
టెక్నో డిజిటల్ ఇన్‌ఫ్రా సంస్థ ఏర్పాటు
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా టెక్నో డిజిటల్ ఇన్‌ఫ్రా పేరిట సంస్థను ప్రారంభించినట్లు టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ (టీఈఈసీఎల్) వెల్లడించింది. ఇది సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా మొత్తం మీద 250 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
చెన్నైలో 36 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ (హెచ్‌డీసీ) కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా టీఈఈసీఎల్ ఈ విషయాలు పేర్కొంది. తదుపరి హెచ్‌డీసీలను కోల్‌కతా, నోయిడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. మరోవైపు, 23 రాష్ట్రాలవ్యాప్తంగా 102 నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మించేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీఈఈసీఎల్ తెలిపింది. క్లౌడ్ మాధ్యమం ద్వారా పెద్ద కంపెనీలకు భారీ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సరీ్వసులు అందించేందుకు హెచ్‌డీసీలు ఉపయోగపడతాయి. యూజర్లకు సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ సెంటర్లుగా వ్యవహరిస్తారు.