ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం విడుదల చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము. పక్కన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
సాక్షి, న్యూఢిల్లీ: తన అసాధారణ వ్యక్తిత్వంతో దివంగత ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. రామాయణ, మహాభారతంలోని పాత్రలకు ప్రాణం పోసి భారతీయ సినిమా, సంస్కృతిని సుసంపన్నం చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై రూపొందించిన రూ.100 స్మారక నాణెంను ఆమె విడుదల చేసి మాట్లాడారు.
రిక్షా దిగి నేలకు నమస్కారం..
‘ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం ముద్రించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుకు తీసుకెళ్లారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు. ఓ గొప్ప వారసత్వానికి ఆమె వారసురాలు. ఎన్టీఆర్ తెలుగు సహా పలు భారతీయ భాషల్లో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు.
ఎన్టీఆర్ గురించి నా దృష్టికి వచ్చిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటున్నా. 70వ దశకంలో ఓ పెద్దావిడ తన కుమార్తెను చూసేందుకు మద్రాసు వెళ్లారు. అనంతరం మనవరాలితో కలసి రిక్షాలో వెళ్తుండగా ఓ వీధిలో జనం గుమి గూడటాన్ని చూశారు. ఆ వీధిలో ఎన్టీఆర్ ఉంటారని మనవరాలు చెప్పడంలో ఆమె వెంటనే రిక్షా దిగి భూమికి నమస్కరించారు. ఎన్టీఆర్ గురించి ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సామాన్యుల బాధను కూడా ఆయన తన నటనతో తెలియజేశారు.
మనుషులంతా ఒక్కటే సినిమా ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం సందేశాన్ని చాటి చెప్పారు. నటుడు, ప్రజా సేవకుడు, నాయకుడు ఇలా అన్నింటా ఆయన ప్రజాదరణ పొందారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు నేటికీ గుర్తుంటాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
అన్ని తరాలకు ఆదర్శ హీరో: పురందేశ్వరి
తన తండ్రి ఎన్టీఆర్ ఒక్క తరానికి మాత్రమే కాకుండా అన్ని తరాలకు ఆదర్శ హీరో అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్రతోపాటు మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.
నేటి నుంచి మూడు చోట్ల విక్రయాలు
ఎన్టీఆర్ స్మారక నాణెం మంగళవారం నుంచి హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని మింట్ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి స్మారకార్ధం నాణెం హైదరాబాద్‌లో రూపొందించడం ఇదే తొలిసారని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్‌ఆర్ నాయుడు చెప్పారు. నాణెం తయారీలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ వినియోగించామన్నారు.
రూ.100 నాణెం అయినప్పటికీ దీని ధర రూ.3,500 నుంచి రూ.4,850 వరకు ఉండవచ్చన్నారు. ప్యాకింగ్ మెటిరియల్‌ను బట్టి ధర వేర్వేరుగా ఉంటుందన్నారు. స్మారక నాణెం కాబట్టి చెలామణీలో ఉండదని స్పష్టం చేశారు. తొలి విడతలో 12 వేల నాణేలను రూపొందించామని, 50 వేల నాణేల వరకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్, చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద విక్రయాలు నిర్వహిస్తామని తెలిపారు.
జీవిత విశేషాలతో వీడియో..
ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల వీడియోను రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ప్రదర్శించారు. స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు, ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment