రూ.65,000 కోట్ల పెట్టుబడులు
జెనరేషన్ ఏఐతో అధిక డిమాండ్
క్రిసిల్ రేటింగ్స్ అంచనా
ముంబై: దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి రెట్టింపై 2–2.3 గిగావాట్లకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల విస్తరణ ప్రణాళికలకు తోడు కొత్త సంస్థల రాకతో డేటా సెంటర్ల సామర్థ్యం పెరగనున్నట్టు వెల్లడించింది. డిజిటలైజేషన్ పెరగడానికితోడు, క్లౌడ్ స్టోరేజీపై సంస్థల పెట్టుబడులు ఇనుమడిస్తుండడం డేటా సెంటర్ల డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపింది.
జెనరేటివ్ ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం సైతం మధ్య కాలానికి ఈ డిమాండ్‌ను నడిపించనున్నట్టు పేర్కొంది. ఈ బలమైన డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా సంస్థలకు అదనపు మూలధన వ్యయాలు అవసరం అవుతాయని, ఇవి రుణాల రూపంలో ఉండొచ్చని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల నిర్వహణ విషయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మొగ్గు చూపిస్తుండడం డేటా సెంటర్ల కంప్యూటింగ్, స్టోరేజ్ వసతుల డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది.
కరోనా తర్వాత ఈ ధోరణి పెరగడాన్ని గుర్తు చేసింది. అధిక వేగంతో కూడిన డేటా అందుబాటులోకి రావడం సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంచినట్టు తెలిపింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాలుగా మొబైల్ డేటా ట్రాఫిక్ ఏటా 25 శాతం చొప్పున పెరగడాన్ని ప్రస్తావించింది. 2024 మార్చి నాటికి నెలవారీ డేటా వినియోగం 24 జీబీకి చేరిందని, 2026 మార్చి నాటికి 33–35జీబీకి ఇది పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
భారీ పెట్టుబడులు..
‘‘పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్‌ను తీర్చేందుకు గాను వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.55,000–65,000 కోట్ల మేర పెట్టుబడులు అవసరం అవుతాయి. ప్రధానంగా భూమి, భవనాలు, విద్యుత్ ఎక్విప్‌మెంట్, కూలింగ్ పరిష్కారాల కోసం ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. భూమి, భవనం కోసమే డేటా సెంటర్ ఆపరేటర్లు మొత్తం మూలధన వ్యయాల్లో 25–30 శాతాన్ని వెచి్చంచాల్సి వస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా తెలిపారు.
ఒక్కసారి ఒప్పందం కుదిరితే డేటా సెంటర్లకు స్థిరమైన నగదు ప్రవాహాలు వస్తుంటాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి వివరించారు. ‘‘ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి మారడం అన్నది అధిక వ్యయాలతో కూడుకున్నదే కాకుండా, వ్యాపార అవరోధాలకు దారితీస్తుంది. దీంతో క్లయింట్లను అట్టిపెట్టుకునే రేషియో ఎక్కువగా ఉంటుంది’’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment