యాయవాది అయినందువల్ల పిపీలికాలు, అల్పజీవుల తరపున మదోన్మత్త గజాల మీద పోరాడారు. జీవితాంతం అతిసామాన్యుని పక్షాన ఉండి, అసామాన్య సాహితీ సృజన చేసిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి శత జయంతి నేడు. మొదటిసారి గురజాడ కన్యాశుల్కం చదివినప్పుడు, ఇది దేవతలు మాత్రమే రాయగలరు అని రావిశాస్త్రి అన్నాడు. రావిశాస్త్రి రచనలు మాత్రం దేవతలు కూడా రాయలేరు. ఎందుకంటే దేవతలు సిరిమంతులు, నీతిమంతులు, బలవంతులు వంటి మర్యాదస్తుల పక్షాన వుంటారు. రావిశాస్త్రి పాత్రల్ని ఆయనే సృష్టించగలడు. వారి భాషనీ, వారి తెగువనీ, వారి దైన్య హైన్య సాహసాలనీ రావిశాస్త్రి మాత్రమే రాయగలడు. రావి శాస్త్రి స్పెషాలిటీ కేవలం శైలి మాత్రమే కాదు. ఆయన గొప్పతనమంతా ప్రమాణాలను పటాపంచలు చేయడమే. మట్టిలోంచి కన్నీటిని పిండి అందులో కడిగిన పాత్రల్ని తీసి వారిని ఈ మానవ మాయాప్రపంచంతో యుద్ధం చేయడానికి సిద్ధం చేశాడు. ఒక కన్యాశుల్కాన్ని గురజాడ మాత్రమే రాయగలడు. ఒక మైదానం చలం మాత్రమే రాయగలడు. ఒక అల్పజీవిని రావిశాస్త్రి మాత్రమే రాయగలడు. ‘అల్పజీవి’ నుండి ‘ఆరు సారా కథలు’ మీదుగా ‘రాజు మహిషి’, ‘రత్తాలు రాంబాబు’ వంటి నవలలు దాకా రావిశాస్త్రి చేసిందల్లా తనలోని అద్భుతాన్ని అక్షరాల్లోకి అనువదించడమే. వచనాన్నీ, కవిత్వాన్నీ, వస్తువునీ... సమస్తాన్నీ కాలం మిక్సీలో వేసి తనకు మాత్రమే అబ్బిన వింత విద్యతో... సత్యాసత్య సంఘర్షణల అద్భుతాలను వెలికి తీసి, తన కాలపు రంగస్థలం మీద గెంతులేయించాడు. అది మేజికల్ రియలిజమా... చైతన్య స్రవంతి మహత్యమా! ఆయన రచనలను ఆస్వాదించడం తప్ప ఆయనలా రాయాలను కోవడం అసాధ్యం. రావిశాస్త్రి పాత్రలు ముత్యాలమ్మ, నూకాలమ్మ, పోలమ్మ, పోచమ్మ, అంకాలమ్మలు వంటి ఎవరెవరో ఈ నీతిమంతుల ప్రపంచం మీద ఒకసారిగా విరుచుకుపడతారు. నేరస్థులు పోలీసులకు బుద్ధి చెబుతారు. ముద్దాయిలు న్యాయమూర్తులకు, అవినీతిపరులు నీతిమంతులకు, అలగాజనం ఆస్తిమంతులకు బుద్ధి చెబుతారు. ఒకసారి రావిశాస్త్రి లోకి దిగిన తర్వాత ఆ పాత్రలు మాట్లాడుతుంటే మనం తలదించుకొని ఏదో నేరం చేసినట్టు ఉండి పోతాం. ఎదురుపడితే ఏదో దారి చూసుకొని వాళ్ళ నుంచి తప్పుకుపోతాం. ఆయన అననే అన్నాడుగా ‘‘ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు ఏదో రోజున వాళ్ళందరూ ఒక్కసారిగా గప్పున తెలివి తెచ్చుకుంటారు. అప్పుడు పుణ్యం వర్ధిల్లుతుంది. అంచేత అప్పుడు మనలాంటి పాపులు జాగ్రత్తగా ఉండాలి.’’ అదీ సంగతి. వర్ణనలు బాబోయ్ వర్ణనలు అని గగ్గోలు పెట్టారు కొందరు. వర్ణనలు బోర్ కొడుతున్నాయని మహామహులైన విమర్శకులు కూడా అన్నారు. కానీ ఆ వర్ణనల వల్లే రావిశాస్త్రి ఒకే ఒక్కడుగా మిగిలిపోయాడు. రాజు–మహిషిలో అనవసరమైన వర్ణనలు మితిమీరి ఉండడమే దాని లోపం అని కదా ‘రారా’ రాద్ధాంతం. అదేమో గాని రాజు–మహిషి నవలలో మందుల భీముడు లోకంలోని పాపాల మీద ఇచ్చిన పెద్ద ఉపన్యాసం ఒక్కటి చాలు అసలు రావిశాస్త్రి అంటే వర్ణనలే అని ఒప్పేసుకుంటాం. అందుకేనేమో ఆ అసంపూర్తి నవలకు శ్రీశ్రీ ‘అపరిచయం’ రాసి దాన్ని నిజమైన క్లాసిక్‌గా వర్ణించాడు. ఇస్మాయిల్, మార్క్సిస్టుల్లో కూడా మహాత్ములు ఉంటారని రావిశాస్త్రి గురించి మాట్లాడుతూ చేసిన వెటకారం బహుశా రారా లాంటి వాళ్లు గుర్తించాలనే కాబోలు. అదేం కాదులెండి. కేవీఆర్, చలసానిలాంటి ఉద్దండ మార్క్సిస్టులే భుజాన మోశారు కదా. అజంతా మాత్రం నిజమే చెప్పాడు. ‘‘అశ్రు గంగాజలాలలో అగ్నిసుందరిని సృష్టించిన ఒకే ఒక కథకుడు’’ అని. అంతేకాదు ‘‘అతడే అతడే అతడు నడుస్తున్నంతమేరా కదం తొక్కుతున్న శబ్ద ధీర గంభీర జీవన కథా సరిత్సాగర ఘోష’’ అని కూడా ముక్తాయింపు ఇచ్చాడు అజంతా. అందుకే రావిశాస్త్రి నిజంగా ఒకే ఒక్కడు. వన్ అండ్ ఓన్లీ. ఆయన పుట్టి వందేళ్ళు అంటున్నారు. ఇలాంటి రచయితలు వందల సంవత్సరాలకి ఒకసారి పుడతారు. వందల వేల సంవత్సరాలు జీవిస్తారు. ఆయనకు నా పాదాభివందనాలు. - డాక్టర్ ప్రసాదమూర్తి కవి, జర్నలిస్ట్ భూమ్మీద మనిషికి ముఖ్యమైన పనులు రెండే రెండు. ఒకటి: దొంగ తనం చేయడం. రెండు: దొంగల్ని పట్టుకు శిక్షించడం (తలుపు గొళ్ళెం కథ). రాచకొండ విశ్వనాథశాస్త్రి సాహిత్య సారమంతా ఈ రెండు వాక్యాల్లోనే ఇమిడి ఉంది. అంతేకాదు మనిషి జీవితం, మానవ చరిత్ర కూడా అందులోనే ఉన్నాయని కూడా ఆయన అన్నారు. అలాంటి జీవితాలు, జీవిత చరిత్రలు ఆయన రచనా సాగరమంత మేరా పరుచుకున్నాయి. నూరేళ్ల రావిశాస్త్రికి మనం ఏ రకంగా నివాళులర్పించగలం? రావిశాస్త్రి గొప్పతనమూ, కళా నైపుణ్యమూ ఎక్కడు న్నాయంటే... వైవిధ్యమైన వస్తు స్వీకరణలోనూ, అనితర సాధ్యమైన శిల్ప నైపుణ్యంలోనూ. రచయితగా రావిశాస్త్రికి అనుకూల అంశం ఆయన ‘జీవితకాలం’. పుట్టి పెరిగిన కాలం ఆయనకు కలిసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి న్యాయ కళాశాలలో విద్యార్థిగా జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాడు. కాలిక స్పృహ ఉన్నవాడు కాబట్టే ఆ చారిత్రక సందర్భాన్నీ, సంధి కాలాన్నీ చాలా గడుసుగా ఒడిసి పట్టుకున్నాడు. తత్వ, న్యాయ శాస్త్రాల అధ్యయనం వల్ల సామాజిక చలన సూత్రాలను మా బాగా ఆకళింపు చేసుకున్నాడు. ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క’... అన్న ప్రజాస్వామిక భావన ఆచరణలో విఫలమైందని స్వాతంత్య్రం వచ్చిన పుష్కర కాలానికి తెలియ వచ్చింది. శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థల పనితీరులో డొల్లతనం అవగతం అయింది. అంతకుముందు కష్టార్జితం, కోర్టుకు రాని సాక్షులు, నల్ల మేక, అధికారి, పువ్వులు వంటి కథలు రాసినా వర్గ దృక్పథం బల పడింది ఈ సమయంలోనే. ఆ తరువాత వెలువడినవే ‘ఆరుసారా కథలు’. సారా కథలతో తెలుగు కథా సాహిత్యం సారవంతమయింది. అంతవరకు కానరాని కొత్త శిల్ప మర్మమేదో వాళ్ళ కంటికి జిగేల్ మని తాకింది. సారా కథలను సేవించిన శ్రీశ్రీ తన కొంగ్రొత్త అనుభూతికి ‘రసన’ అని నామకరణం చేశాడు. రచయితగా ఆయన న్యాయవాద వృత్తి సాహిత్య సృజనకు ఒక శాస్త్రీయమైన భూమికనిచ్చింది. ‘పతితులార భ్రష్టులారా’ అని శ్రీశ్రీ ఎవరినైతే ఓదార్చాడో వాళ్ళనే రావిశాస్త్రి అక్కున చేర్చుకున్నాడు. రాజు మహిషి, రత్తాలు రాంబాబు, మూడు కథల బంగారం, సొమ్మలు పోనాయండి లాంటి నవలలు; ‘నిజం’ లాంటి నాటకం ఆ నేపథ్యంలో నుంచి వచ్చినవే. ఆ పరంపరలో పుట్టినవే. ఇంట్లో, సంసారంలో, సెక్స్‌లో పడి కొట్టుకుంటున్న కథని వీధిలోకి తీసుకొచ్చానని మాత్రమే చెప్పే రావిశాస్త్రి నిజానికి చేసిన పని అంతేనా? పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్లు తిప్పినట్టు, కథ కాళ్ళకి బలపం కట్టి వాడల్లో, గుడిసెల్లో తిప్పిన చోట తిప్పకుండా తిప్పాడు. తన భాషా పాటవమంతా పాటకజనం నుంచే స్వీకరించాడు. మాకూ ఉన్నాడు ఒక మహా రచయిత అని తెలుగువాడు బోరవిరుచుకునేటట్టు రచనలు చేశాడు. ఆయన పేదలపక్షమే వహించాడు. ‘మనం పేదవాళ్ళం రా’ అని చిన్ననాట తల్లి ఏరోజైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఆ మరణాంతం మరిచిపోలేదు. అందుకే రత్తాలు, నూకాలు, ముత్యాలమ్మ, పోలమ్మ, బోడి గాడు లాంటి అల్పజీవుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాళ్లకి జీవితం పొడవునా కొండంత అండగా నిలబడ్డాడు రాచకొండ. సార్వ భౌమారావు, మందుల భీముడు, రాజయోగి, భీమసేనారావు, లక్ష్మినాథరావు లాంటి కుహనా పెద్ద మనుషుల ‘మాయ’, ‘మోసం’ బయటపెట్టి బోనెక్కించాడు. లోకానికి ‘నిజం’ తెలియజేశాడు. రావిశాస్త్రి విరసం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కొంతకాలం బాధ్యత వహించాడు. తర్వాత విరసంలో లేకపోయినా చివరంటా విరసంతోనే ఉన్నాడు. రచనలు చేసిన నేరానికి ఎమర్జెన్సీలో జైలుకెళ్లి అక్కడ కూడా ఆ ప్రక్రియనే కొనసాగించాడు. చివరి నవల ‘ఇల్లు’ రాసి చివరాఖరికి సొంత ఇల్లు లేకుండానే జీవితాన్ని ముగించాడు. అసలు సిసలైన మార్క్సిస్ట్ రచయితగా నిలబడి బతికాడు. (చదవండి: అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!) - జి.ఎస్. చలం సాహితీ విమర్శకుడు -
ఆసియా జట్టులో కోహ్లి
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రహమాన్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న రెండు మ్యాచ్‌ల ప్రత్యేక టి20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పాల్గొనే అవకాశం ఉంది. ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య మార్చి 21, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. కోహ్లి దీనిని అధికారికంగా ధ్రువీకరించకపోయినా అతను కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఆడతాడని సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చించిన తర్వాత దీనిపై కోహ్లి స్పష్టతనిస్తాడు. భారత జట్టు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో మార్చి 18న చివరి వన్డే ఆడనుండగా... మార్చి 29న ఐపీఎల్ ప్రారంభమవుతుంది. తన బిజీ షెడ్యూల్ నుంచి కోహ్లి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంది. కోహ్లి ఒక మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. మరో నలుగురు భారత క్రికెటర్ల పేర్లు మాత్రం ఖరారయ్యాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వెల్లడించింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లతో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ఆసియా ఎలెవన్ టీమ్‌లో ఉంటారు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతున్నందున ఆ దేశపు ఆటగాళ్లను ఆహ్వానించడం లేదు. వరల్డ్ ఎలెవన్ జట్టు తరఫున డు ప్లెసిస్, గేల్, బెయిర్‌స్టో, పొలార్డ్ తదితరులు ఈ రెండు మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆసియా ఎలెవన్: కోహ్లి, రాహుల్, ధావన్, పంత్, కుల్దీప్, షమీ(భారత్), తిసారా పెరీరా, మలింగ (శ్రీలంక), ముజీబుర్ రహమాన్, రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), సందీప్ లమిచానె (నేపాల్), ముస్తఫిజుర్ , తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మహ్ముదుల్లా (బంగ్లాదేశ్). వరల్డ్ ఎలెవన్: అలెక్స్ హేల్స్, బెయిర్‌స్టో (ఇంగ్లండ్), క్రిస్ గేల్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్), డు ప్లెసిస్, ఇన్‌గిడి (దక్షిణాఫ్రికా), ఆండ్రూ టై (ఆస్ట్రేలియా), మిచెల్ మెక్లీనగన్ (న్యూజిలాండ్). -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
మారణకాండకు వందేళ్లు : రూ.100 నాణెం విడుదల
అమృతసర్ : జలియన్ వాలాబాగ్ మారణహోమం జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నబిట్రీష్ దుశ్చర్యకు వంద సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నాణేలను శనివారం విడుదల చేశారు. పంజాబ్‌లోని అమృతసర్‌లోని జలియాన్ వాలాబాగ్ స్మారకం వద్ద వెంకయ్యనాయుడు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం స్మృతి చిహ్నంగా కొత్త వంద రూపాయల నాణేన్ని, స్టాంప్‌ను రిలీజ్ చేశారు. కాగా భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జనలర్ డయ్యర్ ఆధ్వర్యంలో జరిగిన జలియన్ వాలాబాగ్ కాల్పుల్లో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా వందేళ్ళ తరువాత జలియన్‌వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్ ప్రధాని థెరిసా మే వ్యాఖ్యానించడం తెలిసిందే. -
‘జలియన్‌వాలాబాగ్ అవమానకరం’
లండన్: 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతం బ్రిటిష్ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. పలువురు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేసినట్లుగా ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు. ఈ నెల 13న జలియన్‌వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చలో ఆమె మాట్లాడారు. ‘ఆనాటి ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నాం. అయినా నేడు భారత్–బ్రిటన్ సంబంధాలు సంతృప్తికరం. బ్రిటన్ అభివృద్ధిలో భారతీయుల కృషి అమోఘం’ అని అన్నారు. స్వాతంత్య్రపోరాటంలో భాగంగా భారతీయులు రహస్యంగా సమావేశమైనప్పుడు జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సేనలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు. -
సమరం ముగిసి శతాబ్దం
పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్–ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు. ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్ చాంప్స్–ఎలైసెస్‌కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్‌తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్ విమర్శించడం తెలిసిందే. జాతీయవాదం వెన్నుపోటు వంటిది ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నివాళి భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం -
ఆదివాసీల చిత్రకళకు ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ తెగల్లోని ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కొలామీ, బంజార, కోయ వర్గాలకు చెందిన యువతను ఎంపిక చేసి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ చిత్రకారులు వేసిన చిత్రాలతో గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సెంటినరీ మ్యూజియం ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందు లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఔత్సాహిక చిత్రకారులు ప్రదర్శించారు. ప్రతి ఆదివాసీ తెగకున్న ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళ పునరుద్ధరణకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ని గిరిజనులు, ఆదివాసీల సంస్కృతికి సంబంధించి చిత్రకళ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనుల సంస్కృతిని చిత్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి కార్యాలయంలో పెయింటింగ్స్ ఆదివాసీ చిత్రకారుల చిత్రాలను ప్రతి ప్రభు త్వ కార్యాలయంలో ఉండేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో చిత్రకారులకు మంచి ఉపాధి లభించనుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఆదివాసీ చిత్రాలు కనిపించనున్నాయి. ప్రైవేటువ్యక్తులు సైతం వీటిని కొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌కు తగినట్లు ఔత్సాహిక చిత్రకారులకు సామగ్రిని యంత్రాంగం సరఫరా చేస్తోంది. -
శత వసంత హేల
-
చరిత్ర పుటలో చెరగని సంతకం
కొత్త కోణం 1970 నుంచి దాదాపు 20 ఏళ్ళపాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సాగిన విప్లవోద్యమం ఎన్నో సామాజిక మార్పులకు కారణమైంది. ఒక తరంపైన నిండైన ముద్రవేసిన ఆయన జీవితం, ఉద్యమం సమాజ గమనానికి దిక్సూచిగా నిలిచాయి. 1984 నవంబర్ 9న అజ్ఞాతవాసంలోనే గుండెపోటుతో కనుమూసేంతవరకు నిరంతరం విప్లవాన్నే కలలుగని, తుదిశ్వాస వరకు విప్లవాచరణలో నిమగ్నుడైన చండ్ర పుల్లారెడ్డి జీవితం భావి తరాలకు సర్వదా స్ఫూర్తిదాయకం. సమాజ గమనంలో తనదైన ముద్ర వేసి కాల చక్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యమాలను, విప్లవాగ్నులను రగులుస్తూ ముందుకు సాగుతుంది. సమాజ పురోగమనానికి ఒక్కో సమయంలో కొందరు వ్యక్తులు తోడ్పడుతుంటారు. ఆ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సమానత్వ సాధనకు, ప్రజలకు అర్పిస్తుంటారు. సమానత్వ సాధన దిశగా తెలుగునాట సమాజాన్ని ముందుకు నడిపించిన వ్యక్తుల ముద్రలు చాలానే ఉన్నాయి. ఒక తరంపై బలమైన ముద్రవేసిన చండ్ర పుల్లారెడ్డి వారిలో ఒకరు. 1960ల చివరిలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమ నాయ కులలో ఒకరైన ఆయన నాయకత్వంలోని ఉద్యమంతో పాటు, పీపుల్స్‌వార్ నాయకత్వంలో సాగిన ఉద్యమాలు సైతం సమాజ గమనాన్ని మార్చాయన డంలో సందేహం లేదు. చండ్ర పుల్లారెడ్డి శత జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాన్ని, ఉద్యమ ప్రభావాన్ని మననం చేసుకోవడానికే ఈ ప్రయత్నం. ఉద్యమ ప్రస్థానంలో తొలి దశ 1917 జనవరి 19న కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్ర పుల్లారెడ్డి ఇంజనీరింగ్ చదువు కోసం మద్రాసు వెళ్లారు. అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య తదితర కమ్యూనిస్టు నాయకులతో ఏర్పడ్డ పరిచ యాలు ఆయనను వలస వ్యతిరేక పోరాటంలో భాగం చేశాయి, కాలేజీ నుంచి బహి ష్కరణకు గురిచేశాయి. ఆ తర్వాత ఆయన పూర్తి కాలం కమ్యూనిస్టు కార్య కర్తగా మారారు. అప్పటికే తెలంగాణలో సాగుతున్న మహత్తర రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి బయలుదేరి, మార్గ మధ్యంలోనే అరెస్టు అయ్యారు. జైలులో ఉన్న ఆయన నాటి పార్టీ నాయ కత్వం తీసుకున్న సాయుధ పోరాట విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 1952 ఎన్నికల్లో నాటి మద్రాసు రాష్ట్రంలోని నందికొట్కూరు నుంచి కమ్యూ నిస్టు పార్టీ అభ్యర్థిగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రి యలో అప్పటికే తక్కువ విశ్వాసం ఉన్న ఆయన... ప్రజా ఉద్యమ సమీకర ణపైనేlదృష్టి కేంద్రీకరించేవారు. ఆ క్రమంలోనే ప్రముఖ నక్సలైటు నాయ కుడు తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేశారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చినప్పుడు ఆయన సుందరయ్య నాయకత్వంలోని సీపీఐ (ఎం) పక్షాన నిలిచారు. 1962 నాటి భారత–చైనా యుద్ధం సందర్భంగా చైనాను సమర్థించినందుకుగాను దేశ రక్షణ చట్టం కింద 1964–66 మధ్య జైలు జీవితం గడిపారు. నగ్జల్బరీ, శ్రీకాకుళాల వెలుగున సాగిన విప్లవ నేత ఆ కాలంలో ఆయన జైలులో సాగించిన అధ్యయనం, రచనా వ్యాసంగం కమ్యూనిస్టు విప్లవోద్యమానికి చాలా తోడ్పడింది. నాటి కీలక అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా రష్యా–చైనా విభేదాల విషయంలో కార్యకర్తలను చైతన్యవంతం చేయడానికి సహచర నాయకుడు మానికొండ సుబ్బారావుతో కలిసి ఆయన ‘‘ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం–దాని పరి ణామాలు’’ అనే గ్రంథాన్ని రాశారు. చైనాలో మావో ప్రారంభించిన ‘గ్రేట్ డిబేట్’లో చర్చకు వచ్చిన తొమ్మిది విషయాలపై ‘‘రష్యా–చైనా వాద నలు’’అనే పుస్తకాన్ని రాశారు. మావో సూక్తులను తెలుగులోకి అనువాదం చేసి. అచ్చు వేయించారు. ఇలా అధ్యయనం, రచనా వ్యాసంగం ఒకవైపు సాగిస్తూనే పుల్లారెడ్డి... చైనాకు వ్యతిరేకంగా క్రమక్రమంగా సీపీఐ (ఎం) తీసుకొస్తున్న వాదనలను పసిగట్టి, బహిరంగపరిచారు. అనతికాలంలోనే దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్యలతో కలిసి విప్లవకారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోని పని మీదనే ఉండేది. ఆనాటికే పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీలో చారు మజూందార్ నాయకత్వంలో సాగుతోన్న రైతాంగ ఉద్యమం పుల్లారెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేసింది. తెలంగాణలోని ములుగు అటవీ ప్రాంతాన్ని ఆయన తన మొదటి ఉద్యమ స్థానంగా ఎన్ను కున్నారు. అందుకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ‘‘వీర తెలంగాణ విప్లవ పోరాటం–గుణ పాఠాలు’’ అనే పుస్తకాన్ని రాశారు. అదే సమయంలో శ్రీకాకుళ రైతాంగ పోరాటంతో సంబంధాలను పునరుద్ధరించారు. అప్పటికే ఎంతో మంది నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. అంతటి నిర్బంధంలో కూడా ఆయన ఇంకా కార్యాచరణలో ఉన్న నాయ కులను, కార్య కర్తలను సమన్వయం చేశారు. శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పైలా వాసుదేవరావుతో కలిసి కమిటీని ఏర్పరి చారు. ఆ విధంగా చండ్ర పుల్లారెడ్డి శ్రీకాకుళ పోరాటాన్ని అనేక ఒడిదుడుకుల తర్వాత కూడా సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వంలో సాగిన ఉద్యమాల్లో నాలుగు ప్రధానమైనవి. ఒకటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి గిరిజన పోరాటాలు. రెండవది కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నిజామాబాద్ మైదాన ప్రాంతాల్లో సాగిన రైతుకూలీ పోరాటాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు. మూడవది విద్యార్థి ఉద్యమం, నాల్గవది పట్టణ మధ్యతరగతి వర్గాలైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలను సమీకరించడం. మార్పును మోసుకొచ్చిన విప్లవ వెల్లువ 1968లో చండ్రపుల్లారెడ్డి నాయకత్వంలోని పార్టీ ములుగులో అడుగు పెట్టే నాటికి ఆదివాసీల పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. బాగా పంటలు పండే మాగాణి భూములన్నీ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారి అధీనంలో ఉండేవి. గిరిజనుల చేతుల్లో ఉన్నవి పోడు భూములే. పైగా ఫారెస్టు అధి కారులు గిరిజనులను క్రూరంగా దోపిడీ చేసేవారు. ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం కర్రను ముట్టనిచ్చేవారు కారు. వంటచెరుకు కోసం అడవిలో కర్రలు ఏరినా జరిమానాలకు, చిత్రహింసలకు గురిచేసే వారు. ఇక పటేల్, పట్వా రీలు గిరిజన తండాల మీద పడి బియ్యం, జొన్నలు పప్పు, నెయ్యి, కోళ్లు, డబ్బులు లంచాలుగా గుంజుకునేవారు. వెట్టి చాకిరీ చేయించుకునేవారు. షావుకారులు ఉప్పు, కిరోసిన్ ఇచ్చి గిరిజనులు సేకరించిన అటవీ ఉత్ప త్తులను దోచుకునేవారు. షావుకారులు, అడవిని ఆనుకొని ఉన్న భూస్వా ములు అప్పులు ఇచ్చి గిరిజనుల భూములను, వస్తువులను కారు చౌకకు కాజేసేవారు. పుల్లారెడ్డి నాయకత్వంలో అడవిలో అడుగుపెట్టిన ఉద్యమం గిరిజనులను సమీకరించింది. చైతన్య పరిచింది. దాదాపు మూడు లక్షల ఎకరాల సాగుభూమిని గిరిజనులు సొంతం చేసుకోగలిగారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో 1970ల నాటికి కూడా అంటరానితనం వికృత రూపంలో ఉండేది. దళితుల భూములను కబ్జా చేయడం, వెట్టిచాకిరీతో శ్రామికుల రక్తమాంసాలను దోచుకోవడం ఆనాడు సర్వసాధారణం. గ్రామాల్లో దళితులు చెప్పులు వేసుకొని నడవడానికి, బీడీలు తాగడానికి, లుంగీ కట్టుకొని పోవడానికి వీలులేదు. ఇక గొల్ల, గౌండ్ల, చాకలి, మంగలి లాంటి కులాల వారంతా భూస్వాములకు వెట్టికి అన్నీ సమర్పించాల్సిందే. ఉచితంగా సేవలు చేయాల్సిందే. అడిగితే తన్నులు, గుద్దులు, హత్యలే. కరీంనగర్ జిల్లాలో సాగుతోన్న ఈ దౌర్జన్యాలకు వ్యతి రేకంగా వెల్లువెత్తిన పోరాటాలకు సిరిసిల్ల ప్రాంతంలోని నిమ్మపల్లి పురుడు పోసింది. అదే సమయంలో జగిత్యాల ప్రాంతంలోని మద్దునూరులో పీపుల్స్ వార్ పార్టీ ఇటువంటి ఉద్యమాన్నే చేపట్టింది. దౌర్జన్యాలు చేస్తున్న భూస్వా ములు గ్రామాలను వదిలారు. వెట్టి చాకిరీ రద్దయింది. అంటరాని తనం పూర్తిగా పోకపోయినా, దళితుల్లో చైతన్యం పెరిగింది. భూమి సంబంధాలలో మార్పు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1987లో అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1987 పంచాయతీ రాజ్ ఎన్నికల్లో మార్పులు తీసు కొచ్చింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించింది. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో వచ్చిన సామాజిక, రాజకీయ, చైతన్యానికి తోడుగా ఈ రిజర్వేషన్లు అప్పటి వరకు సాగిన రెండు మూడు కులాల రాజకీయ గుత్తాధిపత్యానికి తెర దించాయి. అప్పటి వరకు గ్రామాలకు పరిమితమైన ఆధిపత్య కులాల వారు పట్టణాలకు తరలిపోయి, ఇతర వృత్తులు, వ్యాపారాల్లో ప్రవేశించి గతంకన్నా ఆర్థికంగా పుంజుకున్నారు. అలా ఈ ఉద్యమం తెలంగాణలోని గ్రామీణ సంబంధాలను సమూలంగా మార్చివేసింది. భవితకు దిక్సూచి 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన అనంతరం ఏర్పడిన ప్రజాస్వామిక వాతా వరణం పట్టణాలలోని మధ్యతరగతి వర్గాన్ని, గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థి లోకాన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లోకి ఆకర్షించింది. ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, గాంధీ, ఉస్మానియా కాకతీయ వైద్య కళాశాలలు ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాలకు నెలవుగా ఉండేవి. అదేవిధంగా ఆంధ్రప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న జవహర్ భారతి కళాశాలలో ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమం బలమైన స్థానాన్ని సాధించింది. విద్యార్థి ఉద్యమంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో వచ్చిన ప్రజాస్వామిక చైతన్యం తదనంతర సామాజిక రాజకీయ మార్పులపై ఎంతో ప్రభావాన్ని చూపింది. 1996 తరువాత ముందుకు వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నాయకత్వం ఈ ప్రజా స్వామిక చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్నదే. 1970 నుంచి దాదాపు 20 ఏళ్ళపాటు తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సాగిన విప్లవోద్యమం ఎన్నో మార్పులకు కారణమైంది. ఒకతరంపైన నిండైన ముద్రవేసిన చండ్రపుల్లారెడ్డి జీవితం ఆయన సాగించిన ఉద్యమం సమాజ గమనానికి ఒక దిక్సూచిగా నిలిచింది. 1984 నవంబర్ 9న అజ్ఞాతవాసం లోనే గుండెపోటుతో కనుమూసేంతవరకు నిరంతరం విప్లవాన్నే కలలుగని, తుదిశ్వాస వరకు విప్లవాచరణలో నిమగ్నుడైన చండ్ర పుల్లారెడ్డి జీవితం భావి తరాలకు సర్వదా స్ఫూర్తిదాయకం. (నేడు చండ్ర పుల్లారెడ్డి శతజయంతి) మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
హరిత విప్లవ ప్రధాత ఇందిరాగాంధీ
- పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోడుమూరు రూరల్ హరిత విప్లవ ప్రధాత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని పీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ శతజయంతిని పురస్కరించుకొని కోడుమూరులో శనివారం తలపెట్టిన రైతు మహాసభ సభా స్థలాన్ని శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు రఘువీరెడ్డి, ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడారు. కరువుతో అల్లాడుతున్న భారతదేశంలో హరిత విప్లవానికి ఇందిరమ్మ నాంది పలికారన్నారు. హరిత విప్లవంతో దేశంలో 50మిలియన్ మెట్రిక్ టన్నులున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 270మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా సాధించిన విజయాలపై ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా మొదటి రైతు మహాసభను కోడుమూరులో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమ వివరాలు.. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 8:30గంటలకు స్టేట్ గెస్ట హౌస్‌కు ఏఐసీసీ బృందం చేరుకుంటుంది. 8:45 జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాళ వేసి శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. 9గంటలకు ఇందిరాగాంధీ, దామోదరం సంజీవయ్య విగ్రహాలకు పూలమాళలు వేస్తారు. 10గంటలకు కోడుమూరు చేరుకొని మొండికట్టవాగు నుంచి ఎద్దులబండ్లతో భారీ ర్యాలీతో కోట్ల సర్కిల్ చేరుకుంటారు. 10:30కు కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహానికి పూలమాళ వేసి ఇందిరమ్మ బెలూన్లను విడుదల చేస్తారు. 11గంటలకు మహాత్మగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాళలు వేసి సభా స్థలికి చేరుకుంటారు. 11నుంచి 2గంటల వరకు రైతులనుద్దేశించి బహిరంగ సభ, మధ్యాహ్నా భోజనం అనంతరం లద్దగిరిలో ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల కమిటీలతో సమావేశం జరుగుతుంది. విలేకరుల సమావేశంలో కిసాన్ సెల్ రాష్ట్ర చైర్మన్ రవిచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, గ్రామ సర్పంచు సిబి.లత పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ చర్య – పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే పెద్ద నోట్లను రద్దు చేయడం పిచ్చి తుగ్లక్ చర్యగా పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభివర్ణించారు. శుక్రవారం కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంతకు ముందు రెండుసార్లు పెద్దనోట్ల రద్దు జరిగినా అవి తక్కువ శాతంలో ఉండటం వల్ల సమస్య రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న 14 శాతం చిన్ననోట్లతో ప్రజల అవసరాలు ఎలా తీరతాయనే ముందు చూపు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. మోదీ వేసిన బాణం పెద్దలకు కాకుండా పేదలకు గుచ్చుకుందన్నారు. -
విద్యతోనే కురుబల అభ్యున్నతి
∙ఐక్యంగా హక్కులను సాధించుకుందాం ∙కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం పిలుపు ∙ఘనంగా కనకదాస జయంతి అనంతపురం రూరల్: విద్యతోనే కురుబల ప్రగతి సాధ్యమవుతుందని , ఆదిశగా ప్రతి కురుబ కులస్తుడు తమ పిల్లలను ఉన్నత చదువు చదివించాలని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం సూచించారు. ఆదివారం కురుబ యువత ఆధ్వర్యంలో భక్త కనకదాస 529 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కురుబలు వివిధ వేషధారణలతో అనంతపురం ఆర్‌్ట్స కళాశాల మైదానం నుంచి ర్యాలీగా గుత్తిరోడ్డులోని కనకదాస విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాగే పరుశురాం మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో సైతం కురుబలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఇందుకు చదువు లేకపోవడమే కారణమన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న ఏకైక కులం కురుబలేనన్నారు. హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా ప్రభుత్వాలపై పోరాటం చేసి సాధించు కొవాలన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ కనకదాస జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కురుబల కార్పొరేష¯ŒS ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కురుబలు రాజకీయంగా అభివృద్ధి చెందారంటే ఒక్క విద్యతోనే సాధ్యం అయిందన్నారు. కనకదాస జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బత్తలపల్లి ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, రాప్తాడు సర్పంచ్ వెంకటరాముడు మా ట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ లు కురుబలకు 7 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డి మాండ్ చేశారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీష్, బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కురుబల హక్కుల సాధన.. ఐక్య పోరాటలతోనే సాధ్యం అవుతాయన్నారు. -
చిన్న కథల పెద్దాయన
చాసో శతజయంతి ముగింపు- జనవరి 17 తెలుగు కథ వల్ల కొంత మంది వెలిగారు. తెలుగు కథను కొంతమంది వెలిగించారు. చాసో రెండో కోవకు చెందిన సృజనకారుడు. ఆయన వల్ల కథ వెలిగింది కానీ కథ ద్వారా ఆయన వెలగలేదు. వస్తువు, శైలి, శిల్పం, స్థానికత వీటన్నింటి గురించి శ్రద్ధ పెట్టిన కథకుడు ఆయన. ఏ విధంగా చూసినా చాసో తన జీవితంతోనూ రచనా జీవితంతోనూ భావితరాలకు ఒక మార్గం వేశారు. ఆ మార్గంలో నడవడంలోనే భవిష్యత్తు ఉంది. ‘తొమ్మిదేళ్లవాడు. సామ్యం చెప్పినట్టొచ్చింది నీ మూడుమూర్తులు. వచ్చాక చూద్దువుగాని. ఎలాగో నన్నుద్ధరించేవు. నీ వరప్రసాదం ఉండబట్టి ఆయన గణించిన డబ్బు, పిత్రార్జితం దఖలు పడ్డాయి. లేకపోతే నా మరుదులు ముండను చేసి మూల కూర్చో బెడుదురు’... ‘పోనీయ్యండి. నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది. ఇహ నా ఫిడేలుండి నన్ను రక్షిస్తుందా? సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది. తల్లి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ తల్లి తల్లిగుణాన్ని చూపించుకుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్లిపోతూ నాకో చీర రవికెల గుడ్డా పెట్టింది’... ‘నాయుడు పెట్టిన డబ్బుతో చదువుకున్నావు. అందుకే ఆ వెధవ ఉద్యోగమైనా చేస్తున్నావు. అతని అన్నమే తిని, అతని బట్టే కడుతున్నావు. నేనేం ద్రోహం నీకు చేశాను? వాణ్ణి దోచి నీకు పెడుతున్నాను, పుస్తె ముడి వేసిన మొగుడివి కదా అని. నాకే ద్రోహబుద్ధి ఉంటే వాడితో లేచి పోనూ? ’.... గుర్తొచ్చాయా పై మూడు మాటలు ఏ కథల్లోవో? నాలుగు ముక్కల్లో లోకరీతిని మన ముందుంచిన ఈ మాటలు చాసోగా మనం పిలుచుకునే చాగంటి సోమయాజులు రాసిన వివిధ కథల్లోవి. ఈ జనవరి 17 నాటికి చాసో పుట్టి వందేళ్లు అవుతుంది. కొత్తల్లో చాసో ఇంగ్లిష్‌లో కవిత్వం రాశారు. చక్కటి మీటరు, వర్డ్స్‌వర్త్ డిక్షన్‌లా ఉన్న చాసోగారి కవిత్వానికి ఇంగ్లిష్, ఫ్రెంచ్ పండితుడు, ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఆచార్య రోణంకి అప్పలస్వామి 1930ల్లో పడిపోయారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారి చాసోగారి మేడగదికి తీసుకువెళ్లింది. తోడు కవి నారాయణబాబు. అడపా దడపా శ్రీశ్రీ. మధ్యలో మరీ కుర్రకవి ఆరుద్ర. ఇక సాహిత్యం, ప్రపంచ సాహిత్యం, సర్రియలిజం లాంటి కొత్తరీతులు... అవే తిండి, తాగుడు, ఊపిరి, ప్రాణం. వీటికి తోడు అరసంతో అనుబంధం. ఈ అనుభవాలన్నీ చాసోని గొప్ప ప్రపంచస్థాయి కథకుణ్ణి చేశాయి. అన్ని రకాల మనుషుల్ని దగ్గరగా చూడటం, వారి రీతుల్ని, పోకడలని, భాషని, భావాల్ని అవగాహన చేసుకుని కథలుగా మలిచారు. కథలు కల్పితాలు కావచ్చు. కాని కథల్లోని పాత్రలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సజీవాలే. చాసో తాను రాసిన కథల్లో తనకు నచ్చిన కథలు ఇవీ అని ఎంచుకున్నవి నలభై. అందులో మనల్ని కట్టి పడేసేవి ఓ ముప్పై. కవిత్వంలో హైకూల్లా ఆయన కథలు చిన్నగా ఉండి, జీవిత సారాన్ని నాలుగు ముక్కల్లో మన ముందు ఉంచుతాయి. ఏ కథలోనైనా ఈ వాక్యం, ఈ పదం, ఈ వర్ణన అనవసరం అనే ఉదాహరణ లేదు. ఆయన కథలు ‘ఇదీ సంగతి’ అని విషయాన్ని మన ముందుంచుతాయి. అంతేకాని రచయిత పాత్రలో దూరిపోయి ఉపన్యాసాలు ఇవ్వడం, నీతులు చెప్పటం చెయ్యడు. చాసో కింది వర్గాల గురించి రాసిన కథల్లో ‘కుంకుడాకు’ ఒక చక్కటి కథ. కటిక బీదరికం. రాలిన కుంకుడాకులు ఏరుకుని వెళితేగాని పొయ్యి వెలగదు. పొయ్యి మీదికి వాళ్ల అయ్య ఏదైనా తెస్తేనే ఆ రోజుకి తిండి. కుంకుడాకులతో పాటు చింత తోపులలో దొరికిన ఎండుపుల్లల్ని కూడా ఏరుకుంటుంది గౌరి. దొంగతనం అంటగట్టి చావగొడతాడు చింతతోపు యజమాని. గౌరి ఆత్మాభిమానంతో పుల్లల్ని అక్కడే పడేసి కుంకుడాకులు మాత్రం తీసుకెళ్తుంది. ఈ కథ ఇంగ్లిష్‌లో అనువదింపబడి చాలా పేరు తెచ్చుకుంది. పస్తులున్న పిల్లల కోసం పర్మిట్ లేకుండా బియ్యం పట్టుకెళుతోందని ముసలిదాని వెంటపడతాడు రైల్లో టి.సి. ‘కుక్కుటేశ్వరం’ కథలో. రాసేటప్పుడు శిల్పం ఎలా ఉండాలి అని తెల్సుకోవాలంటే ఈ కథని ఒక పాఠంలా చదవాల్సిందే. ‘కుంటాణ్ణి’ కట్టుకుంటే ఏముంది? ‘గుడ్డాడు’ అయితే నలుగురూ జాలిపడి ఇంత పడేస్తారు. వాడు గుడ్డాడు కాబట్టి ‘ఎర్రి’ తన ముచ్చట్లు తీర్చుకోవచ్చు. ఇంతటి జీవన సత్యాన్ని చెప్పిన కథ ‘ఎంపు’. మధ్యతరగతి జీవితాన్ని తడిమే కథల్లో ‘ఏలూరెళ్లాలి’ ఎప్పటికీ మర్చిపోలేని కథ. ఆ అభాగ్యురాలికి అంత లోకజ్ఞానం ఉండబట్టే బట్టకట్టి నిలబడగలిగింది. లేకపోతే విధవరాళ్ల విషాదగాథల్లో చేరుపోను. ‘వాయులీనం’ కథలో చాలీచాలని జీతపురాళ్లతో కాలం వెళ్లదీసే భర్త, భార్యకు రోగం వస్తే ఆవిడ ప్రాణంగా దాచుకున్న ఫిడేల్ని స్నేహితుని సలహాతో అమ్మేసి ఆ డబ్బులతో ఆవిడ ప్రాణం కాపాడుకున్న తీరు మనల్ని కన్నీటి పొరలలో ముంచుతుంది. కొడుకు చదువు కోసం చుట్టలు తాగడం మానేసిన తండ్రి కథ ‘ఎందుకు పారేస్తాను నాన్నా’.. మనల్ని ఎంతో గాయపరుస్తుంది. చెప్పేదేమంటే ఆయన కథలు సమయాన్ని బట్టి ‘కోట్’ చేయాల్సిందే. దశాబ్దాలు గడిచినా ఇది తప్పదు. ఇవేనా- స్కూలు రోజుల్లో అల్లరి పనుల్ని గుర్తు తెచ్చే ‘బ్బబ్బబ్బా’, కుమిలిఘాట్కి వెన్నెల్లో సౌందర్యాధన కోసం వెళ్లి భయంతో రాత్రిని చీకటి చేసుకున్న మిత్రబృందం కథ ‘దుమ్ముల గొండి’, కూలికి కుదిరి మల్లెపొదలకి డబ్బులు పండించినా జబ్బు పడి తినడానికి తిండి లేక చచ్చిపోయిన ముసలాడి కథ ‘బొండు మల్లెలు’. బండలు కొట్టే కూలీ ప్రమాదంలో పోతే డబ్బుతో చావు సర్దుబాటు చేసి పంచుకున్న కథ ‘బండపాటు’. కొడుకుని బట్టల షావుకారికి పెంచుకోవడానికి ఇచ్చి, ఆఖరి చూపు కోసం వచ్చి షాపు మెట్ల మీదే చనిపోయిన గుడిశేటి గున్నమ్మ కథ ‘పోనీ తిను’.. ఇలా మరిన్ని కథలు. దేని గొప్పతనం దానిదే. తెలుగు కథకు ఒంపుసొంపుల్ని దిద్ది కథ అంటే ఇలా ఉండాలి అని నిర్వచించిన చాసో చిన్న కథల పెద్దాయన. మన భాష ప్రాంతీయభాష కావచ్చు. కాని మన కథలు అంతర్జాతీయ స్థాయివి అని నిరూపించిన వ్యక్తి. మీ దగ్గర ఎప్పుడో కొన్న చాసో కథల పుస్తకం ఉంటే తీసి మళ్లీ చదవండి. కాకపోతే కొత్తగా వచ్చిన ఎడిషన్‌లో పెద్ద అక్షరాలతో ఉన్న ఆ కథల్ని మరోసారి చదివి భుజానికెత్తు ్తకోండి. మన ‘మపాసా’, ‘మన చెహోవ్’ అని కొత్త తరాల వారికి అరచి మీరే చెప్పండి. మిమ్మల్ని మీరే గౌరవించుకోండి. - కృష్ణమోహన్‌బాబు 9848023384