
శాంతి యత్నాలను ముందుకు సాగనివ్వడం లేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ అధినేతలు పుతిన్, జెలెన్‌స్కీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రుసరుసలాడారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించి, శాంతిని నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వారు ముందుకు సాగనివ్వడం లేదని మండిపడ్డారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య అంతులేని విద్వేషం కనిపిస్తోందని చెప్పారు. అయినప్పటికీ యుద్ధాన్ని ముగించే విషయంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించానని అన్నారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్ ‘మర్–అ–లాగో’లో ‘ఎన్‌బీసీ న్యూస్’వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
జెలెన్‌స్కీ విశ్వసనీయతను పుతిన్ ప్రశ్నించడం తనకు నచ్చలేదని చెప్పారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసే హక్కు జెలెన్‌స్కీకి లేదని, ఉక్రెయిన్‌కు బాహ్య పరిపాలన అవసరమని పుతిన్ చేసిన వ్యాఖ్యల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ పట్ల సానుకూల ధోరణితో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌పై మాట తప్పితే..
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ పుతిన్ తనకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గబోరని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాము కలిసి పనిచేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పుడు అంగీకరిస్తారో చెప్పలేనని, దానిపై సైకలాజికల్ డెడ్‌లైన్ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఇన్నాళ్లూ అందించిన ఆర్థిక, సైనిక సాయానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతి ఇవ్వడానికి జెలెన్‌స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, విషయంలో జెలెన్‌స్కీ మోసం చేసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందని ట్రంప్ చెప్పారు.
క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో మాట తప్పితే చాలాచాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలెన్‌స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఉక్రెయిన్ భద్రతకు స్పష్టమై హామీని ఇవ్వాలంటూ మిత్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో జెలెన్‌స్కీ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌కు ‘నాటో’సభ్యత్వం లభించే అవకాశమే లేదని, ఆ విషయం జెలెన్‌స్కీకి కూడా తెలుసని తే ల్చిచెప్పారు. సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం చెబుతుండగా పుతిన్ ప్రభుత్వం అంగీకరించడంలేదు. కనీసం 30 రోజులపాటు దాడులు ఆపేయాలని కోరినా లెక్కచేయడం లేదు. పైగా ఉక్రెయిన్‌పై వైమానిక, క్షిపణి దాడులను మరింత ఉధృతం చేస్తుండడం గమనార్హం.