2024 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు 8.9 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ నివేదిక ప్రకారం 2018లో ఈ పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లు, 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్లు, 2023లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు. రియల్ ఎస్టేట్ ఫండ్ – కమ్ – డెవలపర్లు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు మొదలైనవి చేసే ఇన్వెస్ట్‌మెంట్లను ఈక్విటీ పెట్టుబడులుగా వ్యవహరిస్తారు.
డేటా ప్రకారం జూన్ త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు కొత్త గరిష్టాలకు ఎగిశాయి. జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో రియల్టీలోకి 2.6 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని సీబీఆర్‌ఈ చైర్మన్ (భారత్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఇన్వెస్టర్లు (ప్రధానంగా డెవలపర్లు) పెట్టుబడులకు నేతృత్వం వహించారు. ఆఫీస్ లీజింగ్ మార్కెట్ పుంజుకోవడం, గృహాల కొనుగోలు.. ఖర్చు చేసే విషయంలో వినియోగదారుల్లో రిస్కు సామర్థ్యాలు అసాధారణంగా పెరగడం తదితర అంశాలు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రియల్టీలోకి పెట్టుబడులు రావడానికి దోహదపడినట్లు నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment