
రష్యా అధ్యక్షుడు పుతిన్ సుముఖత
మౌలిక వనరులపై దాడులు ఆపుతామని ప్రతిపాదన ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపేయాలని షరతు
వాటితోపాటు మరిన్ని డిమాండ్లు
ట్రంప్‌తో గంటకు పైగా ఫోన్ చర్చలు
పశ్చిమాసియా వేదికగా చర్చలు: వైట్‌హౌస్
ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణ
త్వరలో భారీ ఆర్థిక ఒప్పందాలు
చరిత్రాత్మకంగా అభివర్ణించిన రష్యా
వాషింగ్టన్/మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడులకు పాక్షికంగా విరామమిచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుదుత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు.
అయితే అందుకు ప్రతిగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు సైనిక, నిఘా సాయాలను పూర్తిగా నిలిపేయాలని షరతు విధించారు! వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. గంటకు పైగా జరిగిన సంభాషణలో యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్‌ను ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
యుద్ధం ఆగి శాశ్వత శాంతి నెలకొనాలని అధ్యక్షులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చనట్టు తెలిపింది. ‘‘తర్వాతి దశలో నల్లసముద్రంలో కాల్పుల విరమణ, చివరగా పూర్తిస్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయి’’ అని వివరించింది. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్టు వెల్లడించింది.
అమెరికా ఇటీవల ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ వెంటనే అంగీకరించడం, దానిపై సంతకం కూడా చేయడం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. పలు అంశాలపై స్పష్టత కోసం ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూములు, జపోరిజియా అణు విద్యుత్కేంద్రం తదితరాలు కూడా తమ మధ్య చర్చకు వస్తాయని సంభాషణకు ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు.
ఇరు దేశాల మధ్య పంపకాలకు సంబంధించి రష్యాతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్టు కూడా చెప్పారు! ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు మూడేళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలను అమలు చేస్తుండటం తెలిసిందే. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. యుద్ధానికి ముగింపుపై ఇటీవల సౌదీ అరేబియాలో అమెరికా పలుమార్లు చర్చలు జరపడం తెలిసిందే. పాక్షిక, దశలవారీ కాల్పుల విరమణ ప్రతిపాదనలు, పుతిన్ తాజా షరతులపై ఉక్రెయిన్ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment