
మాస్కో: ప్రపంచ అధినేతల్లో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు ఆయన జీవన.. వ్యవహార శైలులు, నడవడికలు కారణాలని చెప్పొచ్చు. అదే సమయంలో ఇతర అధినేతలతో ఆయన వ్యవహరించే తీరు కూడా చాలా ప్రత్యేకంగా ఉండి.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటుంది కూడా.
తాజాగా.. ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో.. ట్రంప్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడగా(Putin Phone call With Trump) ఆ సంభాషణకు ముందు జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు బయటకు వచ్చింది.
మన టైమింగ్స్ ప్రకారం.. మార్చి 18వ తేదీన సాయంత్రం 4గం. నుంచి 6గం. మధ్య ఇద్దరూ మాట్లాడుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు సమాచారం మాస్కోకు కూడా వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం వైట్‌హౌజ్ నుంచి క్రెమ్లిన్‌కు టైంకి ఫోన్ వచ్చింది. కానీ ఆ టైంలో పుతిన్ అధ్యక్ష భవనంలో లేరు!. ట్రంప్‌తో మాట్లాడిన విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. తీరికగా మాస్కో ఇంటర్నేషనల్ హాల్‌లో జరిగిన రష్యా ప్రముఖ వ్యాపారవేత్తల భేటీకి హాజరయ్యారు. అయితే.. అక్కడ జరిగిన పరిణామాన్ని కింది వీడియోలో చూసేయండి.
Putin is meant to be speaking to Trump around now, but he is talking to a room full of oligarchs instead. Asked if he's going to be late, Putin waves off the question and says not to listen to his spokesman pic.twitter.com/LDTU8BNQAr
— max seddon (@maxseddon) March 18, 2025
ట్రంప్‌తో ఫోన్‌కాల్‌కు టైం దగ్గర పడుతుండడంతో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్.. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవరించిన మాజీ ప్రధాని అలెగ్జాండర్ షోకిన్(Alexander Shokhin) ద్వారా పుతిన్‌కు సమాచారం చేరవేశారు. అయితే.. పుతిన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరికదా నవ్వుతూ ‘‘అతని మాటలేం పట్టించకోవద్దు.. అతనికి ఇదే పని’’ అని అనడంతో అక్కడంతా నవ్వులు పూశాయి. దీనికి కొనసాగింపుగా.. ‘ట్రంప్‌కి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తారో?’’ అని షోకిన్ అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. అయితే తాను ట్రంప్ గురించి అనలేదని.. పెస్కోవ్‌ను ఉద్దేశించి అన్నానని పుతిన్ చెప్పడంతో ఆ హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
ఇదంతా జరిగాక కూడా.. పుతిన్ ఆ మీటింగ్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత నిదానంగా క్రెమ్లిన్ వెళ్లి ట్రంప్‌తో ఫోన్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల వేళ.. ట్రంప్‌తో కాల్ చాలా ముఖ్యమైందే. అయినా కూడా పుతిన్ అలా వ్యవహరించారు. అలాగని పుతిన్‌కు ఇలా తన కోసం ఎదురు చూసేలా చేయడం కొత్తేం కాదు. గతంలో.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, మత గురువు పోప్ ప్రాన్సిస్.. ఆఖరికి క్వీన్ ఎలిజబెత్‌ను కూడా తన కోసం వెయిట్ చేయించారు.
ఫోన్ కాల్ సారాంశం ఇదే..
ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు. అయితే రష్యా మాత్రం ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించకుండా.. కొన్ని షరతులు పెడుతోంది. అలాగే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు దిగిరావాలంటే.. ఉక్రెయిన్‌కు విదేశీ సాయం నిలిపివేయాలని పుతిన్, ట్రంప్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఫోన్ సంభాషణ ద్వారా పుతిన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలో ఇతర అంశాలపై రష్యాతో తమ ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుందని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment