
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన హయాంలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించడానికి ఆటోపెన్‌ను ఉపయోగించారని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొత్త పాలనా వ్యవస్థలో బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షల్లో కొన్ని చెల్లవని ట్రంప్ ప్రకటించారు. కొన్ని క్షమాభిక్షలను అధ్యక్షుడి ఆమోదం లేకుండానే సిబ్బంది ఆటోపెన్‌ను ఉపయోగించి ఆమోదించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
‘రాజకీయ దుండగులుగా పేరున్న కొంతమందికి జో బైడెన్ ఇచ్చినట్లు చెబుతున్న క్షమాభిక్ష చెల్లదు. ఆయన సదరు పత్రాలపై సంతకం చేయలదు. అందుకోసం కొందరు సిబ్బంది ఆటోపెన్‌ను ఉపయోగించారు. దాంతోనే బైడెన్ సంతకం చేసినట్లు చూపుతున్నారనే అనుమానాలున్నాయి. జో బైడెన్‌కు ఆ విషయాల గురించి తెలియకపోవచ్చు. క్షమాభిక్షకు అవసరమైన పత్రాలను బైడెన్‌కు సిబ్బంది వివరించలేదు. క్షమాభిక్ష అర్హుల గురించి, ఈ సంఘటనకు కారణమైన వ్యక్తుల గురించి బైడెన్‌కు ఏమీ తెలియదు’ అని ట్రంప్ తెలిపారు. బైడెన్ ఆటోపెన్‌ను ఉపయోగించినట్లు ట్రంప్ ఎలాంటి ఆధారాలు ఇవ్వనప్పటికీ తన పదవీకాలంలో ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఎన్‌బీసీ నివేదిక ధ్రువీకరించింది.
ఆటోపెన్ అంటే ఏమిటి?
ఆటోపెన్ అనేది ఆటోమేటిక్ లేదా రిమోట్ సంతకాలు చేయడానికి ఉపయోగించే పరికరం. సాధారణ ఇ-సిగ్నేచర్ మాదిరిగా కాకుండా, ఆటోపెన్ అనేది రోబోట్ ఆధారిత రియల్‌టైమ్ సంతకాలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది ఏదైనా వ్యక్తి పెన్ స్ట్రోక్లను ఎలా అనుకరించాలో నేర్చుకుని దానికి తగినట్లుగా తిరిగి అచ్చం అలాగే అమలు చేస్తుంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న చేపల ధరలు
ఆటోపెన్ సంతకాలు చెల్లుబాటు అవుతాయా?
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నియమించిన న్యాయ శాఖలోని లీగల్ కౌన్సెల్ కార్యాలయం 2005 మార్గదర్శకాల ప్రకారం, చట్టబద్ధంగా ఆటోపెన్ ఉపయోగించే పద్ధతి ఉంది. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్ ఆమోదించి సంతకం చేయాలని నిర్ణయించిన బిల్లుపై భౌతికంగా తాను సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆటోపెన్‌ను ఉపయోగించవచ్చని న్యాయశాఖ తెలిపింది. ఆటోపెన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోనని ట్రంప్ తొలుత పేర్కొన్నప్పటికీ, తన గత టర్మ్‌లో అటువంటి ఉత్తర్వులపై సంతకం చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment