న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపారంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. గత ఐదేళ్లలో ఈ విభాగంలోకి 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని.. 2025 నాటికి మొత్తం పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు (రూ.1.6 లక్షల కోట్లు) చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ అంచనా వేసింది. స్థిరమైన ఆదాయం వచ్చే ఆస్తుల పట్ల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. డేటా సెంటర్లు – రియల్ ఎస్టేట్‌లో డిమాండ్‌పై ఈ సంస్థ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.
విధానపరమైన ప్రోత్సాహం, డిజిటలైజేషన్‌తో దేశంలో డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి టెక్నాలజీ అమలును వేగవంతం చేసిందని, దీంతో డేటా వినియోగం గణనీయమైన స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. ఓటీటీ, ఆన్‌లైన్ గేమింగ్, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, ఈ కామర్స్, ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్‌ల ఆన్‌లైన్ విద్య, లొకేషన్ ఆధారిత పని, అత్యాధుని టెక్నాలజీలు.. మెషిన్ లెర్నింగ్, 5జీ, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలసి డేటా ట్రాన్స్‌మిషన్‌ను ఎన్నో రెట్లు పెంచినట్టు.. అధిక సామర్థ్యం కలిగిన సర్వర్ల అవసరం ఏర్పడినట్టు వివరించింది.
ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం
డేటా సెంటర్లు అన్నవి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్‌లో ముఖ్యమైన ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారినట్టు సీబీఆర్‌ఈ పేర్కొంది. స్థిరమైన ఆదాయం కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నందున ఈ రంగంలో పెట్టుబడులు మరిన్ని గరిష్టాలకు చేరాతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం డేటా కేంద్రాలకు మౌలికరంగ హోదాను కల్పించడాన్ని కూడా సానుకూలంగా పేర్కొంది. ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా వేసింది.
ఈ సానుకూలతలతోనే 2025 నాటికి పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లు దాటతాయన్న అంచనాతో ఉంది. అంటే గత ఐదేళ్లలో వచ్చిన 14 బిలియన్ డాలర్లకు అదనంగా, వచ్చే ఐదేళ్లలో మరో 6 బిలియన్ డాలర్ల నిధులు ఈ రంగంలోకి రానున్నాయి. వివిధ రంగాల్లోని వ్యాపారాలు డిజిటల్ విభాగంలోకి విస్తరిస్తున్నందున డేటా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతుందని సీబీఆర్‌ఈ నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. టెక్నాలజీ, ఆటోమేషన్ అన్నవి వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో డేటా కేంద్రాలు ఏ విధంగా విస్తరిస్తాయనేదానికి కీలకమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment