
టాటా ఎలక్ట్రానిక్స్ తన హోసూరు యూనిట్‌లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోందని ఈ పరిణామాల గురించి అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతం ఉన్న 50,000 ఎన్‌క్లోజర్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోందని చెప్పాయి. హోసూరు కర్మాగారంలో ఇప్పటికే రెండో దశ నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. సెప్టెంబర్‌లో యాపిల్ చేసే కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లకు ముందు ఈ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
గత ఏడాది సెప్టెంబర్‌లో హోసూర్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి ముందు టాటా ఎలక్ట్రానిక్స్ సుమారు 50,000 ఎన్ క్లోజర్ల సామర్థ్యాన్ని సాధించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత తిరిగి ఇటీవల మునుపటి సామర్థ్యాన్ని చేరుకున్నట్లు తెలిపాయి. కెపాసిటీ విస్తరణకు సంబంధించిన వివరాలపై టాటా ఎలక్ట్రానిక్స్, యాపిల్ సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.
అమెరికాలో విక్రయించే ఐఫోన్లకు భారత్ ప్రధాన తయారీ కేంద్రంగా మారుతుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ విస్తరణ ఊపందుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘జూన్ త్రైమాసికంలో యూఎస్‌లో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశం నుంచే సమకూరుతాయని ఆశిస్తున్నాం’ అని కుక్ తెలిపారు. అమెరికాలో విక్రయించే దాదాపు అన్ని ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఏర్‌పాడ్ ఉత్పత్తులకు వియత్నాం మూలస్థానంగా ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి: అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..
పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా (పీటీఐ)లో 60 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు టాటా ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. 2024 మార్చిలో విస్ట్రాన్ ఇండియా కార్యకలాపాలను (కర్ణాటకలోని నర్సాపుర కేంద్రంగా) కంపెనీ కొనుగోలు చేసింది. యాపిల్ గ్లోబల్ వాల్యూ చైన్ (జీవీసీ)లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది.