puthin
-
ఇప్పుడు మాట్లాడొచ్చా?
ట్రంక్ కాల్ నాటి ‘ఎదురు చూసే’ కాలం మళ్లీ వచ్చేసింది! మీ కాంటాక్ట్ లిస్ట్ లోంచి ఏదో ఒక నెంబర్ కి కాల్ చేసి చూడండి. ‘వేరొక కాల్ లో బిజీ గా ఉన్నారు’ అని వినిపిస్తుంది. నిజమే. ఒక మనిషి ఇంకో మనిషికి నేరుగా అయినా కనెక్ట్ ఆవుతారేమో, ఫోన్ లైన్లో మాత్రం వెంటనే కాంటాక్ట్‌లోకి రావడం అన్నది ఏ యుగానికో సంభవించే ఒక భూగోళ అద్భుతం అన్నట్లుగా అయింది! మనకే ఇలా ఉంటే మరి దేశాధినేతలు ఫోన్లో ఒకరికొకరు ఎలా దొరుకుతారు? ఫోన్ చేసి, ‘ఎవరు మాట్లాడేది?‘ అని అడిగే మానవాళి మధ్యే కదా వాళ్లూ జీవిస్తున్నది. వాళ్లకూ రాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుందా? జిన్‌పింగ్ జర్మనీ చాన్స్‌లర్‌తో ఇప్పటికప్పుడు మాట్లాడాలంటే ఎలా? ఇద్దరు దేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకోవాలంటే వాళ్లకన్నా ముందు ఎంతమంది ఆ ఇద్దరికి లైన్ కలపడం కోసం ఫోన్లు చేసుకోవాలి? కొద్ది రోజులుగా పుతిన్ ప్రయత్నిస్తున్నా బైడెన్ ఫోన్ ఎత్తడం లేదని వదంతి!! అసలు దేశాధ్యక్షులు ఒకరికొకరు ఎలా ఫోన్ చేసుకుంటారు? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓసారి చూద్దాం. జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు ‘‘విదేశాంగ శాఖలు ఒక్కోసారి ఎంత గుడ్డిగా ఉంటాయంటే.. మనుషుల్లానే అవీను..’’ అని న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం చేయని కొత్తల్లో ఒక వార్త రాసింది. న్యూయార్క్ సిటీలోని ‘ట్రంప్ టవర్’కి ఫోన్ చేసేవారట విదేశాంగ కార్యదర్శుల సహాయకులు.. ట్రంప్‌తో కనెక్ట్ అవడం కోసం! బిజినెస్‌మన్‌గా ఉన్నప్పుడు ట్రంప్ గానీ, ప్రెసిడెంట్ అయ్యాక మిస్టర్ ప్రెసిడెంటే కదా. ఆయన లైన్ కలవడానికి ముందు, ఆయనకు లైన్ కలపడానికి ముందు రెండు వైపులా పెద్ద టీమ్ పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు ఫోన్ చేయబోతున్నదీ ముందే తెలియాలి. ఫోన్ చేసి ఏం మాట్లాడబోతున్నదీ ముందే తెలియజెప్పాలి. అమెరికా అధ్యక్షుడితో కనుక తైవాన్ ప్రెసిడెంట్ ఫోన్లో మాట్లాడాలని అనుకుంటే, తైవాన్‌కీ, మిగతా దేశాలకు ఉన్న సంబంధాలు ఏమిటో కూడా అమెరికా అధ్యక్షుడికి తెలిసి ఉండాలి. ఇన్ని లెక్కలు ఉంటాయి! అయితే ట్రంప్ వేరు కదా, అధ్యక్షుడి సీట్లో కూర్చున్నాక అకస్మాత్తుగా ఓరోజు ఆయన.. ‘‘ఇప్పుడే త్సాయ్ ఇంగ్–వెన్‌తో ఫోన్లో మాట్లాడి వస్తున్నా’’ అన్నారు. ఇంగ్–వెన్ తైవాన్ అధ్యక్షురాలు. డొనాల్డ్ ట్రంప్,అమెరికామాజీఅధ్యక్షుడు వైట్ హౌస్‌లోని విదేశాంగ అధికారులు నివ్వెరపోయారు. నలభైఏళ్లుగా అమెరికా, తైవాన్ మధ్య సంబంధాలు లేవు. చైనాకు తైవాన్ అంటే పడదు కనుక అమెరికాకూ పడలేదు. ఆ సంగతి తెలియక ట్రంప్ మాట్లాడినట్లున్నారు. లేక, తెలిసే మాట్లాడారేమో! ఒక ప్రెసిడెంట్‌కి ఇంకో ప్రెసిడెంట్‌తో కానీ, ప్రధానితో కానీ డైరెక్ట్‌గా లైన్ కలవడానికి ముందు ఇన్‌డైరెక్ట్‌గా అనేకమంది అధికారుల మధ్య లైన్స్ కలవవలసి ఉంటుంది. అయితే చక్కటి స్నేహ సంబంధాలు ఉన్న రెండు దేశాల అధ్యక్షుల మధ్య ఫోన్ కాల్స్‌కి ఇంత తతంగం ఉండదు.. ‘‘మా ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్‌తో మాట్లాడతారట’’ అని డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫోన్ చేయగానే కాల్కి తక్షణం ఏర్పాట్లు జరిగిపోతాయి. జరిగాక కూడా, లైన్ కలిశాక కూడా.. ‘‘హాయ్ దిస్ ఈజ్ పుతిన్, ఈజ్ ఒబామా ఇన్’’ అనే ఒక ప్రారంభ వాక్యంతో సంభాషణ మొదలవుతుంది. పెద్దగా సంబంధాలు లేని దేశాల మధ్య అధ్యక్షులను ఫోన్లో కలిపే బాధ్యతనైతే రాయబారులు తీసుకుంటారు. ఎవరు, ఎందుకు, ఎంతసేపు మాట్లాడదలచిందీ వివరాలు వెళతాయి. ఇద్దరికీ కుదిరే టైమ్ చూసుకున్నాక లైన్ కలుస్తుంది. సంభాషణలో రాగల ప్రశ్నలకు సమాధానాలు కూడా ముందే సిద్ధమై ఉంటాయి! అంటే.. ఇద్దరు దేశాధ్యక్షులు ఫోన్లో మాట్లాడుకునే సంభాషణ ముందే జరిగిపోతుందన్నమాట! మర్యాదపూర్వకమైన ఫోన్ కాల్ అయితే మర్చిపోకుండా అడగవలసినవి కొన్ని ఉంటాయి. ఉదా: జబ్బున పడి కోలుకుంటున్న ప్రెసిడెంట్ భార్య లేక భర్త ఆరోగ్యం ఎలా ఉందో అడగడం! కాల్కి ముందు వాటిని గుర్తు చేస్తారు కీలక సిబ్బంది. పర్సనల్ టచ్ కోసం! మరీ దేశభద్రతకు సంబంధించిన విషయమైతే.. ‘‘మీరొక్కరే ఉన్నారా’’ అనే మాటతో సంభాషణ మొదలై, అతి సంక్షిప్తంగా ముగిసిపోతుంది. అది కేవలం సమాచారాన్ని చేరవేయడమో, అనివార్యంగా తీసుకున్న ఒక నిర్ణయం గురించి తెలియజేయడమో అయి ఉంటుంది. వెంటనే లైన్ కట్. ప్రపంచాధినేతల మధ్య ఫోన్ కాల్స్ సంభాషణలు కనీసం కొద్దిమందికైనా తెలియకుండా పోవు. సహాయకులు, అనువాదకులు.. వీళ్లను దాటుకుని వాళ్ల మాటలు దాగలేవు. ఫోన్ సంభాషణలు సాధారణంగా ఇంగ్లిష్‌లోనే సాగుతాయి. మాతృభాషలో మాట్లాడవచ్చు కానీ, దేశానికది చిన్నతనంగా ఉంటుంది. అయినప్పటికీ అపార్థాలు రాకుండా, అపోహలు కలగకుండా ఉండటం కోసం ఇంగ్లిష్‌కు బదులుగా, అంతకన్నా తమకు బాగా వచ్చిన భాషలోనే అధ్యక్షులు మాట్లాడుతుంటారని వైట్ హౌస్‌లో లింగ్విస్ట్గా పని చేసిన కెవిన్ హెండ్టెల్ అంటారు. అమెరికా అధ్యక్షుడితో ఫోన్ మాట్లాడ్డమైతే లోపల ఉన్నవాళ్లకు కూడా కనాకష్టమైన సంగతి. అధ్యక్షుడు ఇలా చెయ్యి ముందుకు అని, అలా ఫోన్ అందుకుంటారు కానీ.. అలా అందుకోడానికి ముందు... అవతల ఉన్నది రైట్ పర్సనేనా అనేది చేసుకోడానికి వంద చెకింగ్లు జరిగి ఉంటాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిల్లరీ క్లింటన్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. ఓసారి ఆమె ఒబామాకు లైన్ కలపమని అడిగారు. ఆపరేటర్ కలపలేదు. ‘ఐ యామ్ హిల్లరీ క్లింటన్, హానెస్ట్లీ ఐ యామ్ అని చెప్పుకోవలసి వచ్చింది’ అని హిల్లరీ 2010 నాటి ఓ ఈ మెయిల్లో తన సన్నిహితులతో షేర్ చేసుకున్నారు. ఆపరేటర్లు అనుమానించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. తప్పు పట్టకూడదు కూడా. ఎందుకంటే.. ప్రెసిడెంట్లకు కొన్ని ప్రాంక్ కాల్స్ కూడా వస్తుంటాయి. ఆట పట్టించే కాల్స్. స్పెయిన్ మాజీ ప్రధాని మారియానోకు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చింది! స్పెయిన్ నుంచి వేరుపడాలని చూస్తున్న కేటలోనియా ప్రాంత వేర్పాటు వాద నాయకుడి గొంతుతో ఓ రేడియో ప్రెజెంటర్ సరదాగా చేసిన ఆ కాల్ని నిజం అనుకుని ఆపరేటర్ లైన్ కలిపారు! తర్వాత ఆ ఆపరేటర్ ఉద్యోగం ఉందో పోయిందో తెలీదు. మయామీలోని ఒక యూఎస్ రేడియో స్టేషన్ 2003లో ఒకేసారి ఒక తాజాను, ఒక మాజీని బుట్టలో వేసింది. పుతిన్, రష్యాఅధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫైడెల్ క్యాస్ట్రోలను కొంతసేపు కాల్ మాట్లాడుకునేలా ‘ఫ్రాంక్’ చేసింది! ఎల్ జోల్ అనే ఆ రేడియో స్టేషన్లో పనిచేసే ప్రెజెంటర్ మొదట క్యాస్ట్రో మాట్లాడున్నట్లుగా గొంతు మార్చి ఛావెజ్కి ఫోన్ చేశాడు. తర్వాత క్యాస్ట్రోకి ఫోన్ చేసి ఛావెజ్లా మాట్లాడాడు. ఆ సంగతిని క్యాస్ట్రో కనిపెట్టడంతో వివాదం అయింది. ఇలాంటివే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడొక వదంతి వినిపిస్తోంది. పుతిన్ ఫోన్ చేస్తుంటే బైడెన్ లిఫ్ట్ చెయ్యడం లేదని. బహుశా అది మీమ్ కావచ్చు. అయితే కొన్నాళ్లుగా జో బైడెన్ పుతిన్ మీద ఆగ్రహంతో ఉన్నారు. పుతిన్‌కి ఫోన్ చేసి తిట్టానని కూడా ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఏమైనా ఈ రెండు అగ్రరాజ్యాల అధినేతల సంభాషణలు ఫోన్ కాల్ స్థాయికి మించినవి. వీళ్లకో హాట్ లైన్ ఉంది. దశాబ్దాలుగా ఉంది. దాని పేరు ‘రెడ్ టెలిఫోన్’. అయితే అది టెలిఫోన్ కాదు. ఒక ప్రత్యేకమైన, అత్యంత గోప్యమైన సమాచార వాహక వ్యవస్థ. ఆ హాట్ లైన్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు, రేఖాచిత్రాల రూపంలో మాత్రమే సంభాషణ జరిపేందుకు వీలవుతుంది. 1962లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు ఇలాంటి హాట్ లైన్ అవసరం అయింది. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు వచ్చాక కూడా ల్యాండ్ లైన్ల మీదే చాలావరకు దేశాధ్యక్షుల అధికారిక సంభాషణలు జరుగుతున్నాయి. -
ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, సిరిల్ రమఫోసా, జాయిర్ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు. నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు. -
సమరం ముగిసి శతాబ్దం
పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్–ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు. ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్ చాంప్స్–ఎలైసెస్‌కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్‌తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్ విమర్శించడం తెలిసిందే. జాతీయవాదం వెన్నుపోటు వంటిది ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నివాళి భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం -
‘ట్రంప్.. ఓ ఫ్యాన్‌బాయ్‌లా ప్రవర్తించారు’
వాషింగ్టన్ : రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు ఫిన్లాండ్లోని హెల్సింకిలో సమావేశమైన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇదొక మంచి ఆరంభమనుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని వ్యాఖ్యానించగా.. పుతిన్ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు. అయితే పుతిన్‌తో ట్రంప్ భేటీ గురించి ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ సెనేటర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోగ్రాఫ్ కోసం వెళ్లారా...? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందు.. ట్రంప్ ఓ ఫ్యాన్ బాయ్‌లా ప్రవర్తించారని ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ విమర్శించారు. ‘ట్రంప్.. పుతిన్‌తో మీరు జరిపిన మంతనాలను చూశాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. మీరక్కడ ఓ తడి నూడుల్లా నిల్చుని ఉన్నారు. మీ వాలకం చూస్తుంటే పుతిన్ ఆటోగ్రాఫ్ కోసమో, లేదా సెల్ఫీ దిగడానికో వెళ్లినట్లు ఉంది. సమావేశంలో భాగంగా అమెరికా కమ్యూనిటీని అమ్మేశారు. దేశం పరువు తీసేశారంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో పాటు శ్వేత సౌధ ప్రతినిధుల తీరును కూడా ఆయన తప్పు పట్టారు. -
మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారు...!
న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితా- 2018ను ఫోర్బ్స్ విడుదల చేసింది. 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు మొదటి స్థానం దక్కించుకోగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల నుంచి శక్తిమంతులైన వ్యక్తుల జాబితా రూపొందించడానికి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఎక్కువ మంది వ్యక్తులకు ప్రాతినిథ్యం వహించే దక్షత కలిగి ఉండటం, ఆర్థిక వనరులను నియంత్రించగలగడం, భిన్న రంగాలలో తమ ముద్ర వేయగలగడం, అధికారాన్ని చురుగ్గా వినియోగించుకోగలగడం వంటి అంశాల ఆధారంగా 75 మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. భూగ్రహం మీద ఉన్న 7.5 బిలియన్ల జనాభా ఉందని.. తమ సామర్థ్యంతో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న75 మంది(మహిళలు, పురుషులు కలిపి)ని ఎంపిక చేశామని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితా సిద్ధం చేయడానికి 100 మిలియన్ వ్యక్తులకు ఒకరి చొప్పున ఎంపిక చేశామని పేర్కొంది. ఆయన ప్రపంచ నాయకుడు.. భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారని ఫోర్బ్స్ ప్రశంసించింది. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్‌తో జరిపిన చర్చల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడింది. అంతర్జాతీయ అంశాల్లో మోదీ కీలక వ్యక్తిగా మారారని, తన దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని ప్రశంసలు కురిపించింది. 2016లో నోట్ల రద్దు ద్వారా గుణాత్మక మార్పులు చేపట్టి, అవినీతిని తొలగించేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని ప్రశంసించింది. కాగా ‘జియో’తో టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ ఈ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 40వ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కొత్తగా ఎంపికైన వారు.. కాగా గతేడాది మొదటి స్థానం పొందిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్ నాల్గో, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఐదో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి అత్యంత శక్తిమంతుల జాబితాలో 17 మంది కొత్తగా స్థానం సంపాదించుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. వీరలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్(8), అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్(11), ఎగ్జాన్ మొబైల్ సీఈవో డారెన్ వుడ్స్(34), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్(54), జస్టిస్ రాబర్ట్ మ్యూల్లర్(72) తదితరలు ఉన్నారు. -
పుతిన్ జోక్యం చేసుకోలేదట!
హనోయ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వియత్నాంలో ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ సదస్సు వేదికగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. వియత్నాం రాజధాని హనోయ్‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మాట్లాడుతూ ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను జోక్యం చేసుకోలేదని పుతిన్ చెప్పారు. నేను మరోసారి అడిగా.. అప్పుడు కూడా తాను జోక్యం చేసుకోలేదని చెప్పారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. మేం కలిసిన ప్రతిసారి అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని పుతిన్ నిరాకరించారని, పదే పదే ఆరోపణలు చేయడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారని ట్రంప్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై వస్తున్న వార్తలన్నీ ఊహాజనితమేనని, ఇవన్నీ అమెరికా అధ్యక్ష పదవిని బలహీనపరిచే ప్రయత్నాలని పుతిన్ అన్నారు. రాజకీయ మనుగడ కోసం అమెరికాకు చెందిన కొందరు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్కు రష్యాతో సంబంధాలపై పుతిన్ స్పందిస్తూ.. ‘రాస్ గతంలో వ్యాపారాలు చేశారు. అప్పుడు రష్యన్ కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చు. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పారు. సిరియాకు సైనిక చర్య పరిష్కారం కాదు సిరియా సంక్షోభం ముగింపునకు సైనిక చర్య పరిష్కారం కాదని అమెరికా, రష్యాలు అవగాహనకు వచ్చాయి. ఆసియా– పసిఫిక్ వాణిజ్య సదస్సులో ట్రంప్, పుతిన్‌ల మధ్య ఆ మేరకు అంగీకారం కుదిరిందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెల్లడించింది. ఐసిస్‌ను మట్టుబెట్టే విషయంలో దృఢసంకల్పంతో ముందుకు సాగాలని వారిద్దరు నిర్ణయించారని పేర్కొంది. సిరియా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ఇద్దరు అధ్యక్షులు కట్టుబడి ఉన్నారని, జెనీవాలో ఐరాస నేతృత్వంలో సాగుతున్న శాంతిచర్చల్లో సిరియా వైరి వర్గాలు భాగస్వాములు కావాలని పుతిన్, ట్రంప్‌లు పిలుపునిచ్చారని తెలిపింది. -
విమానంలో పేలుడు: రష్యా 'రెడ్ అలర్ట్'
పారిస్/మాస్కో: బాంబు పేలుడు వల్లే రష్యా విమానం.. ఈజిప్టులోని సీనాయి పర్వతంపై కుప్పకూలిందనే అమెరికా, బ్రిటన్ల వాదనకు మరింత బలం చేకూరింది. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్సుకు పారిస్‌లో నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రసముద్రం తీరంలోని షార్మ్ అల్ షేక్ నుంచి రష్యాలోని పీటర్స్ బర్గ్ కు టేక్ ఆఫ్ అయిన 24 నిమిషాల తర్వాత విమానం కూలిపోయింది. అయితే ఆ 24 నిమిషాల్లో విమానంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, అంతవరకు ప్రయాణం సజావుగా సాగినట్లు తెలిసింది. అయితే 24 నిమిషంలో మాత్రం ఒక్కసారిగా ఏదో భారీ విస్పోటనం జరిగిన ఆనవాళ్లు బ్లాక్‌బాక్స్‌లో రికార్డయ్యాయని నిపుణుల బృందం పేర్కొన్నట్లు తెలిసింది. విమానాన్ని తామే పేల్చేశామని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం, అటు అమెరికా, బ్రిటన్లు కూడా బాంబు పేలుడు వల్లే విమానం కూలిపోయిందని నిర్ధారించడం తాజా పరీక్షలకు బలం చేకూర్చాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రష్యా ఫెడరల్ ఏవియేషన్ ఈజిప్టుకు వెళ్లే అన్ని సర్వీసులను రద్దుచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలమేరకు అన్ని సర్వీసులు రద్దుచేసి, అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఈజిప్టులోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రష్యన్లను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'రెడ్ సీ లోని షార్మ్ అల్ షేక్ సహా ఈజిప్ట్ లోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో దాదాపు 40 వేల మంది రష్యన్లు ఉండిఉంటారని అంచనా. ఆమేరకు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించాం' అని అని రష్యా రక్షణ విభాగం చీఫ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ చెప్పారు. ప్రమాదానాకి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ అయిన తర్వాతే ఈజిప్ట్ కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు అసద్ కు మద్దతు తెలిపిన రష్యా.. ఐఎస్ ఉగ్రవాదులు, తిరుగుబాటు దళాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యన్లను టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు.. భీకర ప్రతిదాడులు చేయాలని భావిస్తున్నట్లు, ఆ క్రమంలోనే రష్యా విమానాన్ని పేల్చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెయినర్ లో కాకుండా నేరుగా తానే బాంబులు తీసుకెళ్లిన ప్రయాణికుడు తనను తాను పేల్చుకోవటం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అక్టోబర్ 31న జరిగిన విమాన పేలుడులో 224 మంది చనిపోయిన సంగతి విదితమే. -
పుతిన్ లౌక్యం... ఒబామాకు సంకటం
పుతిన్ అతి తెలివిగా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి మర్కెల్ సూచించిన ప్రతిపాదనలను ఆమోదించారు. దీంతో రష్యా వెనక్కు తగ్గిందని భావిస్తున్నారు. అది పొరపాటు. అమల్లోకిరాని ఒప్పందంతో పుతిన్ అమెరికాను రక్షణ స్థితిలోకి నెట్టేశారు. చదరంగం ఇద్దరు ఆడే ఆటని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరచినట్టున్నారు. ఉక్రెయిన్ చదరంగపు బల్ల మీద తన ఎత్తులే గాక, ప్రత్యర్థి ఎత్తు లు కూడా తాన ఇష్టమేనని భావిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చెప్పక్కర్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ చడీ చప్పుడు లేకుండా జర్మన్ చాన్సలర్ ఏంజెలా మర్కెల్తో కలసి ఉక్రెయిన్ సంక్షోభం పై ఒక అవగాహనకు వచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు దైదియర్ బుర్ఖాల్తర్, పుతిన్‌లు ఈ నెల 7న జరిపిన చర్చల్లో ఆ ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్‌లో కీలక పాత్రధారియైన మర్కెల్ షరతులన్నిటికీ అంగీకరించి పుతిన్ వెనకడుగు వేశారని మీడియా పండితులు విశ్లేషించేశారు. ఆ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్ ఆగ్నేయ రాష్ట్రాలైన డొనెత్స్క్, లుగాన్స్క్లలో రష్యా అనుకూల ‘వేర్పాటువాదులు’ మే 11న జరుప తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ బలగాలను లోతట్టుకు ఉపసంహరించడానికి సిద్ధమన్నారు. జాతీయ సయో ధ్య కోసం చర్చలు జరిపి, ఎన్నికలను నిర్వహించడానికి అంగీకరించారు. బదులుగా రష్యన్లు అత్యధికంగా ఉండే తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం, నియో ఫాసిస్టు ‘స్వాబోదా’ నేషనల్ గార్డు ముఠాలు సాగిస్తున్న ‘ఉగ్రవాద’ వ్యతిరేక సైనిక చర్యలను, అణచివేతను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌లో శాంతి, జాతీయ సయోధ్యలకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అమెరికా ఆశిస్తున్నది అది కాదు. కాబట్టే పుతిన్ వేసిన పాచిక పారింది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని రష్యా అనుకూల ఆందోళనకారులు... ఉక్రెయిన్ నియో నాజీ నేతలంటున్నట్టు ‘ఉగ్రవాదులు’కారు. పాశ్చాత్య ప్రపంచం ప్రచారం చేస్తున్నట్టు ‘వేర్పాటువాదులు’ కారు. సాధారణ కార్మికులు, ప్రజలు. కాకపోతే రష్యన్లు. అయినా వారు రష్యాలో విలీనం కావాలని కోరుకోవడం లేదు. స్వాతంత్య్రం అడగడం లేదు. ఉక్రెయిన్‌లో భాగంగానే ఉండాలని భావిస్తున్నారు. కాకపోతే రాష్ట్రాలకు విస్తృత స్వయం ప్రతిపత్తినిచ్చే ఫెడరల్ వ్యవస్థను కోరుతున్నారు. ఆ డిమాండు కూడా చాలా పాతది. అమెరికా చేతి కీలుబొమ్మ ‘విప్లవకారులకు’ భిన్నంగా వారు పుతి న్ ఆడించేట్టు ఆడే బాపతు కాదు. కాబట్టే ‘పుతిన్ పిరికిపంద. డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఇందుకు బదులుగా మాస్కో రెడ్‌స్క్వేర్‌లో విప్లవంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రష్యన్ ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరు’ అని ‘డొనెత్స్క్ నేషనల్ రిపబ్లిక్’ ప్రకటించింది. పుతిన్ ఒక్క గుండు కూడా పేల్చకుండా చాలా లక్ష్యాలను సాధించారు. మర్కెల్‌ను ప్రసన్నం చేసుకుని అమెరికా-నాటో కూటమిలో విభేదాలను రగిల్చారు. అమెరికా తన సైనిక బలగాలను తూర్పు యూరప్‌కు పంపుతుండగా ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సేనలను ఉపసంహరిస్తానని ప్రకటించారు. పుతిన్ శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ జాతీయోన్మాద ప్రభుత్వం అవహేళన చేసింది. పుతిన్‌కు కావాల్సిందీ అదే. అమల్లోకి రాని ఓ ఒప్పందంతో పుతిన్ అంతా సాధించారు. యథాతథంగా జాత్యహంకార మూకలు రష్యన్ల వేటను సాగిస్తాయి. మే 2న ఒడిస్సీలో 42 మంది ప్రజలను సజీవంగా దహనం చేసిన మూకలు... శుక్రవారం 20 మందిని బలిగొన్నాయి. డొనెత్స్క్, లుగాన్స్క్ ప్రజలు ఉక్రెనియన్ పాలకులను నిద్రపోనీయరని పుతిన్‌కు తెలుసు. చోద్యం చూడటమే పుతిన్ పని. అన్నిటికీ మించి విప్లవాన్ని సమర్థించిన ప్రజలు సైతం కొత్త ప్రభుత్వం పాతదేనని, కాకపోతే గ్యాస్ ధరలు 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని, పన్నుల భారం తెగపెరిగిందని వాపోతున్నారు. శాంతిని కోరుతున్నారు. 1,700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం దేశాన్ని దివాలా తీయించనుంది. ఐఎంఎఫ్ రుణంలో రష్యా ఇంధన సంస్థ ‘గాజ్ప్రోమ్’కు 270 కోట్ల డాలర్లు, ఐఎంఎఫ్ పాత బకాయిల చెల్లింపులకు 500 కోట్ల డాలర్లు అయిపోతాయి. ట్యామషెంకోలాంటి అవినీతిగ్రస్త విప్లవ నేతలు తినేది తినగా ఇక మిగిలేది ఎంత? ఐఎంఎఫ్ షరతులు ఎలాంటివో చెప్పక్కర్లేదు. తూర్పు, దక్షిణ భాగాలు విడిపోతే ఈ రుణాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ బెయిలవుట్లతో గ్రీస్‌లాంటి యూరప్ దేశాలు ఎంత బాగుపడ్డాయో తెలిసినవాళ్లు ఉక్రెయిన్‌కు ఏ గతి పడుతుందో ఊహించగలరు. చిట్టచివరకు తూర్పు, దక్షిణ ప్రాంతాలే కాదు... మొత్తంగా ఉక్రెయిన్ తన కాళ్ల దగ్గరకు రాక తప్పదని పుతిన్ అంచనా. కాదనలేం. పిళ్లా వెంకటేశ్వరరావు