
ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్‌లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ క్యూ తెలిపారు.
యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు
‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెన్స్, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్ అవేర్‌నెస్, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.
ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్ సిద్ధం
యాపిల్ విజన్
‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు.