
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది.
మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.
అమెరికా నుంచి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చల ఒప్పందంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలంటూ రష్యాను కోరిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు జరుపుతున్న భీకరదాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అదే సమయంలో.. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను వదులుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీకి సూచించారు కూడా.