సమరం ముగిసి శతాబ్దం | World leaders gather in Paris to mark end of WW1 | Sakshi
Sakshi News home page

సమరం ముగిసి శతాబ్దం

Published Mon, Nov 12 2018 3:32 AM | Last Updated on Mon, Nov 12 2018 9:35 AM

World leaders gather in Paris to mark end of WW1 - Sakshi

సంస్మరణ కార్యక్రమానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జర్మనీ చాన్స్‌లర్‌ మెర్కెల్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టా, రష్యా అధ్యక్షుడు పుతి¯Œ., వెంకయ్య నాయుడు

పారిస్‌: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్‌ ట్రంప్, వ్లాదిమిర్‌ పుతిన్, ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌లు, రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్, జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్‌ ట్రూడో, బెంజమిన్‌ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్‌–ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్‌ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్‌ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్‌ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్‌ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్‌నోన్‌ సోల్జర్‌ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు.  

ఫ్రాన్స్‌ జాతీయగీతంతో ప్రారంభం
నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్‌ చాంప్స్‌–ఎలైసెస్‌కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్‌ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్‌ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్‌తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్‌.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్‌ విమర్శించడం తెలిసిందే.

జాతీయవాదం వెన్నుపోటు వంటిది  
ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్‌ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్‌ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

మోదీ నివాళి
భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్‌ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్‌ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌ చేస్తూ ‘భారత్‌ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ కాన్‌బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement