
యాపిల్ అధికారికంగా భారతదేశంలోని వినియోగదారులకు ‘యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల’ను విడుదల చేసింది. ఐఓఎస్ 18.4, ఐప్యాడ్ఓఎస్ 18.4, మ్యాక్ఓఎస్ సెకోయా 15.4 అప్‌డేట్‌ల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వీటిని సర్వీసులను మెరుగు పరిచేందుకు జనరేటివ్ ఏఐను వినియోగించినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ వరల్ట్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024లో మొదట ఆవిష్కరించిన యాపిల్ ఇంటెలిజెన్స్ క్రమంగా యూఎస్, యూకే, యూరప్, కెనడాలో విస్తరించింది. కొన్ని కారణాల వల్ల ఈ అప్‌డేట్‌ను ఇండియాలో ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇటీవల యాపిల్ ఇంటెలిజెన్స్‌ను భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ ఫీచర్లను ఉపయోగించవచ్చని తెలిపింది.
ఇండియాలో అందుబాటులో ఉన్న ఫీచర్లు
రైటింగ్ టూల్స్
ఈమెయిల్, సందేశాలు, గమనికలు, థర్ట్‌ఫార్టీ అప్లికేషన్లలో టెక్ట్స్‌ను సులువుగా టైప్ చేయడానికి, అందులోని వివరాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి వీలు కల్పించారు. ప్రొఫెషనల్ ఈమెయిల్‌ను రూపొందించడం, సాధారణ సందేశాన్ని సిద్ధం చేయడం, వినియోగదారులకు అనుగుణంగా వాటిని సర్దుబాటు చేయడం, వ్యాకరణం, పదాల ఎంపిక, వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచడానికి సూచనలు వంటి చాలా అంశాలను ఈ రైటింగ్ టూల్స్‌లో పొందుపరిచారు.
మెరుగైన ఫొటోలు
ఫొటోస్ యాప్‌లో ఏఐను నిక్షిప్తం చేశారు. ఇందులోకి క్లీన్ అప్ టూల్ వినియోగదారులకు ఒరిజినల్ సన్నివేశం పాడవకుండా ఫొటోలోని అనవసర వస్తువులు లేదా వ్యక్తులను తొలగించడానికి అనుమతిస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫొటోలు, వీడియోలను విశ్లేషిస్తుంది. స్టోరీలను క్రియేట్ చేస్తుంది. జెన్‌మోజీ ద్వారా కావాల్సిన విధంగా ఫొటోల ఎమోజీలను సృష్టించవచ్చు. మరోవైపు ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్, థీమ్స్, కాస్ట్యూమ్స్ లేదా యాక్సెసరీల ఆధారంగా ప్రత్యేకమైన చిత్రాలను సృష్టించడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.
సిరి మరింత తెలివిగా..
సిరి యాపిల్ ఇంటెలిజెన్స్‌తో మమేకమై యూజర్ల ప్రశ్నలకు ప్రతిస్పందిస్తుంది. జనరేటివ్ ఏఐ సాయంతో ఈమేరకు సమాధానాలు చెబుతుంది. సిరితో వాయిస్ లేదా టెక్ట్స్ ద్వారా సంభాషించవచ్చు. మెరుగైన భాషా అవగాహన కలిగిన సిరి ఏఐ వినియోగదారులు ప్రశ్నలు అడగడంలో తడబడినప్పటికీ సరైన విధంగా సమాధానం అందించేలా రూపొందించారు.
విజువల్ ఇంటెలిజెన్స్
ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు ప్రత్యేకంగా ఉన్న ఈ ఫీచర్‌తో తక్షణ సమాచారాన్ని పొందేందుకు వీలవుతుంది. ఉదాహరణకు ఒక పువ్వును ఫొటో తీసేందుకు కెమెరా ముందుంచితే అది పెరుగుతున్న పరిస్థితులు, సంరక్షణ చిట్కాలను వెల్లడిస్తుంది.
ఇదీ చదవండి: అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా
చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్
చాట్ జీపీటీని సిరి, రైటింగ్ టూల్స్‌లో ఇంటిగ్రేట్ చేయడానికి యాపిల్ ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అధునాతన ఏఐ సామర్థ్యాలతో డాక్యుమెంట్లను విశ్లేషించడం లేదా ఫొటోలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి సంక్లిష్ట ప్రశ్నల కోసం సిరి చాట్ జీపీటీని ట్యాప్ చేయవచ్చు.