ఇప్పుడు మాట్లాడొచ్చా?  | How World Leaders Make Phone Calls. | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మాట్లాడొచ్చా? 

Published Thu, Mar 25 2021 11:54 PM | Last Updated on Fri, Mar 26 2021 12:03 AM

How World Leaders Make Phone Calls. - Sakshi

బరాక్‌ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

ట్రంక్‌ కాల్‌ నాటి ‘ఎదురు చూసే’ కాలం మళ్లీ వచ్చేసింది! మీ కాంటాక్ట్‌ లిస్ట్‌ లోంచి ఏదో ఒక నెంబర్‌ కి కాల్‌ చేసి చూడండి. ‘వేరొక కాల్‌ లో బిజీ గా ఉన్నారు’ అని వినిపిస్తుంది. నిజమే. ఒక మనిషి ఇంకో మనిషికి నేరుగా అయినా కనెక్ట్‌ ఆవుతారేమో, ఫోన్‌ లైన్‌లో మాత్రం వెంటనే కాంటాక్ట్‌లోకి రావడం అన్నది ఏ యుగానికో సంభవించే ఒక భూగోళ అద్భుతం అన్నట్లుగా అయింది! మనకే ఇలా ఉంటే మరి దేశాధినేతలు ఫోన్‌లో ఒకరికొకరు ఎలా దొరుకుతారు? ఫోన్‌ చేసి, ‘ఎవరు మాట్లాడేది?‘ అని అడిగే మానవాళి మధ్యే కదా వాళ్లూ జీవిస్తున్నది. వాళ్లకూ రాంగ్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వస్తుందా? జిన్‌పింగ్‌ జర్మనీ చాన్స్‌లర్‌తో ఇప్పటికప్పుడు మాట్లాడాలంటే ఎలా? ఇద్దరు దేశాధినేతలు ఫోన్‌లో మాట్లాడుకోవాలంటే వాళ్లకన్నా ముందు ఎంతమంది ఆ ఇద్దరికి లైన్‌ కలపడం కోసం ఫోన్‌లు చేసుకోవాలి? కొద్ది రోజులుగా పుతిన్‌ ప్రయత్నిస్తున్నా బైడెన్‌ ఫోన్‌ ఎత్తడం లేదని వదంతి!! అసలు దేశాధ్యక్షులు ఒకరికొకరు ఎలా ఫోన్‌ చేసుకుంటారు? ఆ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది? ఓసారి చూద్దాం. 


జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

‘‘విదేశాంగ శాఖలు ఒక్కోసారి ఎంత గుడ్డిగా ఉంటాయంటే.. మనుషుల్లానే అవీను..’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం చేయని కొత్తల్లో ఒక వార్త రాసింది. న్యూయార్క్‌ సిటీలోని ‘ట్రంప్‌ టవర్‌’కి ఫోన్‌ చేసేవారట విదేశాంగ కార్యదర్శుల సహాయకులు.. ట్రంప్‌తో కనెక్ట్‌ అవడం కోసం! బిజినెస్‌మన్‌గా ఉన్నప్పుడు ట్రంప్‌ గానీ, ప్రెసిడెంట్‌ అయ్యాక మిస్టర్‌ ప్రెసిడెంటే కదా. ఆయన  లైన్‌ కలవడానికి ముందు, ఆయనకు లైన్‌ కలపడానికి ముందు రెండు వైపులా పెద్ద టీమ్‌ పనిచేయాల్సి ఉంటుంది.  

ఎవరు ఫోన్‌ చేయబోతున్నదీ ముందే తెలియాలి. ఫోన్‌ చేసి ఏం మాట్లాడబోతున్నదీ ముందే తెలియజెప్పాలి. అమెరికా అధ్యక్షుడితో కనుక తైవాన్‌ ప్రెసిడెంట్‌ ఫోన్‌లో మాట్లాడాలని అనుకుంటే, తైవాన్‌కీ, మిగతా దేశాలకు ఉన్న సంబంధాలు ఏమిటో కూడా అమెరికా అధ్యక్షుడికి తెలిసి ఉండాలి. ఇన్ని లెక్కలు ఉంటాయి! అయితే ట్రంప్‌ వేరు కదా, అధ్యక్షుడి సీట్లో కూర్చున్నాక అకస్మాత్తుగా ఓరోజు ఆయన.. ‘‘ఇప్పుడే త్సాయ్‌ ఇంగ్‌–వెన్‌తో ఫోన్‌లో మాట్లాడి వస్తున్నా’’ అన్నారు. ఇంగ్‌–వెన్‌ తైవాన్‌ అధ్యక్షురాలు.


డొనాల్డ్‌ ట్రంప్,అమెరికామాజీఅధ్యక్షుడు  

వైట్‌ హౌస్‌లోని విదేశాంగ అధికారులు నివ్వెరపోయారు. నలభైఏళ్లుగా అమెరికా, తైవాన్‌ మధ్య సంబంధాలు లేవు. చైనాకు తైవాన్‌ అంటే పడదు కనుక అమెరికాకూ పడలేదు. ఆ సంగతి తెలియక ట్రంప్‌ మాట్లాడినట్లున్నారు. లేక, తెలిసే మాట్లాడారేమో! ఒక ప్రెసిడెంట్‌కి ఇంకో ప్రెసిడెంట్‌తో కానీ, ప్రధానితో కానీ డైరెక్ట్‌గా లైన్‌ కలవడానికి ముందు ఇన్‌డైరెక్ట్‌గా అనేకమంది అధికారుల మధ్య లైన్స్‌ కలవవలసి ఉంటుంది. అయితే చక్కటి స్నేహ సంబంధాలు ఉన్న రెండు దేశాల అధ్యక్షుల మధ్య ఫోన్‌ కాల్స్‌కి ఇంత తతంగం ఉండదు.. ‘‘మా ప్రెసిడెంట్‌ మీ ప్రెసిడెంట్‌తో మాట్లాడతారట’’ అని డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ ఫోన్‌ చేయగానే కాల్‌కి తక్షణం ఏర్పాట్లు జరిగిపోతాయి. జరిగాక కూడా, లైన్‌ కలిశాక కూడా.. ‘‘హాయ్‌ దిస్‌ ఈజ్‌ పుతిన్, ఈజ్‌ ఒబామా ఇన్‌’’ అనే ఒక ప్రారంభ వాక్యంతో సంభాషణ మొదలవుతుంది.

పెద్దగా సంబంధాలు లేని దేశాల మధ్య అధ్యక్షులను ఫోన్‌లో కలిపే బాధ్యతనైతే రాయబారులు తీసుకుంటారు. ఎవరు, ఎందుకు, ఎంతసేపు మాట్లాడదలచిందీ వివరాలు వెళతాయి. ఇద్దరికీ కుదిరే టైమ్‌ చూసుకున్నాక లైన్‌ కలుస్తుంది. సంభాషణలో రాగల ప్రశ్నలకు సమాధానాలు కూడా ముందే సిద్ధమై ఉంటాయి! అంటే.. ఇద్దరు దేశాధ్యక్షులు ఫోన్‌లో మాట్లాడుకునే సంభాషణ ముందే జరిగిపోతుందన్నమాట! మర్యాదపూర్వకమైన ఫోన్‌ కాల్‌ అయితే మర్చిపోకుండా అడగవలసినవి కొన్ని ఉంటాయి. ఉదా: జబ్బున పడి కోలుకుంటున్న ప్రెసిడెంట్‌ భార్య లేక భర్త ఆరోగ్యం ఎలా ఉందో అడగడం! కాల్‌కి ముందు వాటిని గుర్తు చేస్తారు కీలక సిబ్బంది. పర్సనల్‌ టచ్‌ కోసం! మరీ దేశభద్రతకు సంబంధించిన విషయమైతే.. ‘‘మీరొక్కరే ఉన్నారా’’ అనే మాటతో సంభాషణ మొదలై, అతి సంక్షిప్తంగా ముగిసిపోతుంది. అది కేవలం సమాచారాన్ని చేరవేయడమో, అనివార్యంగా తీసుకున్న ఒక నిర్ణయం గురించి తెలియజేయడమో అయి ఉంటుంది.

వెంటనే లైన్‌ కట్‌. ప్రపంచాధినేతల మధ్య ఫోన్‌ కాల్స్‌ సంభాషణలు కనీసం కొద్దిమందికైనా తెలియకుండా పోవు. సహాయకులు, అనువాదకులు.. వీళ్లను దాటుకుని వాళ్ల మాటలు దాగలేవు. ఫోన్‌ సంభాషణలు సాధారణంగా ఇంగ్లిష్‌లోనే సాగుతాయి. మాతృభాషలో మాట్లాడవచ్చు కానీ, దేశానికది చిన్నతనంగా ఉంటుంది. అయినప్పటికీ అపార్థాలు రాకుండా, అపోహలు కలగకుండా ఉండటం కోసం ఇంగ్లిష్‌కు బదులుగా, అంతకన్నా తమకు బాగా వచ్చిన భాషలోనే అధ్యక్షులు మాట్లాడుతుంటారని వైట్‌ హౌస్‌లో లింగ్విస్ట్‌గా పని చేసిన కెవిన్‌ హెండ్టెల్‌ అంటారు. అమెరికా అధ్యక్షుడితో ఫోన్‌ మాట్లాడ్డమైతే లోపల ఉన్నవాళ్లకు కూడా కనాకష్టమైన సంగతి.

అధ్యక్షుడు ఇలా చెయ్యి ముందుకు అని, అలా ఫోన్‌ అందుకుంటారు కానీ.. అలా అందుకోడానికి ముందు... అవతల ఉన్నది రైట్‌ పర్సనేనా అనేది చేసుకోడానికి వంద చెకింగ్‌లు జరిగి ఉంటాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిల్లరీ క్లింటన్‌ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. ఓసారి ఆమె ఒబామాకు లైన్‌ కలపమని అడిగారు. ఆపరేటర్‌ కలపలేదు. ‘ఐ యామ్‌ హిల్లరీ క్లింటన్, హానెస్ట్‌లీ ఐ యామ్‌ అని చెప్పుకోవలసి వచ్చింది’ అని హిల్లరీ 2010 నాటి ఓ ఈ మెయిల్‌లో తన సన్నిహితులతో షేర్‌ చేసుకున్నారు. ఆపరేటర్‌లు అనుమానించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. తప్పు పట్టకూడదు కూడా. ఎందుకంటే.. ప్రెసిడెంట్‌లకు కొన్ని ప్రాంక్‌ కాల్స్‌ కూడా వస్తుంటాయి.

ఆట పట్టించే కాల్స్‌. స్పెయిన్‌ మాజీ ప్రధాని మారియానోకు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్‌ కాల్‌ వచ్చింది! స్పెయిన్‌ నుంచి వేరుపడాలని చూస్తున్న కేటలోనియా ప్రాంత వేర్పాటు వాద నాయకుడి గొంతుతో ఓ రేడియో ప్రెజెంటర్‌ సరదాగా చేసిన ఆ కాల్‌ని నిజం అనుకుని ఆపరేటర్‌ లైన్‌ కలిపారు! తర్వాత ఆ ఆపరేటర్‌ ఉద్యోగం ఉందో పోయిందో తెలీదు. మయామీలోని ఒక యూఎస్‌ రేడియో స్టేషన్‌ 2003లో ఒకేసారి ఒక తాజాను, ఒక మాజీని బుట్టలో వేసింది.


పుతిన్, రష్యాఅధ్యక్షుడు

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫైడెల్‌ క్యాస్ట్రోలను కొంతసేపు కాల్‌ మాట్లాడుకునేలా ‘ఫ్రాంక్‌’ చేసింది! ఎల్‌ జోల్‌ అనే ఆ రేడియో స్టేషన్‌లో పనిచేసే ప్రెజెంటర్‌ మొదట క్యాస్ట్రో మాట్లాడున్నట్లుగా గొంతు మార్చి ఛావెజ్‌కి ఫోన్‌ చేశాడు. తర్వాత క్యాస్ట్రోకి ఫోన్‌ చేసి ఛావెజ్‌లా మాట్లాడాడు. ఆ సంగతిని క్యాస్ట్రో కనిపెట్టడంతో వివాదం అయింది. ఇలాంటివే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడొక వదంతి వినిపిస్తోంది. పుతిన్‌ ఫోన్‌ చేస్తుంటే బైడెన్‌ లిఫ్ట్‌ చెయ్యడం లేదని. బహుశా అది మీమ్‌ కావచ్చు. అయితే కొన్నాళ్లుగా జో బైడెన్‌ పుతిన్‌ మీద ఆగ్రహంతో ఉన్నారు. పుతిన్‌కి ఫోన్‌ చేసి తిట్టానని కూడా ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. 

ఏమైనా ఈ రెండు అగ్రరాజ్యాల అధినేతల సంభాషణలు ఫోన్‌ కాల్‌ స్థాయికి మించినవి. వీళ్లకో హాట్‌ లైన్‌ ఉంది. దశాబ్దాలుగా ఉంది. దాని పేరు ‘రెడ్‌ టెలిఫోన్‌’. అయితే అది టెలిఫోన్‌ కాదు. ఒక ప్రత్యేకమైన, అత్యంత గోప్యమైన సమాచార వాహక వ్యవస్థ. ఆ హాట్‌ లైన్‌ ద్వారా టెక్స్‌ట్‌ మెసేజ్‌లు, రేఖాచిత్రాల రూపంలో మాత్రమే  సంభాషణ జరిపేందుకు వీలవుతుంది. 1962లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు ఇలాంటి హాట్‌ లైన్‌ అవసరం అయింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక కూడా ల్యాండ్‌ లైన్‌ల మీదే చాలావరకు దేశాధ్యక్షుల అధికారిక సంభాషణలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement